రజనీకాంత్‌లో కసి పెంచిన ఆ ఒక్క అవమానం!
దానిని తప్పించుకోవడం ఎవరి తరమూ కాదు! 1970ల నాటి ఒక ముఖ్యమైన సంఘటనను రజనీకాంత్ స్వయంగా అభిమానులకు షేర్ చేసారు.
భారతీయ చలనచిత్రపరిశ్రమలో రజనీకాంత్ ఒక లెజెండరీ నటుడు. తనదైన ప్రత్యేకమైన నటనతో మాస్ క్లాస్ వర్గాల్లో గొప్ప అభిమానులను సంపాదించుకున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం, సేవాగుణం, సంపాదించిన దాని నుంచి కొంత తిరిగి ఇచ్చే మంచితనం, ఆధ్యాత్మికత వంటి అంశాలు ఆయనను గొప్ప వ్యక్తిగా ఆవిష్కరించాయి. ప్రజల్లో గొప్ప అభిమానం, గౌరవం ఉన్న నటుడిగా గుర్తింపు పొందారు. స్టార్ డమ్ అన్న పదానికి నిర్వచనంగా నిలిచారు రజనీ. సూపర్ స్టార్ గా, తలైవాగా పిలుపందుకున్నారు.
అయితే ఎంతటివారికైనా అవమానం ఎదురవ్వడం అనేది సహజం. కెరీర్ ఆరంభంలో ఇలాంటివి ఎదురవుతుంటాయి. దానిని తప్పించుకోవడం ఎవరి తరమూ కాదు! 1970ల నాటి ఒక ముఖ్యమైన సంఘటనను రజనీకాంత్ స్వయంగా అభిమానులకు షేర్ చేసారు. ఆయన తన కెరీర్‌ను మలుచుకునే క్రమంలో ఎదురైన సవాల్ నిజంగా తనను మార్చింది. అది ఎప్పటికీ మరచిపోలేని ఘటన.
2020 జనవరిలో తన సినిమా 'దర్బార్' ఆడియో లాంచ్ సందర్భంగా రజనీకాంత్ తన తొలినాళ్లలోని బాధాకరమైన అనుభవాన్ని వివరించాడు. ఒక నిర్మాత తనను తీవ్రంగా అవమానించిన విషయాన్ని ప్రస్థావించారు. ఆ అవమానమే చివరికి అతడు సూపర్ స్టార్‌గా ఎదగడానికి దోహదపడింది. రజనీకాంత్ ఒక ప్రాజెక్ట్‌లో నటించడానికి పారితోషికం రూ. 6000 కి మాట్లాడుకున్నారు. అయితే అతడు తన పాత్రను కాపాడుకోవడానికి రూ.1000 అడ్వాన్స్ ఇవ్వాల్సిందిగా అభ్యర్థించాడు. షూట్ రోజున నిర్మాతను అడిగినా కానీ అతడు అడ్వాన్స్ చెల్లించలేదు. కానీ నిర్మాత హామీని నెరవేరుస్తాడని ఆశించి రజనీకాంత్ సెట్‌కి వెళ్లారు.
రజనీ వచ్చాక ప్రొడక్షన్ మేనేజర్ మేకప్ కోసం కూర్చోమని అడిగాడు. అయితే రజనీకాంత్ అడ్వాన్స్ తీసుకునే వరకు నిరాకరించాడు. నేను రూ.1000 అడ్వాన్స్ అందుకోకుండా ముందుకు వెళ్లనని అతడితో చెప్పాను. అడ్వాన్స్ కోసం రజనీకాంత్ పట్టుబట్టడంతో అసంతృప్తి చెందిన నిర్మాత తీవ్రంగా స్పందించారు. విలాసవంతమైన అంబాసిడర్ కారులో వచ్చిన నిర్మాత రజనీకాంత్‌కు ఆర్టిస్ట్‌గా ఉన్న స్థితిని ప్రశ్నిస్తూ ''నువ్వు పెద్ద ఆర్టిస్టువా? ఏంటి..? ఏవో కొన్ని సినిమాలు చేసినందున అడ్వాన్స్ లేకుండా మేకప్ కోసం కూర్చోలేవా? నీకు అవకాశం లేదిక్కడ.. బయటకి పో! అని తరిమారు''అని రజనీ వెల్లడించారు.
అవకాశం ఇవ్వకపోవడమే గాక అవమానించిన నిర్మాత తనను వాహనంలో తిరిగి డ్రాప్ చేయడానికి నిరాకరించినందున రజనీకాంత్ తనకు తానుగానే అక్కడి నుంచి ఇంటికి వెళ్ళవలసి వచ్చింది. దారిలో ప్రజలు తనను గుర్తించారు.. తాను నటించిన ఇటీవలి చిత్రం నుండి డైలాగులు చెప్పడం గమనించాడు. మొదట ప్రజలు తనను వెక్కిరిస్తున్నారని భావించాడు. అయితే ఈ అనుభవం అతడిలో విజయాన్ని సాధించి విదేశీ కారుతో ఆ స్టూడియోకి తిరిగి రావాలనే పట్టుదలను పెంచింది. చెప్పుకోదగ్గ విజయాన్ని సాధించిన తర్వాతే తాను స్టూడియోకి తిరిగి వస్తానని రజనీకాంత్ ఛాలెంజ్ చేసారు. విదేశీ కారును సొంతం చేసుకోవాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుని, దాన్ని సాధించేందుకు కృషి చేశాడు. అతడు చివరికి ఒక ఇటాలియన్ ఫియట్‌ను కొనుగోలు చేశాడు. యూనిఫారంలో ఒక డ్రైవర్‌ను నియమించుకున్నాడు.
తన మాటను నిజం చేస్తూ రజనీకాంత్ ఒకప్పుడు అవమానానికి గురైన స్టూడియోకి తిరిగి వచ్చారు. అతడు స్టైల్‌గా వచ్చాడు. నిర్మాత కారు ఉన్న చోట తన కారు పార్క్ చేసి రజనీకాంత్ గత సంఘటనను గుర్తుచేసుకున్నారు. ''నేను కాలుపై కాలు ఉంచి రాజులాగా కూర్చున్నాను. నా కారు ఏవీఎం స్టూడియోస్‌లోకి ప్రవేశించింది. రాబిన్సన్ నిర్మాత పార్క్ చేసే చోట కారును పార్క్ చేశాను. దిగి రెండు సిగరెట్లు తాగాను. గవర్నర్ వచ్చారని చాలామంది అనుకున్నారు'' అంటూ రజనీ ఛమత్కారంగా చెప్పుకొచ్చారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. గత ఏడాది 'జైలర్' వంటి బ్లాక్ బస్టర్ లో నటించారు రజనీ. తదుపరి వెట్టయాన్ ఈ ఏడాది విడుదల కానుండగా, కూలీ 2025లో విడుదలవుతుంది. ఈ రెండు సినిమాలపైనా భారీ అంచనాలున్నాయి.