అభిమానులకు సూపర్‌స్టార్ రెక్వస్ట్
Shah Rukh Khan Asks Fans To Shower Love As kids Aryan Khan And Suhana
అభిమానులు తమ ఫేవరెట్ స్టార్ కోసం పడి చచ్చిపోవడం లేదా విపరీత ఫ్యానిజం పేరుతో రెచ్చిపోవడం సౌత్ లో ఎక్కువగా కనిపిస్తుంది. తమ ఫ్యాన్స్ భావజాలానికి తగ్గట్టుగా చాలా దిగొచ్చి, అణగిమణిగి తమ సొంత కుటుంబ సభ్యులతో ఉన్నట్టు ప్రవర్తించడం సౌత్ స్టార్లకు మాత్రమే సాధ్యం. అభిమానులకు నమస్కరిస్తూ వారు లేకపోతే తాము లేనే లేమని అంటారు. అచంచలమైన ఫ్యాన్స్ ప్రేమాభిమానాలకు తమ కృతజ్ఞతలను తెలిపేందుకు మనస్ఫూర్తిగా ముందుకు వస్తారు. అంతేకాదు.. కొందరు హీరోలు తమ ఫ్యాన్స్ ఏం కోరుకుంటే, అది ఇచ్చేందుకు, అలాంటి సినిమాల్లో నటించేందుకు సిద్ధంగా ఉంటారు.
కానీ బాలీవుడ్ అలాంటిది కాదు. అక్కడ ఫ్యాన్స్ చాలా విద్యావంతులు.. పరిణతి చెందిన వారు. అందువల్ల స్టార్స్ కి అలాంటి అవసరం పడదు. బాగా ఒదిగి ఉండటం.. ఫ్యాన్స్ కి భజన చేయడం లేదా బాకా ఊదడం వంటివి అక్కడ పెద్దగా కుదరదు. అలాగే తమ స్టార్స్ కోసం ప్రాణం పెట్టేయడం, బాగా నలిగిపోవడం ఫ్యాన్స్ లో కనిపించదు. భారీ ప్రచార ఈవెంట్ల పేరుతో ఫ్యాన్స్ ని ఒకచోట భారీగా పోగు చేయడం వంటి వ్యవహారాలు కూడా అక్కడ సాగవు. అలాగే చిన్న నగరాలకు వెళ్లి ఫ్యాన్స్ తో మమైకం అయ్యే సీన్ బాలీవుడ్ పెద్ద స్టార్లకు ఉండదు.
కానీ ఇటీవల పరిస్థితి చూస్తుంటే, అందుకు భిన్నంగా మారుతోంది. ఇప్పుడు ఉత్తరాది స్టార్లు కూడా దక్షిణాది స్టార్లను అనుకరిస్తున్నారు. ఫ్యాన్స్ ని బాగా పట్టించుకుంటున్నారు. వీలున్న ప్రతి సందర్భంలో వారికి భజన చేస్తున్నారు. ఒక రెగ్యులర్ ప్రాక్టీస్ లా ఇంటివద్ద గుమిగూడే ఫ్యాన్స్ కి ఫ్లైయింగ్ కిస్ లు ఇవ్వడం, వారికి సెల్ఫీలు ఇవ్వడం వగైరా కామన్ గా ఉన్నా కానీ మరీ ఇలా దిగొచ్చి ఫ్యాన్స్ ని బతిమాలుకునే సన్నివేశాలు మనం చూడటం చాలా అరుదు. కానీ ఇటీవల హిందీ స్టార్లు మారారు. ఫ్యాన్స్ ని ఎక్కువ అభ్యర్థిస్తున్నారు.
అయితే ఈ మార్పు అనూహ్యమైనది. పాన్ ఇండియన్ ట్రెండ్ లో ఉత్తరాది హీరోలు దక్షిణాదిన కూడా ప్రమోషన్స్ కి వస్తున్నారు. అన్నిచోట్లా ఫ్యాన్స్ కోసం తహతహలాడుతున్నారు. ఫ్యాన్స్ పెరిగే కొద్దీ బాక్సాఫీస్ కలెక్షన్లు పెరుగుతాయనే నమ్మకం ఇప్పుడు వారికి పెరిగింది. దానికి తగ్గట్టుగా వారి ప్రవర్తనను మార్చుకుంటున్నారు. ఇప్పుడు తనయుడు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్న నెట్ ఫ్లిక్స్ సిరీస్ కి షారుఖ్ ఖాన్ ప్రమోషన్ చేస్తున్నాడు. తన కొడుకు, కుమార్తె సుహానా ఖాన్ ల సినీ ప్రయాణానికి మద్దతు ఇవ్వాలని ఆయన అభిమానులను అభ్యర్థిస్తున్నారు. ఆర్యన్ సిరీస్ `ది బిఎ**డిఎస్ ఆఫ్ బాలీవుడ్` విజయానికి సహకరించాల్సిందిగా ఖాన్ కోరారు. ఆర్యన్ ఖాన్ దర్శకనిర్మాతగా, ఆల్ రౌండర్ అని పొగిడేసిన అతడు తనను తాను `కేవలం బ్లడీ స్టార్` అని చెప్పుకున్నాడు.
తన పిల్లలు సినిమా పరిశ్రమలో కెరీర్ ప్రారంభించారని, తమ ప్రేమ, మద్దతును అందించాలని అభిమానులను హృదయపూర్వకంగా ఖాన్ అభ్యర్థించారు. అభిమానులు తనయుడి కార్యక్రమానికి భారీ సంఖ్యలో హాజరైనందుకు షారూఖ్ కృతజ్ఞతలు తెలిపారు. తన పిల్లలు కూడా తనలాగే ప్రేమ, ఆప్యాయత, ఆశీర్వాదం అందుకుంటారని ఆశాభావం వ్యక్తం చేసారు. నేను పొందిన ప్రేమలో 50 శాతం పిల్లలు పొందినా అది వారికి చాలా అర్థం అవుతుందని షారూఖ్ అన్నారు. అలాగే కొడుకు పేరుతో షారూఖ్ చాలా కామెడీ చేసాడు. జోకులు పేల్చాడు. మొత్తానికి తన వారసులను ప్రమోట్ చేసేందుకు ఖాన్ చాలా దిగొచ్చి ఫ్యాన్స్ ని అభ్యర్థిస్తున్నాడని అందరికీ అర్థమైంది. ఆర్యన్ తెరకెక్కించిన నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ బాలీవుడ్ స్టార్ల వ్యక్తిగత విషయాలపై సెటైరికల్ గా కామిక్ టచ్ తో ఆకట్టుకుంటుందని షారూఖ్ చెబుతున్నాడు. సుహానా ఖాన్ ది ఆర్చీస్ సిరీస్ తో పరిచయమైంది. తదుపరి షారూఖ్ తో కలిసి కింగ్ చిత్రంలో నటిస్తోంది.
ఇక ఇతర ఖాన్ లు, స్టార్లు కూడా ఇప్పుడు సౌత్ స్టార్లను పొగిడేస్తూ, ఇక్కడ అభిమానులకు టచ్ లోకి వస్తూ చాలా చేస్తున్నారు. ఇదంతా పాన్ ఇండియా మార్కెట్ కోసం పోరాటం అని కూడా భావించాల్సి వస్తోంది.