కంగువ.. ఈ ఛాన్స్ మిస్ చేసుకుంటే ఇంక కష్టమే!
ఇది కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. వెయ్యి కోట్లు వసూలు చేసే పొటెన్సియల్ ఉన్న సినిమా అని అభిమానులు భావిస్తున్నారు.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం "కంగువ". శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాంటసీ మూవీ మరో పది రోజుల్లో థియేటర్లలోకి రాబోతోంది. తెలుగుతో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా పది భాషల్లో రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికైతే ఈ సినిమాకి మంచి బజ్ ఉంది. టీజర్, ట్రైలర్, సాంగ్స్.. ఇలా ప్రతీది అంచనాలు కలిగించేలా ఉంది. ఇది కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. వెయ్యి కోట్లు వసూలు చేసే పొటెన్సియల్ ఉన్న సినిమా అని అభిమానులు భావిస్తున్నారు.
ఇటీవల కాలంలో సౌత్ సినిమాలు బాలీవుడ్ పై ఆధిపత్యం చెలాయిస్తున్నా.. ఒక్క తమిళ్ సినిమా కూడా నార్త్ మార్కెట్ లో సంచలనం సృష్టించలేదు. పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేదు. తెలుగు, కన్నడ చిత్రాలు 1000 కోట్ల మైల్ స్టోన్ మార్క్ ను టచ్ చేస్తున్నాయి కానీ.. కోలీవుడ్ చిత్రాలు మాత్రం ఆ దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేకపోయాయి. అయితే "కంగువ" మూవీకి ఉన్న క్రేజ్ ను బట్టి చూస్తే.. బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లు కొల్లగొట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
కంగువ సినిమాపై హీరో సూర్య చాలా హోప్స్ పెట్టుకున్నారు. చాలా కాలంగా సరైన థియేట్రికల్ సక్సెస్ లేకపోవడంతో, ఈసారి తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో పాన్ ఇండియాకి చూపించాలని ఆశ పడుతున్నారు. మరోవైపు నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా సైతం సినిమా రిజల్ట్ పై చాలా నమ్మకంగా ఉన్నారు. 1000 కోట్లు కాదు, 2 వేల కోట్లు వసూలు చేసే సత్తా ఈ మూవీకి ఉందని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఎంత కలెక్ట్ చేస్తుందనేది పక్కన పెడితే, హైప్ ను దృష్టిలో పెట్టుకొని చూస్తే, భారీ కలెక్షన్స్ ఖాయమని అనిపిస్తోంది.
'కంగువ' సినిమా నవంబరు 14న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతుంది. డిసెంబరు 5వ తేదీన 'పుష్ప 2' వచ్చే వరకూ, సూర్య సినిమా హవానే కనిపించే అవకాశం ఉంది. మధ్యలో మూడు వారాల టైం ఉంది కాబట్టి, ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద భారీ నంబర్స్ నమోదవుతాయి. ఈరోజుల్లో ఫస్ట్ వీక్ లోనే వీలైనంత కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అదనంగా మరో రెండు వారాల సమయం దొరుకుతుండటం అడ్వాంటేజ్ గా మారుతుంది. 'పుష్ప: ది రూల్' వచ్చే గ్యాప్ లో 1000 కోట్లు రాబట్టడానికి ఛాన్స్ ఉంది.
ఒకవేళ ఈసారి 'కంగువ' వెయ్యి కోట్ల క్లబ్ మిస్సయితే మాత్రం, తమిళ్ ఇండస్ట్రీ ఈ బెంచ్ మార్క్ ను చేరుకోడానికి ఇంకా చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఆ రేంజ్ లో హైప్ ఉన్న తమిళ సినిమాలేవీ ఇప్పుడు లేవు. రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్ కుమార్ లాంటి హీరోలు నటిస్తున్న చిత్రాలకు క్రేజ్ వుంది కానీ.. 1000 కోట్లు కలెక్ట్ చేసే అంత సామర్థ్యం ఉందని అనుకోలేం. అందుకే సూర్య సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అధ్బుతమైన అవకాశాన్ని వదులుకోకూడదు.
నిజానికి చాలా రోజుల క్రితమే మేకర్స్ 'కంగువ' ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ముందుగానే ట్రైలర్ ను లాంఛ్ చేసి అందరి దృష్టి పడేలా చేశారు. నార్త్ నుంచి సౌత్ దాకా అన్ని ప్రధాన నగరాలను ఒకసారి చుట్టేశారు. టీవీ షోలు, ఇంటర్వ్యూలు అంటూ ప్రచార కార్యక్రమాలతో సందడి చేస్తున్నారు. తెలుగు ప్రమోషన్స్ మీద స్పెషల్ ఫోకస్ పెడుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే వైజాగ్ లో ఈవెంట్ చేశారు.. హైదరాబాద్ లో మీడియా మీట్ పెట్టారు. ఇక్కడే గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది.
'కంగువ'లో సూర్య సరసన దిశా పటాని హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ పాత్ర పోషించారు. కొన్ని స్పెషల్ గెస్ట్ అప్పీరియన్స్ లు కూడా ఉంటాయని టాక్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి వెట్రి పళనిసామి సినిమాటోగ్రఫీ నిర్వచించారు. యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు సంయుక్తంగా నిర్మించారు. నైజాం థియేట్రికల్ హక్కులను మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ దక్కించుకుంది.