హిట్ ట్రాక్‌లో ఉన్న నిర్మాతకు లైలా దెబ్బ!
విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లైలా సినిమా విడుదలకు ముందు మంచి హైప్‌ను క్రియేట్ చేసింది.
విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లైలా సినిమా విడుదలకు ముందు మంచి హైప్‌ను క్రియేట్ చేసింది. టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా విశ్వక్ లేడీ గెటప్ వేయడం సినిమాకు కొత్త టచ్ ఇచ్చినట్లు అనిపించింది. దానివల్లే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగింది. అయితే, రిలీజ్ తర్వాత మాత్రం ఊహించని విధంగా సినిమా నిరాశపరిచింది. ముఖ్యంగా మంచి టేస్ట్ ఉన్న నిర్మాత సాహు గరపాటికి ఈ సినిమా ఊహించని నష్టాన్ని కలిగించింది.
సినిమా విడుదల అనంతరం నెగటివ్ టాక్ బాగా ప్రభావం చూపింది. విశ్వక్ సేన్ తన పాత్రకు సరైన మేకోవర్ తీసుకున్నా, హార్డ్ వర్క్ బాగా చేసినా, రొటీన్ కమర్షియల్ ఎలిమెంట్స్ సినిమాను నిలబెట్టలేకపోయాయి. స్టోరీ నడిపించిన విధానం, స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేయలేదు. అయితే, నిర్మాత సాహు గరపాటి నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గకుండా జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. సినిమా విజువల్స్ పరంగా, మేకింగ్ పరంగా మంచి స్టాండర్డ్స్ కనిపించాయి.
కానీ, సినిమా కంటెంట్ లోపం వల్ల మొదటి షోకే నెగిటివ్ టాక్ రావడంతో ఫస్ట్ డే ఓపెనింగ్స్ చాలా తక్కువ వచ్చాయి. విశ్వక్ సేన్ గత సినిమాలతో పోల్చుకుంటే, ఈ సినిమా ప్రారంభ కలెక్షన్లు చాలా తక్కువ స్థాయిలో నమోదయ్యాయి. విడుదలైన థియేటర్లలో చాలా చోట్ల టికెట్ బుకింగ్స్ అసలు జరగలేదు. వారాంతంలోనైనా కలెక్షన్లు మెరుగుపడతాయని నిర్మాత భావించినా, దాని జాడ కూడా కనిపించలేదు.
ఈ సినిమా వల్ల నిర్మాతకు భారీ నష్టాలు వచ్చాయి. వాస్తవానికి థియేట్రికల్ బిజినెస్ పరంగా చూస్తే, ఈ సినిమా దాదాపు రూ.6 కోట్లు నష్టాలను కలిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లైలా చిత్రం రన్ పూర్తయిన తర్వాత నష్టాల లెక్క పూర్తి స్థాయిలో తెలుస్తుంది. నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారా కొంత మేరకు లాస్ కవర్ చేసుకున్నా, థియేట్రికల్ రన్ పూర్తిగా ఫెయిల్ కావడంతో పెద్ద దెబ్బె పడింది.
సాహు గరపాటి సినిమాల గురించి చూస్తే, ఆయన మునుపటి ప్రాజెక్టులు మంచి విజయాలను అందుకున్నవే. మజిలీ, భగవంత్ కేసరి లాంటి హిట్లు ఇచ్చిన నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకోవడంలో ప్రత్యేకమైన టేస్ట్ ఉన్న నిర్మాతగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో భారీ సినిమా నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు.
మంచి ఫామ్‌లో ఉన్న నిర్మాతకు లైలా లాంటి ఫ్లాప్ రావడం మాత్రం బ్యాడ్ లక్ అని చెప్పాలి. కానీ, ఆయన నెక్ట్స్ లైన్‌లో ఉన్న ప్రాజెక్టులు మాత్రం భారీ హిట్‌లుగా నిలుస్తాయని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చిరంజీవితో చేయబోయే సినిమాతో పాటు, మరికొన్ని హై-క్వాలిటీ కంటెంట్ సినిమాలను ఆయన నిర్మించేందుకు రెడీ అవుతున్నారు. మరి నెక్స్ట్ సినిమాతో ఆయన ఎంతవరకు బౌన్స్ బ్యాక్ అవుతారో చూడాలి.