గేమ్‌ ఛేంజర్‌ : చరణ్ చెప్పే ఆ డైలాగ్‌ చాలా స్పెషల్‌

తాజాగా ఈ సినిమా గురించి మరో ఆసక్తికర వార్త ఒకటి యూనిట్‌ నుంచి లీక్ అయ్యింది.

Update: 2024-12-04 22:30 GMT

రామ్‌ చరణ్ డ్యూయెల్‌ రోల్‌లో నటిస్తున్న గేమ్‌ చేంజర్ సినిమా 2025 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ అంచనాల నడుమ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ సినిమాలో చరణ్‌ రెండు పాత్రలు చాలా స్పెషల్‌గా ఉంటాయని అంటున్నారు. ముఖ్యంగా తండ్రి పాత్రను మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటారు అంటూ యూనిట్‌ సభ్యులు ప్రమోషన్‌లో భాగంగా చెబుతూ వస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి మరో ఆసక్తికర వార్త ఒకటి యూనిట్‌ నుంచి లీక్ అయ్యింది.

ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ ఒక ముఖ్యమైన సన్నివేశంలో చెప్పే డైలాగ్‌ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందట. ఆ లెంగ్తీ డైలాగ్‌ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని కూడా వారు అంటున్నారు. సినిమాలో వచ్చే ప్రతి డైలాగ్‌ ఆలోచింపజేసే విధంగా ఉంటుంది. ఇక ఆ డైలాగ్‌ ఎన్నో సంవత్సరాలు గుర్తుంచుకునే విధంగా ఉంటుంది అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ప్రముఖ ఈ మాటల రచయిత సాయి మాధవ్‌ బుర్ర ఈ సినిమాకు డైలాగ్స్‌ అందిస్తున్నారని, ఆయన రాసిన ప్రతి డైలాగ్‌ చాలా స్పెషల్‌ కాగా, ఈ లెంగ్తీ డైలాగ్ అంతకు మించి అన్నట్లుగా ఉంటుందని మేకర్స్‌ చెబుతున్నారు.

రామ్ చరణ్ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా తర్వాత గ్లోబల్‌ స్టార్‌గా మారిపోయిన విషయం తెల్సిందే. అందుకే గేమ్‌ ఛేంజర్‌ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. రికార్డ్‌ స్థాయి వసూళ్లు సాధించడం కోసం భారీ ఎత్తున సినిమాను ప్రమోషన్‌ చేస్తూ ఉన్నారు. ఏకంగా యూఎస్‌లోనే ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెలలోనే ప్రీ రిలీజ్ అక్కడ ఉంటుంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న గేమ్‌ ఛేంజర్‌ సినిమాకు సంబంధించిన రీ రికార్డింగ్‌ వర్క్ జరుపుకుంటోంది.

సంక్రాంతికి గేమ్‌ ఛేంజర్‌ సినిమాతో పాటు వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదల కాబోతుంది. అదే కాకుండా మరో వైపు బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న డాకు మహారాజ్ సినిమా సైతం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రికార్డ్‌ స్థాయిలో ఈ సినిమా బడ్జెట్‌తో రూపొందింది. కనుక సంక్రాంతి సినిమాల్లో ఈ సినిమానే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఇతర రెండు సినిమాలతో పోల్చితే ఈ సినిమా దాదాపు మూడు నాలుగు రెట్ల అధిక బడ్జెట్‌తో సినిమా రూపొందింది. మరి సంక్రాంతి బరిలో ఈ సినిమా ఏ మేరకు విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News