అక్కడ షారుఖ్, ఇక్కడ ప్రభాస్..!

దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి తొలిసారిగా ఆ ఫీట్ ను సాధించిన తర్వాత, అందరూ వెయ్యి కోట్ల క్లబ్ లో చేరడానికి కృషి చేస్తున్నారు.

Update: 2024-07-13 12:41 GMT

1000 కోట్ల క్లబ్ అనేది ఏ స్టార్ హీరోకైనా ఒక కల. ఇండియన్ సినిమాలో ఇప్పుడు ప్రతీ ఒక్క అగ్ర కథానాయకుడికీ ఇది మైల్ స్టోన్ మార్క్ గా మారిపోయింది. దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి తొలిసారిగా ఆ ఫీట్ ను సాధించిన తర్వాత, అందరూ వెయ్యి కోట్ల క్లబ్ లో చేరడానికి కృషి చేస్తున్నారు. ఇప్పటి వరకూ 6 భారతీయ చిత్రాలు మాత్రమే ₹1000 కోట్ల వసూళ్లు అధిగమించాయి. లేటెస్ట్ ఎంట్రీగా ప్రభాస్ నటించిన 'కల్కి 2898 AD' సినిమా కూడా ఈ జాబితాలో చేరింది.

2017లో ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన 'బాహుబలి 2: ది కన్‌క్లూజన్' సినిమా ప్రపంచవ్యాప్తంగా ₹1,850 కోట్లు వసూలు చేసి, ₹1000 కోట్ల క్లబ్ లో చేసిన మొదటి భారతీయ చిత్రంగా రికార్డ్ సృష్టించింది. ఇది దేశీయ మార్కెట్ లోనే అన్ని భాషలు కలుపుకొని ₹1,430 కోట్లు కలెక్షన్లు అందుకోవడం విశేషం. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన 'కల్కి' సినిమా వరల్డ్ వైడ్ గా 1000 కోట్ల వసూళ్లు సాధించినట్లుగా మేకర్స్ తాజాగా ప్రకటించారు.

'బాహుబలి 2' సినిమా 10 రోజుల్లో 1000 కోట్ల మార్క్ క్రాస్ చేస్తే, 'కల్కి 2898 ఏడీ' మూవీ మాత్రం ఈ కలెక్షన్స్ సాధించడానికి 15 రోజుల సమయం తీసుకుంది. ఎలా అయితేనేం ఇప్పుడు రెండుసార్లు 1000 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టిన తొలి దక్షిణాది హీరోగా ప్రభాస్ హిస్టరీ క్రియేట్ చేశాడు. కాకపోతే మన డార్లింగ్ కంటే ముందు బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ రెండు వెయ్యి కోట్ల సినిమాలున్న హీరోగా నిలిచారు.

2023 జనవరిలో షారుఖ్ నుంచి వచ్చిన 'పఠాన్' సినిమా ప్రపంచ వ్యాప్తంగా ₹1050 కోట్లు వసూలు చేసింది. అదే ఏడాది సెప్టెంబర్ లో రిలీజైన 'జవాన్' మూవీ బాక్సాఫీస్ దగ్గర ₹1148 కోట్లు కలెక్షన్లు సాధించింది. దీంతో ఒకే సంవత్సరంలో రెండుసార్లు ఈ ఘనత వహించిన హీరోగా, బ్యాక్ టు బ్యాక్ రెండు ఆల్ టైమ్ గ్రాసర్స్ కలిగిన ఏకైక ఇండియన్ యాక్టర్ గా షారుక్ రికార్డులకెక్కారు.

ఇలా నార్త్ లో షారుఖ్ ఖాన్, సౌత్ లో ప్రభాస్.. రెండేసి 1000 కోట్ల క్లబ్ మూవీస్ తో టాప్ లో నిలిచారు. అమీర్ ఖాన్ నటించిన 'దంగల్' (₹2024 కోట్లు).. రాజమౌళి తెరకెక్కించిన RRR (₹1387 కోట్లు).. ప్రశాంత్ నీల్ రూపొందించిన 'KGF 2'(₹1250 కోట్లు) సినిమాలు కూడా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. మరి రానున్న రోజుల్లో ఆమీర్ ఖాన్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, యశ్ లలో ఎవరెవరు ప్రభాస్, షారుఖ్ సరసన చేరుతారో వేచి చూడాలి.

Tags:    

Similar News