ఆ జర్నీపై రష్మిక ఎమోషన్.. టార్గెట్ కానున్నారా?

కారణం.. ముంబయిలో ఆమె ప్రయాణించిన వంతెన గురించి గొప్పగా పోస్టు చేయటమే.

Update: 2024-05-15 04:01 GMT

గతంలో మాదిరి పరిస్థితులు లేవు. ఇప్పుడున్న వాతావరణం వేరు. పాజిటివ్ గా ఎంత ఉన్నప్పటికి ఎవరో ఒకరి నెగిటివ్ కు టార్గెట్ కాకుండా బయటపడలేని పరిస్థితి. తమ భావోద్వేగాల్ని ఓపెన్ గా వెల్లడించేందుకు సోషల్ మీడియా వేదికలు వచ్చేసిన వేళ.. సెలబ్రిటీలు తమ మనసులోని అభిప్రాయాల్ని అందరితో పంచుకుంటున్నారు. అయితే.. టైమింగ్ తో పాటు.. తాము ఎవరి గురించి చెబుతున్నాం? తాము చెప్పిన విషయాలు ఏ టర్న్ తీసుకోనున్నాయి? లాంటి వాటి గురించి పెద్దగా ఆలోచించకుండా పోస్టులు పెట్టే వారు టార్గెట్ అవుతున్న దుస్థితి. తాజాగా ఆ జాబితాలో ప్రముఖ హీరోయిన్ రష్మిక చేరనున్నారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.


కారణం.. ముంబయిలో ఆమె ప్రయాణించిన వంతెన గురించి గొప్పగా పోస్టు చేయటమే. ఈ భారీ వంతెనను మోడీ సర్కారు పూర్తి చేసింది. రూ.21వేల కోట్ల రూపాయిలతో అత్యధిక భాగం సముద్రం మీద నిర్మించిన ఈ వంతెన కారణంగా 2 గంటల ప్రయాణ సమయం కేవలం 20 నిమిషాల్లో పూర్తి కావటం తెలిసిందే. ముంబయి ట్రాన్స్ హార్బర్ లింక్ పై తాజాగా ఆమె స్పందించారు. ఇటీవల తాను ప్రయాణించిన ప్రయాణ అనుభూతిని ఆమె సోషల్ మీడియా పోస్టు ద్వారా షేర్ చేసుకున్నారు.

రెండు గంటల జర్నీ కేవలం 20 నిమిసాల్లోనే పూర్తి చేయొచ్చని.. ఇలాంటివి సాధ్యమవుతాయని ఎవరూ అనుకోలేదన్నారు. భారత్ వేగంగా డెవలప్ అవుతుందన్న ఆమె.. ఇప్పుడు మనల్ని ఎవరూ ఆపలేరన్నారు. యువ భారత్ దేనినైనా సాధించగలదన్న ఆమె మాటలన్నీ మోడీ సర్కారుకు అనుకూలంగా చేసినట్లుగా కనిపించటం ఆమెకు ఇబ్బందుల్ని తెచ్చి పెడుతుందంటున్నారు. ముంబయిలోని సేవ్రీ నుంచి రాయ్ గడ్ లోని నహవా శేవాను కలుపుతూ ఆరు లేన్లుగా నిర్మించిన అటల్ సేతు మొత్తం 21.8 కిలోమీటర్లన్న సంగతి తెలిసిందే.

అందులో 16 కి.మీ. పైనే అరేబియా సముద్రం మీద ఉండటం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. రూ.21,200 కోట్లతో నిర్మించిన ఈ వంతెన కారణంగా రెండు గంటలు పట్టే ప్రయాణ సమయం 20 నిమిషాల్లో పూర్తి అవుతోంది. మంచిని మంచిగా చెప్పటం తప్పేం కాదు కానీ.. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఆమె పెట్టిన పోస్టు కొందరికి టార్గెట్ గా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికల సమయంలో కాకుండా విడి వేళలో ఈ పోస్టు పెట్టి ఉంటే పరిస్థితి మరోలా ఉంటుందన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.

Tags:    

Similar News