చిరంజీవి మనిషినని అవకాశాలివ్వలేదు!
మెగాస్టార్ చిరంజీవి స్పూర్తితో ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అయిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు.
మెగాస్టార్ చిరంజీవి స్పూర్తితో ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అయిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు. నటులుగా, దర్శకులుగా, నిర్మాతలుగా ఆయన కోసం వచ్చి ఎంతో మంది పరిశ్రమలో వివిధ శాఖల్లో స్థిరపడ్డారు. మెగా ఇమేజ్ తో ఎంతో మంది అవకాశాలు సైతం అందుకున్నారు. మెగాస్టార్ రికమండీషన్ ఉంటే? ఏదర్శక-నిర్మాతైనా కాదంటరా? ఆయన మాటనే వరంగా భావించి అవకాశం కల్పిస్తారు. తాజాగా చిరంజీవి పేరు కారణంగా అవకాశాలు కోల్పోయిన నటుడు ఉన్నాడు? అన్న సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆ వివరాల్లోకి వెళ్తే.. సీనియర్ నటుడు ప్రసాద్ బాబు సుపరిచితుడే. ఎన్నో సినిమాల్లో నటించాడు. నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నారు. అలాగే ఎన్నో సీరియళ్లలో కూడా నటించారు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఓ ఇమేజ్ ఉన్న నటుడాయన. అంత ఫేమస్ అయిన ప్రసాద్ బాబు కొంత కాలంగా నటనకి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్వ్యూలో తన మనోగతంతో పాటు..చిరుతో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. అదేంటే ఆయన మాటల్లోనే..
`ఎన్టీ రామారావుగారి షూటింగ్ ఒకటి చూసిన తర్వాత నటుడిని కావాలనే ఒక కోరిక బలపడింది. నాతో పాటు ప్రయత్నాలు చేసిన గిరిబాబు , రంగనాథ్, శరత్ బాబు అంతా నా కంటే ముందుగా అవకాశాలు తెచ్చుకున్నారు. ఆ తరువాత నాకు ఛాన్స్ వచ్చింది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే అవమానాలను ఎదుర్కున్నాను. ఇంటి దగ్గర నుంచి నాన్న డబ్బు పంపించేవారు. దేనికీ లోటు ఉండేది కాదు. కానీ నటుడిగా నిరూపించుకోవడం కోసం ఎన్నో అవమానాలను భరించాను.
చిరంజీవిగారితో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయనతో కలిసి చాలా సినిమాలు చేశాను. ఇద్దరం కలిసి భోజనం చేసేవాళ్లం . వాకింగ్ చేసేవాళ్లం. చిరంజీవి మనిషి అనే కారణంగా నాకు అవకాశాలు ఇవ్వని వాళ్లు కూడా ఉన్నారు. చెన్నైలో నేను ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు అడగ్గానే చిరంజీవి గారు నాకు వెంటనే సాయం చేశారు. ఒకానొక సమయంలో ఆ ఇల్లు అమ్మేయాలనుకున్నప్పుడు శోభన్ బాబు గారు అలా చేయవద్దని చెప్పారు. ఆయన మాట వినడం మంచిదైంది` అని అన్నారు.