మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి 300 కోట్ల హీరో వరకూ.. ఇది కదా సక్సెస్ అంటే!
తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ హీరోల్లో శివ కార్తికేయన్ కూడా ఒకరు. డబ్బింగ్ చిత్రాలతో టాలీవుడ్ జనాలను అలరించిన శివ.
తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ హీరోల్లో శివ కార్తికేయన్ కూడా ఒకరు. డబ్బింగ్ చిత్రాలతో టాలీవుడ్ జనాలను అలరించిన శివ.. ఇటీవల దీపావళి పండక్కి ''అమరన్'' సినిమాతో వచ్చారు. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ బయోగ్రాఫికల్ యాక్షన్ మూవీలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. తెలుగుతో సహా అన్ని ప్రధాన భారతీయ భాషల్లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ క్రియేట్ చేసింది. ప్రతిష్టాత్మకమైన 300 కోట్ల క్లబ్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
'అమరన్' సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇండియాలో 220 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో పాటుగా, ఓవర్సీస్ మార్కెట్ లోనే 9.10 మిలియన్ డాలర్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. గత శుక్రవారం విడుదలైన 'కంగువ' మూవీ నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ, మూడో వారంలోనూ స్ట్రాంగ్ గా నిలబడింది. దీంతో తమిళ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన ఏడవ చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. శివ కార్తికేయన్ కెరీర్ లో హయ్యెస్ట్ కలెక్షన్స్ అందుకున్న మూవీగా నిలిచింది.
కోలీవుడ్ లో ఇప్పటి వరకూ 300 కోట్ల క్లబ్ లో చేరిన సినిమాల జాబితా పరిశీలిస్తే.. 'రోబో', 'కబాలి', '2.0', 'విజిల్', 'విక్రమ్', 'పొన్నియన్ సెల్వన్ 1', 'పొన్నియన్ సెల్వన్ 2', 'వారసుడు', 'జైలర్', 'లియో', 'ది గోట్' చిత్రాలు ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్ ఎంట్రీగా ''అమరన్'' మూవీ కూడా ఈ లిస్టులో చేరింది. మార్కెట్ పరంగా టైర్-2 హీరోగా పరిగణించబడుతున్న శివ కార్తికేయన్.. 300 కోట్ల మైల్ స్టోన్ క్లబ్ లో రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్ లాంటి హీరోల సరసన చేరడం చాలా గొప్ప విషయమని చెప్పాలి. ఒక రకంగా స్టార్ హీరోల కంటే ఇది చాలా పెద్ద సక్సెస్ అని అనుకోవాలి.
టీవీ రంగంలో మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన శివ కార్తికేయన్.. ఆ తర్వాత కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేసాడు. 'ఎగన్' (తెలుగులో 'మల్లికా ఐ లవ్ యూ') అనే తమిళ సినిమాతో క్యారక్టర్ ఆర్టిస్టుగా మారాడు. 3 మూవీలో ధనుష్ ఫ్రెండ్ పాత్రలో అలరించాడు. ఆ తర్వాత సపోర్టింగ్ రోల్స్ నుంచి హీరోగా మారి వరుస విజయాలు సాధించాడు. వైవిధ్యమైన చిత్రాలు, విలక్షణమైన పాత్రలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. 'రెమో' 'వరుణ్ డాక్టర్' 'కాలేజ్ డాన్' 'మహావీరుడు' వంటి డబ్బింగ్ చిత్రాలతో తెలుగులోనూ క్రేజ్ సంపాదించాడు. 'ప్రిన్స్' అనే స్ట్రెయిట్ తెలుగు మూవీలో నటించాడు. ఇప్పుడు తాజాగా 'అమరన్' చిత్రంతో సత్తా చాటాడు.
శివ కార్తికేయన్ నటుడిగానే కాకుండా.. సింగర్ గా, లిరిసిస్ట్ గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా మల్టీ టాలెంటెడ్ అనిపించుకున్నాడు. 'డాక్టర్' మూవీలో 'ఓ బేబీ', 'బీస్ట్'లో 'అరబిక్ కుత్తు', 'డాన్' లో 'ప్రైవేట్ పార్టీ' సాంగ్స్ అతను రాసినవే. ఇక శివ కార్తికేయన్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ ను స్థాపించి నిర్మాతగానూ మారాడు శివ. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా టీవీ రంగం నుంచి సినీ ఇండస్ట్రీకి వచ్చి.. తన స్వయం కృషితో 300 కోట్ల హీరోగా ఎదగడం అంటే మామూలు విషయం కాదు. అందుకే శివ కార్తికేయన్ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు.