బన్నీ దెబ్బకు బాలీవుడ్ టాప్ రికార్డులు బ్లాస్ట్
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన నాలుగవ సినిమా పుష్ప 2: ది రూల్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది.
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన నాలుగవ సినిమా పుష్ప 2: ది రూల్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. విడుదలకు ముందే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా కావాల్సినంత హైప్ క్రియేట్ చేసింది. ఇక విడుదల తరువాత కూడా అదే జోరు చుపిస్తోంది. నార్త్ లో ప్రమోషన్స్ చేయడం కూడా సినిమాకు కలిసొచ్చింది.
అనుకున్నట్లే బాలీవుడ్ బాక్సాఫీస్‌పై పుష్ప 2 సంచలనం సృష్టించింది. హిందీ మార్కెట్‌లో మొదటి రోజే ఈ చిత్రం సరికొత్త రికార్డును నెలకొల్పి, షారుఖ్ ఖాన్ ‘జవాన్’ ఓపెనింగ్ డే కలెక్షన్స్‌ను దాటేసింది. పుష్ప 2 హిందీ వెర్షన్ ద్వారా 65 కోట్లకు పైగా నెట్ వసూళ్లను సాధించి, తెలుగు సినిమా స్థాయిని మరింత పైకి తీసుకెళ్లింది. కలెక్షన్స్ పై మొదట రకరకాల భిన్నాభిప్రాయాలు వచ్చినప్పటికీ అవేమి నిజం కాదని తేలిపోయింది.
హిందీ బెల్ట్‌లో తెలుగు సినిమా రేంజ్‌ను పుష్ప 2 మరోసారి నిరూపించింది. షారుఖ్ ఖాన్ ‘జవాన్’ హిందీ వెర్షన్ మొదటి రోజు 65 కోట్లు వసూలు చేయగా, బన్నీ ఈ రికార్డును చెరిపేసి తన దెబ్బతో కొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇది అల్లు అర్జున్ కెరీర్‌లోనే బెస్ట్ రికార్డ్ గా నిలిచింది. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సినిమా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకోబోతున్నట్లు ట్రేడ్ వర్గాలు ఉహించగా చివరికి ఆ మాటే నిజమైంది.
ఇక ఇతర హిందీ సినిమాల ఓపెనింగ్ డే రికార్డుల విషయానికి వస్తే, పుష్ప 2 తర్వాత జవాన్ 65 కోట్లు, స్ట్రీ 2 55.5 కోట్లు, పఠాన్ 55 కోట్లతో తరువాత స్థానాల్లో ఉన్నాయి. అలాగే యానిమల్ , కేజీఎఫ్ 2 కూడా ఈ లిస్టులో ఉన్నాయి. బాహుబలి 2 41 కోట్లు రాబట్టింది. ఇక ఆదిపురుష్, కల్కి 2898, ఆర్ఆర్ఆర్ సినిమాలకు కూడా నార్త్ లో మొదటి రోజు మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఈ లెక్కన చూస్తే, తెలుగు సినిమా నుంచి మరో స్టార్ హిందీ మార్కెట్‌ను శాసించడానికి వచ్చాడని చెప్పవచ్చు.
హిందీ వెర్షన్లు (మొదటి రోజు నెట్ కలెక్షన్లు):
పుష్ప 2 – 65 – 67 కోట్ల
జవాన్ - 65 కోట్లు
స్ట్రీ 2 – 55.5 కోట్లు
పఠాన్ - 55 కోట్లు
యానిమల్ / KGF 2 – 52+ కోట్లు
బాహుబలి 2 – 41 కోట్లు
ఆదిపురుష్ - 35 కోట్లు
కల్కి 2898 AD – 24 కోట్లు
RRR - 19 కోట్లు
పుష్ప 2 సాధించిన విజయం ద్వారా అల్లు అర్జున్ బాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్స్ సరసన తన స్థానాన్ని స్థిరపరచుకున్నాడు. సినిమాకు వచ్చిన స్పందన చూస్తే, బన్నీ కేవలం తెలుగు సినిమాలకే పరిమితం కాకుండా పాన్ ఇండియా స్టార్‌గా మారడంలో విజయం సాధించాడు. ఇక విడుదల రోజున దేశవ్యాప్తంగా ఈ సినిమా సాధించిన కలెక్షన్ల విషయానికి వస్తే, తెలుగు రాష్ట్రాల్లో 73 కోట్లు, హిందీ మార్కెట్‌లో 67 కోట్లు, తమిళనాడు, కర్ణాటక, కేరళల్లో కలిపి 30 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
అంతేకాదు, విదేశాల్లో ప్రీమియర్ షోల ద్వారా $3.5 మిలియన్ వసూళ్లు సాధించి, మొత్తం కలెక్షన్లను మరో లెవెల్ కు తీసుకు వెళ్లడం విశేషం. ‘పుష్ప 2’ ద్వారా అల్లు అర్జున్ బాలీవుడ్‌లో తన స్థాయిని ప్రభాస్ తరహాలోనే పెంచుకోవడంలో విజయవంతమయ్యాడని చెప్పవచ్చు.