రజనీకాంత్ వర్సెస్ సత్యరాజ్ వైరం వెనక!
కెరీర్ తొలినాళ్లలో కలిసి నటించిన వీరు విభేధాలతో దూరమయ్యారు. ఒకరంటే ఒకరికి గిట్టదు.
రజనీకాంత్ వర్సెస్ సత్యరాజ్! ఆ ఇద్దరూ ఎప్పటికీ మాట్లాడుకోరా? కలిసి నటించరా? ఇటీవలి కాలంలో మరోసారి తెరపైకి వచ్చిన విషయమిది...
బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ - షారూఖ్ ఖాన్ ల మధ్య వైరం గురించి తెలిసిందే. ఆ ఇద్దరూ కెరీర్ ఆరంభం స్నేహితులు.. కానీ కాలక్రమంలో విభేధాలతో దూరమయ్యారు. ఆ తర్వాత మళ్లీ రీయునైట్ అయ్యి కలిసి సినిమాల్లో నటిస్తున్నారు. ఇలాంటి వైరం చాలామంది ప్రముఖ తారల మధ్య ఉంది. అందువల్ల వారు ఒకరి సినిమాల్లో మరొకరు నటించరు. రజనీ-సత్యరాజ్ మధ్య అలాంటి వైరం ఉంది. కెరీర్ తొలినాళ్లలో కలిసి నటించిన వీరు విభేధాలతో దూరమయ్యారు. ఒకరంటే ఒకరికి గిట్టదు.
కేవలం బాలీవుడ్ లోనే కాదు.. అన్ని పరిశ్రమల్లోను స్టార్ల నడుమ ఇలాంటి శత్రుత్వాలు బయటపడుతూనే ఉన్నాయి. గత 38 ఏళ్లుగా కలిసి స్క్రీన్‌ని షేర్ చేసుకోని సూపర్‌స్టార్ రజనీకాంత్ .. కట్టప్ప సత్యరాజ్‌ల మధ్య అసలు ఏం జరిగింది? అన్నది ఇప్పటికీ చాలా మందికి తెలియదు. ఆ ఇద్దరి మధ్యా గ్యాప్ కి కారణమేమిటన్నది ఆరా తీస్తే తెలిసిన సంగతులివి..
ఇటీవల రజనీ-సత్యరాజ్ నడుమ గ్యాప్ తగ్గించేందుకు తన సినిమాలో నటింపజేసేందుకు దర్శకుడు లోకేష్ కనగరాజ్ ప్రయత్నిస్తున్నారని కథనాలొచ్చాయి. వారి దీర్ఘకాల బ్రేకప్ వెనుక ఉన్న నేపథ్యాన్ని అర్థం చేసుకోవడానికి గతంలోకి ప్రయాణం చాలా అవసరం.
మూడు దశాబ్దాల క్రితం అంటే 1994లో రజనీకాంత్ నటించిన `వీర` అఖండ విజయాన్ని అందుకుంది. దాదాపు అదే సమయంలో సత్యరాజ్- సుకన్య జంటగా నటించిన ఓ చిత్రం విడుదలకు చేరువలో ఉంది. అయితే వివక్ష కారణంగా డిస్ట్రిబ్యూటర్లు తన చిత్రానికి తక్కువ పేమెంట్ ఆఫర్ చేయడంతో సత్యరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఒక చారిత్రక ప్రదేశంలో అతడి సినిమా విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. అయితే అదే చోట రజనీకాంత్ సక్సెస్ మీట్ ప్రభుత్వ ఆమోదం పొందింది. ఈ ఘటన కర్ణాటకకు చెందిన బయటి వ్యక్తి రజనీకాంత్ కి ఇలాంటి ఛాన్స్ ఇస్తుందా? అంటూ తమిళనాడు ప్రభుత్వంపై విమర్శలకు దారితీసింది.
2006లో శివాజీ చిత్రీకరణ సమయంలోను రజనీ - సత్యరాజ్ ఆర్థిక పరిస్థితుల గురించి బోలెడంత చర్చ జరిగింది. అప్పటికి సత్యరాజ్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉండగా, రజనీ రెట్టింపు పారితోషికాలు అందుకుంటున్నారు. కారణాలేవైనా కానీ రజనీ-సత్యరాజ్ నడుమ శత్రుత్వానికి పరిష్కారం లభించలేదు. ఆ తర్వాత రాజకీయారంగేట్ర ప్రయత్నాల్లో ఉన్న రజనీకాంత్‌ను ముఖ్యమంత్రిగా చూడడం అత్యంత దారుణమైన దృష్టాంతం అని పేర్కొంటూ సత్యరాజ్ అసహ్యం వ్యక్తం చేసినట్లు మీడియాలో కథనాలొచ్చాయి. పర్యవసానంగా ఆ ఇద్దరినీ కలపాలని చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఇప్పటికీ ఆ ఇద్దరూ దూరంగా ఉన్నారు. 1987లో బాలచందర్ తీసిన `మనతిల్ ఉరుడి వెండుమ్` (తెలుగులో సోదరి నందిని) సినిమాలో వారు కలిసి తెరపై చివరిగా కనిపించారు. ఇప్పుడు లోకేష్ కనగరాజ్ భారీ చిత్రం `కూలీ`లో ఇద్దరు పెద్ద స్టార్లు కలిసి కనిపించనున్నారు. ఏది ఏమైనా ఇద్దరు దిగ్గజ నటులను కలుపుతున్న పుణ్యం లోకేష్ కే దక్కుతుంది సుమీ!