ఏదో అనుకుంటే..ఇంకేదో జరిగిందే
ఈ ప్రాంచైజీ నుంచి రిలీజ్ అయిన సినిమా లన్నీ ఇప్పటివరకూ మంచి విజయం సాధించాయి.
భారీ అంచనాల మధ్య `సింగం ఎగైన్` థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ ప్రాంచైజీ నుంచి రిలీజ్ అయిన సినిమా లన్నీ ఇప్పటివరకూ మంచి విజయం సాధించాయి. బాక్సాఫీస్ వద్ద భారీ కాసులను రాబట్టాయి. దీంతో ఈసారి `సింగం ఎగైన్` లో మరింత మంది స్టార్స్ ని తెరపైకి తెచ్చి రోహిత్ శెట్టి తెరకెక్కించాడు. భారీ తారాగణం యాడ్ అవ్వడంతో మరింత రిచ్ గా ఉంటుందని... సింగం ప్రాంచైజీకి మరింత పేరు తీసుకొస్తుందని అంతా భావించారు.
కానీ ఇది రొటీన్ పచ్చడని తొలి షోతోనే తేలిపోయింది. సినిమాకి డివైడ్ టాక్ వస్తోంది. యాక్షన్ ప్రియులు మెచ్చిన చిత్రంగా మాత్రమే నిలిచింది. రణవీర్ సింగ్ పాత్రని మరింత కఠినంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ పాత్రపై కొన్ని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అతడి పెర్మార్మెన్స్ తో ఏదో చేస్తాడనుకుంటే? ఇంకేదో చేసినట్లు కనిపిస్తుంది. ఎంతో ఎనర్జిటిక్ గా ఆ పాత్రని మలిచినా? లాజిక్ లకు దూరంగా సాగడంతో? ప్రేక్షకులు పెదవి విరిచేస్తున్నారు.
సినిమాలో చాలా సన్నివేశాలు రణవీర్ గత సినిమా `సింబా`ని పోలి ఉన్నాయనే విమర్శలు తెరపైకి వస్తున్నాయి. అదే పాత్రలో రణవీర్ తన నగ్న ఫోటోషూట్‌ను ప్రస్తావించడం, సన్నీ డియోల్ యొక్క గదర్‌ను ప్రశంసించడం వంటివి ఏమాత్రం సింక్ అవ్వడం లేదు. ఇదంతా రణవీర్ పాత్రకి అవసరమా? మరింత మెరుగ్గా చూపించడం మానేసి? కొత్తగా ఏదో చేద్దాం అనుకుని చేతులు కాల్చుకున్నారని అభిమానులు భావిస్తున్నారు.
సాధారణంగా బాలీవుడ్ దర్శకులు భారీ బడ్జెట్ తో హై ఎండ్ సినిమా తీస్తే కాస్త ఆలోచించి చేస్తారని అభిమానులు అంచనా వేస్తారు. కానీ రోహిత్ శెట్టి విషయంలో మాత్రం అలా కనిపించడం లేదు. బాజీరావ్ మస్తానీ, పద్మావత్ గల్లీ బాయ్ వంటి చిత్రాలలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న రణవీర్ వంటి స్టార్ పెర్మార్మర్ ఉన్నప్పటికీ అతడిని సరిగ్గా వినియోగించుకోలేకపోయాడని మెజార్టీ వర్గం అంటోంది. రణవీర్ అనవసరంగా యాక్షన్ ప్రాంచైజీలో వేలు పెట్టి చేతులు కాల్చుకున్నాడని విమర్శిస్తున్నారు.