త్రివిక్రమ్ BRO రూపంలో టైం వచ్చింది: సముద్రకని
"ఎక్కడో చిన్న గ్రామంలో పుట్టి చెన్నైలో అడుగుపెట్టి.. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి బ్రో సినిమా చేశాను.
పవన్ కల్యాణ్ - సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన 'బ్రో' ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. తాజాగా హైదరాబాద్ లో జరిగిన ప్రీరిలీజ్ వేడుకలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్ఫూర్తివంతమైన స్పీచ్ యువతరంలో ఉత్సాహం పెంచింది. ఇక ఇదే వేదికపై పవన్ కల్యాణ్ - త్రివిక్రమ్ రూపంలో తనకు టైం వచ్చిందని దర్శకుడు సముద్రకని ఎమోషనల్ అయ్యారు.
ఆయన స్పీచ్ ఆద్యంతం టైం గురించిన ప్రస్థావన ఆసక్తిని కలిగించింది. సముద్రకని మాట్లాడుతూ-"ఎక్కడో చిన్న గ్రామంలో పుట్టి చెన్నైలో అడుగుపెట్టి.. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి బ్రో సినిమా చేశాను. నాకు టైం వచ్చింది కాబట్టే ఇది సాధ్యమైంది. నేనేదీ ప్లాన్ చేయలేదు.. దానంతట అదే జరిగింది. మన పని మనం చేస్తుంటే మన టైం వస్తుంది" అని అన్నారు.
ఒకసారి త్రివిక్రమ్ అన్నతో మాట్లాడుతున్నప్పుడు నాకొక ఫోన్ కాల్ వచ్చింది. నేను చేసిన సినిమా విడుదలై పది రోజులు అవుతుంది. ఒక 73 ఏళ్ళ పెద్దాయన సినిమా చూసి బాగా ఎమోషనల్ అయ్యి నాకు ఫోన్ చేసి మాట్లాడారని చెప్పాను.అన్నయ్య కథ చెప్పమంటే ఒక పది నిమిషాల్లో చెప్పాను. ఆయనకు కథ నచ్చి పవన్ కళ్యాణ్ గారితో చేస్తే బాగుంటుంది అన్నారు.
అప్పుడు త్రివిక్రమ్ అన్నయ్య రూపంలో నేను టైంని చూశాను. పవన్ కళ్యాణ్- సాయి ధరమ్ తేజ్ కలయికలో ఇలా చేస్తే బాగుంటుందని ఆయనే చెప్పారు.అప్పటినుంచి ఏడాదిన్నర ఈ సినిమా గురించే పని చేస్తూ ఉన్నాను.
ఎప్పుడూ ఒక్క శాతం కూడా నమ్మకం కోల్పోలేదు. టైం కోసం ఎదురుచూశాను... టైం వచ్చింది. టైం(పవన్ కళ్యాణ్)ని కలిశాను'' అంటూ ఛమత్కారంగా మాట్లాడారు.
70 రోజులు చేయాల్సిన పనిని 20 రోజుల్లో చేశాను.అంత పవర్ ఉంది..అంత ఎనర్జీ ఉంది... పవన్ కళ్యాణ్ గారితో కలిసి పనిచేయడం అదృష్టం. సోదరుడు తేజ్ తో పని చేయడం సంతోషంగా ఉంది అని సముద్రకని అన్నారు. శంభో శివ శంభో సహా పలు బ్లాక్ బస్టర్ చిత్రాలకు సముద్రకని దర్శకత్వం వహించారు. నటుడిగా ఆయన పలు విలక్షణ పాత్రలతో మెప్పించారు.