జక్కన్న ఇంటర్నేషనల్ ప్లానింగ్?
సూపర్‌స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించనున్న భారీ పాన్ ఇండియా సినిమా ప్రారంభోత్సవం గురించి అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు.
సూపర్‌స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించనున్న భారీ పాన్ ఇండియా సినిమా ప్రారంభోత్సవం గురించి అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. సాధ్యమైనంత తొందర్లోనే ఈ సినిమాను ప్రారంభించేందుకు జక్కన్న రెడీ అవుతున్నారని ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే ఈసారి అధికారిక లాంచింగ్ కార్యక్రమం ఏ స్థాయిలో ఉండబోతోందో కూడా ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.
మునుపటితో పోలిస్తే టాలీవుడ్ రేంజ్ అమాంతం పెరిగింది. దర్శకుడు రాజమౌళి అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫిగర్. ఆయనను స్టీవెన్ స్పీల్ బర్గ్, జేమ్స్ కామెరూన్, నోలాన్ అంతటివారే గుర్తించగలరు. అంతగా ఆర్.ఆర్.ఆర్ పేరు తెచ్చింది. హాలీవుడ్ క్రిటిక్స్ పురస్కారాలు సహా గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ అవార్డుల్లో ఆర్.ఆర్.ఆర్ పేరు మార్మోగడంతో ఈ వేదికపై కనిపించిన రాజమౌళి తదితర బృందంపై అందరి ఫోకస్ మళ్లింది. ముఖ్యంగా హాలీవుడ్ మీడియాకు ఇప్పుడు రాజమౌళి పాత వాడే.
అందుకే త్వరలో జరగనున్న మహేష్ బాబు - రాజమౌళి సినిమా (ఎంఎస్ఎంబి 29) ప్రారంభోత్సవాన్ని మునుపటిలా కాకుండా యూనిక్ గా ఇంటర్నేషనల్ రేంజులో ఉండేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నారని గుసగుస వినిపిస్తోంది. కనీసం ఒక ప్రముఖ హాలీవుడ్ అగ్ర దర్శకుడు ఈ ఈవెంట్ కి హాజరయ్యేలా, అలాగే హాలీవుడ్ మీడియా కవరేజీ జరిగేలా చూడాలని ప్లాన్ చేస్తున్నారట. రాజమౌళికి అత్యంత ఇష్టులైన స్టీవెన్ స్పీల్ బర్గ్, జేమ్స్ కామెరూన్ లను ఆహ్వానించాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందట. దీనికోసం రాజమౌళి వారసుడైన కార్తికేయను రంగంలోకి దించారు అంటూ ఒక సెక్షన్ మీడియా ప్రచారం చేస్తోంది.
నిజానికి ఆ స్థాయి దర్శక దిగ్గజాలను ఒక తెలుగు సినిమా (ఇప్పుడు పాన్ ఇండియా సినిమా) లాంచింగ్ కోసం పిలవడం అంటే అసాధారణమైన చర్య. ఈ ప్రయత్నం సఫలమవ్వాలనే ఆకాంక్షిద్దాం. కానీ అదేమీ అంత సులువేమీ కాదు. అయితే ఇంటర్నేషనల్ మీడియాను ఆహ్వానిస్తే ఆ మేరకు ప్రచారం ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతుందనడంలో సందేహం లేదు.
స్పీల్ బర్గ్ తెరకెక్కించిన ఇండియానా జోన్స్ లైన్స్ లోనే మహేష్ సినిమా ఉంటుందని ఇంతకుముందు కథనాలొచ్చాయి. అందుకే ఇప్పుడు స్పీల్ బర్గ్ నే లాంచింగ్ కార్యక్రమానికి పిలుస్తారంటూ ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే దేనికీ అధికారికంగా కన్ఫర్మేషన్ లేదు. ఇటీవల స్క్రిప్టు కు మెరుగులు అద్దుతున్నారని కీరవాణి బాణీల కోసం కసరత్తు చేస్తున్నారని టాక్ వినిపించింది. ఈ సినిమాకి కథానాయికలను కూడా ఎంపిక చేయాల్సి ఉంది. బాహుబలి సినిమాకి మొదటి ప్రెస్ మీట్ హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్లో గ్రాండ్ గా నిర్వహించారు. కానీ లాంచింగ్ హంగామా అంతంత మాత్రమే. కానీ ఆ తర్వాత ఆర్.ఆర్.ఆర్ కోసం భారీ ఈవెంట్ ని నిర్వహించడం ఆసక్తిని కలిగించింది. అయితే అవన్నీ లోకల్ గా సాగిన ప్రచారాలే. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా విదేశాల్లో మహేష్- రాజమౌళి సినిమా లాంచ్ అవుతుందా? అన్నది చూడాలి. ఇంటర్నేషనల్ మీడియా కవరేజీ అంటే .. అమెరికా ఇంగ్లండ్ లేదా ఏదైనా పెద్ద దేశంలో లాంచింగ్ చేస్తారా? అన్నది వేచి చూడాలి.