నాన్న, నువ్వు చనిపోతావా ... దాడి తర్వాత సైఫ్‌ మొదటి స్పందన

ఇంట్లో అంతమంది ఉండగా ఎందుకు తైమూర్‌తో సైఫ్‌ ఆసుపత్రికి వెళ్లాడని ప్రశ్నలు వచ్చాయి.

Update: 2025-02-10 11:56 GMT

బాలీవుడ్‌ స్టార్‌ నటుడు సైఫ్ అలీ ఖాన్‌ ఇంట్లోకి చొరబడి దుండగుడు కత్తితో దాడి చేసిన ఘటన దేశం మొత్తం చర్చనీయాంశం అయ్యింది. ఆ సమయంలో సైఫ్ అలీ ఖాన్‌ తన పిల్లల రక్షణ కోసం ఏం చేసేందుకు అయినా సిద్ధం అయ్యాడు. దాంతో దుండగుడి చేతిలో కత్తి ఉన్నా తన కొడుకును రక్షించుకునేందుకు ప్రయత్నించాడు. దాదాపు వారం రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన సైఫ్ అలీ ఖాన్‌ పూర్తి ఆరోగ్యంగా డిశ్చార్జ్‌ అయ్యాడు. దాంతో అభిమానులతో పాటు అంతా ఊపిరి పీల్చుకున్నాడు. సైఫ్ అర్థరాత్రి కత్తి గాయాలతో ఆసుపత్రికి వెళ్లిన సమయంలో పక్కన కొడుకు తైమూర్‌ ఉండటం మరింత చర్చకు తెర తీసింది. ఇంట్లో అంతమంది ఉండగా ఎందుకు తైమూర్‌తో సైఫ్‌ ఆసుపత్రికి వెళ్లాడని ప్రశ్నలు వచ్చాయి.

ప్రశ్నలన్నింటికి సమాధానాలు చెప్పే విధంగా సైఫ్‌ అలీ ఖాన్‌ ఇటీవల ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్ని విషయాలపై స్పష్టత ఇచ్చాడు. ఆ రాత్రి సమయంలో ఏం జరిగింది, ఆ తర్వాత ఏం చేశారు అనే విషయాలను గురించి క్లీయర్‌గా సైఫ్ అలీ ఖాన్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు. కత్తితో తనను దుండగుడు పొడిచినట్లు అర్థం కాలేదని, ఆ తర్వాత తర్వాత అర్థం అయ్యిందని చెప్పుకొచ్చాడు. వీపు మీద గాయం గురించి తనకు మొదట తెలియదని అన్నాడు. రక్తం వస్తూ ఉండటాన్ని చూసి గాయాలను గుర్తించినట్లు ఆయన పేర్కొన్నాడు. కరీనా ఆందోళన చెందుతూ ఉంటే పిల్లలను చూసుకోమని కంగారు వద్దని చెప్పాను.

వీపు భాగంలో నొప్పి అనిపించడంతో కత్తితో దాడి జరిగిందని గుర్తించాం. వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని పలువురికి ఫోన్‌లు చేశాం. ఆ సమయంలో ఎవరి నుంచి ఫోన్‌లో స్పందన లేదు. దాంతో తాను సహయకుడితో ఆసుపత్రికి వెళ్లాలని భావించాను. అప్పుడే నా పరిస్థితి చూసి తైమూర్‌ నాన్న... నువ్వు చనిపోతావా అంటూ ఆవేదనతో అడిగాడు. అప్పుడు అతడికి ధైర్యం చెప్పాను. ఆసుపత్రికి వెళ్లే సమయంలో తాను వస్తానంటూ తైమూర్‌ పట్టుబట్టాడు. అప్పుడు నేను ఆసుపత్రిలో ఒకరు తనకు తోడు ఉండాలనే ఉద్దేశ్యంతో తైమూర్‌ను తీసుకు వెళ్లాను. నాకు ఏమైనా పక్కన కొడుకు ఉన్నాడనే నమ్మకం ఉంటుందని తీసుకు వెళ్లినట్లు సైఫ్ అలీ ఖాన్‌ పేర్కొన్నారు.

దాడి కేసును చాలా స్పీడ్‌గా పోలీసులు ఛేదించేందుకు ప్రయత్నించారు. ఇప్పటికే దాడికి పాల్పడిన దుండగుడిని పట్టుకున్నారు. ఇటీవలే ఐడెంటిఫికేషన్‌ పరేడ్‌ను నిర్వహించారు. సైఫ్ ఇంటి సభ్యులు అతడిని గుర్తించారు. అతడే దోషి అని వారు చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే దుండగుడి గా భావిస్తున్న వ్యక్తిని కోర్టు ముందు హాజరు పరచారు. ప్రస్తుతం కేసు కోర్టు పరిధిలో ఉంది. మరో వైపు సైఫ్‌ అలీ ఖాన్ గాయాల నుంచి పూర్తిగా కోలుకున్నారు. మరికొన్ని రోజుల్లోనే ఆయన షూటింగ్స్‌కి హాజరు అయ్యే అవకాశాలు ఉన్నాయని బాలీవుడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

Tags:    

Similar News