మొరగని కుక్క.. తిట్టని నోరు.. 'అర్థమైందా రాజా..' రజనీ తూటాలు ఎవరిపై?

ఇదే సందర్భంలో మరోసారి తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. ఆ ప్రసంగం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Update: 2023-08-09 10:04 GMT

బస్ కండక్టర్ నుంచి మొదలుపెట్టి దేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరో స్థాయికి ఎదిగిన వ్యక్తి రజనీకాంత్. 40 ఏళ్ల కిందటే ఆయనకు సూపర్ స్టార్ తగిలించారు. ఆ బరువు మోయలేకపోతున్నట్లు రజనీనే చాలా సందర్భాల్లో చెప్పారు. అయితే, తమిళనాడులో ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ఆయన చేస్తున్న వ్యాఖ్యాలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. తనదైన డిక్షన్ తో రజనీ చేస్తున్న ఆ విమర్శలు పాపులర్ అవుతున్నాయి.

కొంచెం అతి చేస్తున్న ఓ హీరోను, ఆయన అభిమానులను ఉద్దేశించే రజనీ వ్యాఖ్యలు చేస్తున్నారన్న అభిప్రాయమూ కలుగుతోంది. కానీ, ఆ స్థాయి వ్యక్తి ఇలా చేస్తారా..? ఆయన కంటే ఎన్నో మెట్లు కింద ఉన్న వ్యక్తిని ఉద్దేశించి విమర్శలు చేసే వ్యక్తిత్వమా? రజనీది? అనే ప్రశ్న కూడా వస్తోంది. అందులోనూ జీవితంలో అన్నీ చూసేసిన, సూపర్ స్టార్ హోదాను మించి.. సినిమాల్లో ఓ మానవాతీత కేరక్టర్ గా ఎదిగిన రజనీ ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నదీ ఎవరికీ అర్థం కావడం లేదు.

ఏమి "అర్థమైంది రాజా?"

ఇటీవల రజనీ సూపర్ స్టార్ ట్యాగ్ వ్యాఖ్యల సంచలనం నుంచి తేరుకోకముందే మరోసారి ఆయన తూటాలు పేల్చారు. 72 ఏళ్ల రజనీకాంత్ తాజాగా నటించిన సినిమా జైలర్. ఈ సినిమా ఆడియో వేడుక మంగళవారం రాత్రి జరిగింది. ఇక్కడ రజనీ హావభావాలు, సినిమా గురించి, తన కేరక్టర్, సహచరులు కేరక్టర్ గురించి మాట్లాతుండగా ఆహూతులు నవ్వు ఆపుకోలేకపోయారు. ఇదే సందర్భంలో మరోసారి తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. ఆ ప్రసంగం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఎందుకా తీవ్ర వ్యాఖ్యలు..

"మొరగని కుక్క అనేది ఉండదు.. విమర్శించని నోరు కూడా లేదు.. ఇవి రెండూ ఉండని ఊరు సైతం ఉండదు.. వీటికి భయపడి ఆగొద్దు. మనం మన పని చూసుకుంటూ పోతూనే ఉండాలి.. అర్థమైందా రాజా..?" అంటూ మంగళవారం జరిగిన ఆడియో ఫంక్షన్ రజనీ తన సినిమాల్లోని డైలాగుల తరహాలో వ్యాఖ్యలు చేశారు. జీవితంలో ఎదురైన పరిస్థితులను కూడా అదే విధంగా వివరించారు. ఆయన మాటలకు అభిమానుల స్పందన తోడై ఆడిటోరియం దద్దరిల్లింది.

ధుర్యోధనుడి గురించి..

మహాభారంతలో దుర్యోధనుడి పాత్ర గురించి ఫంక్షన్ లో రజనీ హావభావాలు పలికిస్తూ చెప్పిన డైలాగ్‌ కు చప్పట్లు మార్మోగాయి. ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాస్తవానిక రజనీ తమిళంలో మాట్లాడారు. అయితే, ఇతర భాషల వారికీ అర్థమయ్యేలా ఉన్నాయి ఆ వ్యాఖ్యలు. ఇంతకూ ప్రశ్న ఏమంటే వరుసగా కొన్ని రోజుల వ్యవధిలో రజనీ ఇంతగా ఎందుకు తీవ్ర వ్యాఖ్యలు చేశారనేది..? దానికి ఆయనే సమాధానం చెప్పాలి.. అది ఎలాగూ జరగదు. కాబట్టి మనమే అర్థం చేసుకోవాలి.

Tags:    

Similar News