సంక్రాంతికి వస్తున్నాం బాక్సాఫీస్: 13వ రోజు మరో సాలీడ్ రికార్డ్
విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రేక్షకుల మన్ననలు అందుకుంటూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.
విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రేక్షకుల మన్ననలు అందుకుంటూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి పండుగకు సరైన ఎంటర్‌టైనర్‌గా నిలుస్తూ మంచి విజయాన్ని సాధించింది. కామెడీ, క్రైమ్ డ్రామా, యాక్షన్ ఎలిమెంట్లను సమర్థవంతంగా మిక్స్ చేసి అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించింది. సినిమా విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ చిత్రం, 13 రోజులు పూర్తి అయినా థియేటర్లలో సందడి కొనసాగిస్తోంది.
పండుగ ముగిసిన తర్వాత కూడా ఈ సినిమా కలెక్షన్లు తగ్గకపోవడం, థియేటర్ల వద్ద రష్ కొనసాగుతుండటం ఈ చిత్ర విజయానికి అసలు నిదర్శనం. కుటుంబ ప్రేక్షకుల మద్దతుతో పాటు మాస్ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యే కథనంతో సినిమాకు ఎక్కడా డౌన్ ఫాల్ కనిపించడం లేదు. ఈ సినిమా ఎఫర్ట్‌లెస్ హిట్‌గా నిలుస్తూ, తెలుగు సినిమాకు ఒక ప్రత్యేక విజయాన్ని అందించింది.
ఇక లేటెస్ట్ గా సినిమా నైజాం ఏరియాలో 13వ రోజుకు కూడా కొత్త రికార్డును సృష్టించింది. ఈ రోజు ఒక్కరోజే భారీగా 5.5 కోట్లు గ్రాస్ రాబట్టగా, షేర్ 3 కోట్లు సంపాదించడం విశేషం. ఈ సంఖ్యలు నాలుగవ రోజు కలెక్షన్లను దాటేయడం గమనార్హం. సాధారణంగా సినిమా నాలుగో రోజుకి వచ్చిన కలెక్షన్లను 13వ రోజు మళ్లీ అందుకోవడం అంటే బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ హవా కొనసాగుతోందో అర్థం చేసుకోవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఈ చిత్రం 260 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటేసింది. నైజాం, సీడెడ్, విశాఖ వంటి ప్రాంతాల్లో మరిన్ని రికార్డులు సృష్టించే దిశగా ముందుకు సాగుతోంది. అమెరికాలో కూడా సంక్రాంతికి వస్తున్నాం సత్తా చూపించింది. ఇప్పటివరకు $2.6 మిలియన్ డాలర్లు రాబట్టిన ఈ చిత్రం, $3 మిలియన్ క్లబ్‌లో చేరడానికి సిద్ధంగా ఉంది.
ఈ చిత్ర విజయానికి ప్రధాన కారణాల్లో ఒకటి అనిల్ రావిపూడి మేకింగ్ స్కిల్, అలాగే వెంకటేష్ ఎనర్జీ అని చెప్పుకోవచ్చు. వినోదానికి పెద్ద పీట వేస్తూ, అన్ని వర్గాల ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించడం అందరి వల్ల అయ్యే పని కాదు. ఈ సినిమా మరో పక్క బ్రేక్ ఈవెన్ దాటి, పంపిణీదారులకు లాభాలు అందిస్తోంది. ఇక చిత్ర యూనిట్ ఎప్పటికప్పుడు ఆడియెన్స్ కు స్పెషల్ గా కృతజ్ఞతలు చెబుతూనే ఉంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా, వెంకటేష్ కెరీర్‌లోనే కాదు, తెలుగు సినిమా చరిత్రలో ఒక ప్రత్యేకమైన రికార్డ్ గా నిలవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.