అప్పుడు ఏడిపించారు.. ఇప్పుడు నవ్విస్తారట!
ఇటీవలే షూటింగ్ పూర్తి చేసిన అమీర్ ఖాన్ బృందం ప్రస్తుతం నిర్మాణానంతర పనులపై దృష్టి సారించింది
అమీర్ ఖాన్ - జెనీలియా దేశ్‌ముఖ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'సితారే జమీన్ పర్'. స్వీయదర్శకత్వంలో అమీర్ ఖాన్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'తారే జమీన్ పర్'కి సీక్వెల్ ఇది. దర్శీల్ సపారీ అనే బాల నటుడు కీలక పాత్రధారి. ఇప్పుడు సీక్వెల్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ సినిమా అప్డేట్ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు తాజాగా పెద్ద శుభవార్త అందింది. సాధ్యమైనంత తొందర్లోనే ఈ బ్లాక్ బస్టర్ మూవీ సీక్వెల్ థియేటర్లలోకి విడుదల కానుంది.
ఇటీవలే షూటింగ్ పూర్తి చేసిన అమీర్ ఖాన్ బృందం ప్రస్తుతం నిర్మాణానంతర పనులపై దృష్టి సారించింది. దర్శకుడు ఆర్.ఎస్ ప్రసన్న తన ఇన్స్టాగ్రామ్ లో ముగింపు ఉత్సవానికి సంబంధించిన ఫోటలను షేర్ చేసారు. ఫిల్మ్ క్లాప్‌బోర్డ్ దాంతో పాటు కేక్ ఈ ఫోటోల్లో కనిపించాయి. 'ఇట్స్ ఎ ర్యాప్' (చిత్రీకరణ ముగిసింది) అని రాసి ఉంది.
ఇందులో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న జెనీలియా దేశ్ముఖ్తో ఉన్న ఫోటోలను కూడా ప్రసన్న షేర్ చేసారు. ఒక ఫోటోలో.. ఇద్దరూ కెమెరా ముందు చిరునవ్వుతో కనిపించారు. 'వాట్ ఎ అబ్సల్యూట్ డిలైట్ ఆఫ్ ఎ హ్యూమన్ జెనిలియా. మీరు ఒక నిధి.. నా స్నేహితురాలు..''అని హార్ట్ ఎమోజీని షేర్ చేసారు. జెనీలియా బదులిస్తూ -''నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి. ప్రసన్న మీలాంటి దర్శకుడిని కలిగి ఉన్నవారు అదృష్టవంతులు'' అని గ్రీన్ హార్ట్ ఎమోజీ షేర్ చేసారు. ఎప్పుడూ మీకు చాలా కృతజ్ఞతలు అని కూడా రాసారు.
ఇటీవలే అమీర్ తన తదుపరి చిత్రం 'సితారే జమీన్ పర్' గురించి చాలా విషయాలు చెప్పాడు. ఈ చిత్రాన్ని క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. 'తారే జమీన్ పర్' మిమ్మల్ని ఎంతగా ఎమోషన్ కి గురి చేస్తూ ఆద్యంతం ఏడిపించిందో అంతే స్థాయిలో 'సితారే జమీన్ పర్' మిమ్మల్ని నవ్విస్తుంది... అని అన్నారు. అమీర్ ఖాన్ దర్శకత్వం వహించిన 'తారే జమీన్ పర్' డైసెక్లియా అనే రుగ్మతతో బాధపడే పిల్లాడి స్టోరి. అంతగా ఈ లోకం గురించి తెలియని అయోమయ పరిస్థితిలో ఆ పాఠశాల బాలుడి జీవితం ఎలా సాగింది? అనేదానిని తెరపై చూపారు. సీక్వెల్ చిత్రం 'సితారే జమీన్ పర్' డౌన్ సిండ్రోమ్ చుట్టూ తిరుగుతుంది. 'సితారే జమీన్ పర్' చిత్రం క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది.