అతడే కింగ్ ఆఫ్ ఇండియన్ బాక్సాఫీస్!

కానీ ప్రభాస్ చిత్రాలు డిజాస్టర్ టాక్ తోనూ రికార్డులు పెడుతున్నారంటే ఆయన బాక్సాఫీస్ స్టామినా ఏంటో అర్థం అవుతుంది. కాబట్టి ఇప్పటికైతే ప్రభాసే 'కింగ్ ఆఫ్ ఇండియన్ బాక్సాఫీస్' అనుకోవచ్చు.

Update: 2024-07-24 03:53 GMT

బాక్సాఫీస్ రికార్డులు ఎప్పుడూ శాశ్వతం కాదు. ఇప్పుడొక హీరో రికార్డ్ క్రియేట్ చేస్తే, రాబోయే రోజుల్లో దాన్ని మరో హీరో బ్రేక్ చేస్తాడు.. దాన్ని ఇంకో హీరో బీట్ చేసి సరికొత్త రికార్డు సృష్టిస్తాడు. ఫిలిం ఇండస్ట్రీలో ఇదంతా ఇలా కొనసాగుతూనే ఉంటుంది.. ఎప్పటికప్పుడు రికార్డులు మారుతూనే ఉంటాయి. ఇప్పుడు లేటెస్టుగా 'కల్కి 2898 AD' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లను సాధించడంతో రెబల్ స్టార్ ప్రభాస్ పేరిట కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభాసే 'బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ స్టార్' అనే చర్చ మొదలైంది.

'బాహుబలి' సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్.. 'బాహుబలి 2' చిత్రంతో బాక్సాఫీస్ ను షేక్ చేసారు. భారతీయ చిత్ర పరిశ్రమలోనే అత్యధిక వసూళ్లు సాధించిన హీరోగా రికార్డ్ క్రియేట్ చేసారు. రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరిన మొట్ట మొదటి హీరోగా చరిత్ర సృష్టించారు. ఆ తర్వాత ఫ్లాప్ చిత్రాలతోనూ భారీ కలెక్షన్స్ సాధించారు. ఇప్పుడు టాలీవుడ్ స్టార్స్ అంతా పాన్ ఇండియా అంటున్నారు కానీ, ఈ జనరేషన్ లో దానికి బాటలు వేసింది మాత్రం డార్లింగే అని చెప్పాలి.

కల్కితో రెండు వెయ్యికోట్ల సినిమాలున్న ఏకైక దక్షిణాది హీరోగా ప్రభాస్ అరుదైన ఘనత సాధించారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ అన్నట్లు ప్రభాస్ కు రికార్డ్స్ అనేవి రొటీన్ గా మారిపోయాయని అనుకోవాలి. అయితే ప్రస్తుత బాక్సాఫీస్ లెక్కల ప్రకారం ప్రభాస్ కు పోటీగా బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ ను పేర్కొంటున్నారు ఓ వర్గం హిందీ ఆడియన్స్. ప్రభాస్ కంటే ముందే 'పఠాన్', 'జవాన్' చిత్రాలతో రెండుసార్లు 1000 కోట్ల క్లబ్ లో చేరారనే విషయాన్ని గుర్తు చేసుకున్నారు. రాజమౌళి సపోర్ట్ లేకుండా, అది కూడా రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలతో ఈ ఘనత వహించారని అంటున్నారు.

నిజానికి ఎస్.ఎస్ రాజమౌళి సినిమాలతో పాన్ ఇండియా స్టార్ గా మారినప్పటికీ, దాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగుతున్నారు ప్రభాస్. దర్శక ధీరుడి అండ లేకుండానే బ్లాక్ బస్టర్లు కొడుతున్నాడు.. ఇప్పుడు 'కల్కి 2898 AD' చిత్రంతో వెయ్యి కోట్లు కొట్టి చూపించాడు. రాధేశ్యామ్, ఆదిపురుష్ లాంటి ఫ్లాప్ సినిమాలతోనూ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు పెట్టాడు. గతేడాది 'డుంకీ'తో పోటీ పడి 'సలార్' మూవీతో భారీ విజయాన్ని అందుకొని షారుక్ ఖాన్ పైచేయి సాధించాడనే సంగతి మర్చిపోకూడదు.

ఇప్పటికైతే ప్రభాస్, షారుక్ ఖాన్ లు చెరో రెండేసి 1000 కోట్ల గ్రాస్ సినిమాలను కలిగి ఉన్నారు. కాకపోతే 'పఠాన్', 'జవాన్' చిత్రాల కలెక్షన్ల వెనుక కార్పొరేట్ బుకింగ్స్ ఉన్నాయనే టాక్ ట్రేడ్ లో ఉంది. మరోవైపు ప్రభాస్ మాత్రం ఆర్గానిక్ కలెక్షన్స్ తోనే బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. షారుక్ కు ఫ్లాప్ సినిమాలు పడితే ఫస్ట్ వీకెండ్ కే వాష్ అవుట్ అయ్యే పరిస్థితి ఉంది. కానీ ప్రభాస్ చిత్రాలు డిజాస్టర్ టాక్ తోనూ రికార్డులు పెడుతున్నారంటే ఆయన బాక్సాఫీస్ స్టామినా ఏంటో అర్థం అవుతుంది. కాబట్టి ఇప్పటికైతే ప్రభాసే 'కింగ్ ఆఫ్ ఇండియన్ బాక్సాఫీస్' అనుకోవచ్చు.

Tags:    

Similar News