2023 బాక్సాఫీస్.. అతనే నెంబర్ వన్

భారీ అంచనాల మధ్య ఆడియెన్స్ ముందుకొచ్చిన ఆ చిత్రాలు అదే స్థాయిలో సక్సెస్ అందుకుని కాసుల వర్షం కురిపించాయి.

Update: 2023-12-30 15:30 GMT

చూస్తుండగానే 2023కి ముగింపు పలికే సమయం వచ్చేసింది. ఇప్పటి వరకు బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన సినిమాలు కూడా రానున్న చిత్రాలకు దారి వదిలేసి కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెబుతున్నాయి. అయితే ఈ ఏడాది మొదటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. అందులో రీజనల్ నుంచి పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి.

భారీ అంచనాల మధ్య ఆడియెన్స్ ముందుకొచ్చిన ఆ చిత్రాలు అదే స్థాయిలో సక్సెస్ అందుకుని కాసుల వర్షం కురిపించాయి. కొన్ని మాత్రం కంటెంట్ పరంగా నిరాశపరిచినప్పటికీ కలెక్షన్స్ మాత్రం ఓ రేంజ్లో అందుకున్నాయి. జవాన్, జైలర్, పఠాన్, సలార్ ఇలా జానర్ ఏదైనా తమ అభిమానులను ఆకట్టుకుని బాక్సాఫీస్ ముందు నిలదొక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు సాధించిన ఇండియన్ సినిమా వివరాలు బయటకొచ్చాయి.

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఈ ఏడాది ముచ్చటగా మూడు సినిమాలతో అలరించారు. పఠాన్, జవాన్, డంకీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అందులో పఠాన్, జవాన్ బ్లాక్ బస్టర్ హిట్లు అవ్వగా.. డంకీ మిక్స్ డ్ టాక్ సంపాదించుకుంది. అయితే 2023 సంవత్సరానికి గాను జవాన్ మూవీ.. అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. సూపర్ హిట్ సాధించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.1154 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. అందులో దాదాపు రూ.400 కోట్లు ఓవర్సీస్ నుంచి రాబట్టింది. నార్త్ లో దాదాపు రూ.590 కోట్ల వసూళ్లు సాధించింది. నార్త్లో ఇంత పెద్ద ఎత్తున వసూలు చేసిన తొలి బాలీవుడ్ సినిమా ఇదే. సౌత్ లో షారుక్ సూపర్ క్రేజ్ ఉండడం వల్ల జవాన్ తెలుగు, తమిళ వెర్షన్లు భారీ కలెక్షన్లు రాబట్టాయి.

బాలీవుడ్ లో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన మూవీగా జవాన్ నిలిచింది. రూ.1000 కోట్ల క్లబ్ లో చేరిన షారుక్ రెండో సినిమాగా ఘనత సాధించింది. సెప్టెంబర్ 7వ తేదీన విడుదలైన ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ సేతుపతి, లేడీ సూపర్ స్టార్ నయనతార్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె, ప్రియమణి, సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్, గిరిజా ఓక్ కీలకపాత్రలు పోషించారు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌ పై గౌరీ ఖాన్ నిర్మించిన చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.

Tags:    

Similar News