14 ఏళ్ళ తరువాత.. మరోసారి ఆ హీరోతో పూరి..?
మ్యాచో స్టార్ గోపీచంద్ కోసం ఇప్పుడు పూరీ స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది.
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కు ఒకప్పుడు క్రేజ్ ఎలా ఉండేదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్ హీరోలతో పాటు యువ కథానాయకులతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు తీసి అనేక హిట్లు అందుకున్నారు. డాషింగ్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నారు. పూరీ మూవీ అంటే.. ఓ రేంజ్ లో అంచనాలు ఉండేవి. కానీ కొన్నేళ్లుగా పూరీ తీసిన సినిమాలు అంతగా ఆడడం లేదు. అప్పటిలా వరుస సినిమాలను ఆయన కూడా చేయడం లేదు.
2022లో స్టార్ హీరో విజయ్ దేవరకొండతో లైగర్ మూవీ తీసి డిజాస్టర్ అందుకున్నారు పూరీ. రీసెంట్ గా ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా డబుల్ ఇస్మార్ట్ సినిమా చేశారు. బ్లాక్ బస్టర్ హిట్ కొడదామనుకున్న పూరీకి మళ్లీ నిరాశే ఎదురైంది. ప్రేక్షకులకు డబుల్ ఇస్మార్ట్ మెప్పించలేకపోయింది. దీంతో సరైన హిట్ కొట్టాలని ఇప్పుడు పూరీ జగన్నాథ్ చూస్తున్నారు. అందులో భాగంగా సీనియర్ హీరో బాలయ్యతో ఆయన సినిమా చేస్తారని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి.
కానీ అది నిజం కాదని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. పూరీ, బాలయ్య కాంబోలో మూవీ రావడం లేదని తెలుస్తోంది. మ్యాచో స్టార్ గోపీచంద్ కోసం ఇప్పుడు పూరీ స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే 2010 లో వీరి కాంబోలో గోలీమార్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. మంచి రెస్పాన్స్ కూడా అందుకుంది. దీంతో మళ్ళీ 14 ఏళ్ళ అనంతరం ఈ కాంబో రిపీట్ అవ్వనుందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.
ఇందులో నిజమెంతో తెలియదు కానీ.. సినీ ప్రియుల్లో అంచనాలు క్రియేట్ అవ్వడం ఖాయమని చెప్పాలి. పూరీ, గోపీచంద్ కాంబోలో మళ్లీ మూవీ వస్తే బాగుంటుందని పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. గోలీమార్ కోసం గోపీచంద్ లోని ఫైర్ ను పూరీ జగన్నాథ్ బయటకు తీశారని.. ఇప్పుడు అంతకు మించి సినిమా చేస్తే హిట్ పక్కా అని చెబుతున్నారు. మరి గోపీచంద్, పూరీ కాంబో సెట్ అవుతుందో లేదో చూడాలి.
ప్రస్తుతం గోపీచంద్ విశ్వం మూవీతో బిజీగా ఉన్నారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేసింది. శ్రీను వైట్ల మార్క్ క్లియర్ గా కనిపించింది. దీంతో ఆ సినిమాతో గోపీచంద్ మంచి హిట్ కొట్టేలా కనిపిస్తున్నారు. మరి, విశ్వం మూవీ ఎలాంటి విజయం సాధిస్తుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.