ముఖ్యమంత్రులను దేహీ అని అడుక్కోవడం తప్పు: తమ్మారెడ్డి

తాజాగా ప్రెస్‌మీట్‌ పెట్టి ఇటీవల సినీ ప్రముఖులు సీఎంతో భేటీ అవ్వడం గురించి మాట్లాడారు.

Update: 2024-12-28 12:38 GMT

'పుష్ప 2' ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన, తదనంతర పరిణామాలపై ఫిలిం ఛాంబర్ మాజీ అధ్యక్షుడు, సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ యూట్యూబ్ లో వీడియోల రూపంలో తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. తాజాగా ప్రెస్‌మీట్‌ పెట్టి ఇటీవల సినీ ప్రముఖులు సీఎంతో భేటీ అవ్వడం గురించి మాట్లాడారు. టికెట్ రేట్లు, బెనిఫిట్ షోల కోసం ముఖ్యమంత్రుల దగ్గరకు వెళ్లి దేహీ అని అడుక్కోవడం తప్పు అని కీలక వ్యాఖ్యలు చేసారు. అలానే హీరో అల్లు అర్జున్ వివాదంపై స్పందించారు.

''నన్ను పిలవలేదు.. అందుకే నేను వెళ్ళలేదు. ఇండస్ట్రీ అంటే నా ఉద్దేశ్యంలో ఛాంబర్.. ఛాంబర్ లో పెద్దోళ్ళు ఉండొచ్చు, చిన్నోళ్లు ఉండొచ్చు. వాళ్ళకి పాపులారిటీ ఉండొచ్చు ఉండకపోవచ్చు. అందరినీ సమన్వయపరచడానికే ఫిల్మ్‌ ఛాంబర్‌ ఉంది. ఎవరైనా గవర్నమెంట్ నుంచి కలవాలంటే ఛాంబర్ నుంచే కలవాలి. నిన్న జరిగిన మీటింగ్ కి అజెండా లేదు. అజెండా లేకుండా కలిస్తే నా ఉద్దేశ్యంలో పర్సనల్ గా కలిసినట్లు. నేను అనుకోవడం.. వాళ్లంతా ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ తరఫున వెళ్లి కలిశారు. ప్రస్తుతం యాక్టీవ్ గా ఉన్న ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, యాక్టర్లు వెళ్లారు''

ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్య గ్యాప్‌ వచ్చిందని అనుకుంటున్న టైములో ఈ మీటింగ్‌తో అంతా సెట్ అయిపోయింది. వీళ్ళు ఏం మాట్లాడారనేది పక్కన పెడితే, ఇష్యూ సెటిల్ అయిపోయింది. కేసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి.. దానిపై మాట్లాడకూడదని ఇరు వర్గాలు నిర్ణయం తీసుకున్నట్లు అనిపిస్తోంది. ఆ గొడవ వదిలిపోవడం సంతోషమే కదా. గద్దర్ అవార్డుల విషయంలో ఫిల్మ్‌ ఛాంబర్‌ తరఫున గతంలో కొంతమందిమి వెళ్లి ప్రభుత్వాన్ని కలిశాం. నిన్న కొందరు వెళ్లి కలిసారు. ఎవరు వెళ్లినా మేం సాల్వ్ చేసేదేమీ లేదు. ప్రభుత్వానికి ఒక సలహా ఇవ్వగలం అంతే. ప్రభుత్వం ఆలోచించే విధానాన్ని బట్టి పనులు నడుస్తాయి''

''బెనిఫిట్‌ షోలు వెయ్యకూడదు అని నేను గత 20 ఏళ్ళ నుంచీ చెబుతున్నా. అప్పట్లో మద్రాస్ లో 'మొగుడు కావాలి' సినిమాకి ఫ్రీగా ప్రీమియర్ షోలు వేశాం. ప్రీమియర్ షోలంటే ఆల్మోస్ట్ ఫ్రీగానే వేసేవారు. కానీ ఇప్పుడు డబ్బులు తీసుకుంటున్నారు.. దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. ప్లాప్ సినిమాకి టికెట్ రేట్ పెంచినా తగ్గించినా రూపాయి తేడా రాదు. ఒక పెద్ద సినిమాకి తేడా వచ్చేది 100 కోట్లు. కాబట్టి 1000 కోట్లు వచ్చిన సినిమాకి ఒక వంద కోట్లు తగ్గినా కొంప మునిగేది ఏమీ ఉండదు. ఎందుకంటే ఎంత ఖర్చు పెట్టినా సినిమా బడ్జెట్ 500 కోట్లు దాటదు. 400 కోట్లు లాభంతో సంతృప్తి చెందలేమా? మరో 100 కోట్ల కోసం ప్రజల మీద భారం వెయ్యాలా? అనేది ప్రజలు, హీరోలు, నిర్మాతలు.. అందరూ ఆలోచించాలి. దీని కోసం ముఖ్యమంత్రుల దగ్గరకు వెళ్లి దేహీ అని అడుక్కోవడం తప్పు అని గతంలో చెప్పాను.. ఇప్పుడూ చెబుతున్నాను.. ఎప్పుడైనా ఇదే చెప్తాను''

''ఆల్రెడీ మనం ఇంటెర్నేషనల్ స్టాండర్డ్స్ లో సినిమాలు తీస్తున్నాం. ఇప్పుడు ‘పుష్ప 2’ సినిమా ఆల్ ఇండియా రికార్డ్స్ అన్నీ బ్రేక్ చేసింది. అంటే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చినట్లే కదా. 1600 కోట్లు కలెక్ట్ చేసిందంటే అది చిన్న విషయం కాదు. ఆటోమేటిక్ గా మనం వరల్డ్ రికార్డ్స్ లోకి వెళ్లిపోయాం. అన్ని ప్రధాన భారతీయ భాషల సినిమాల షూటింగ్స్ ఇక్కడ జరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా తీసేది ఏముంది. ఇంగ్లిష్ వాళ్ళు కూడా 'గాంధీ' లాంటి సినిమాలు ఇక్కడ తీశారు. నా చిన్నప్పుడు శశి కపూర్ సినిమా ఒకటి మొత్తం హైదరాబాద్ లో తీశారు'' అని తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నారు.

''సీఎంతో జరిగిన మీటింగ్‌లో అసలు సినిమాల గురించి మాట్లాడలేదు. ఆయన చెప్పారు.. వీళ్ళు విన్నారు. మీరు బ్రహ్మాండంగా చేస్తున్నారు సార్ అన్నారు.. అయిపోయింది. ప్రభుత్వంతో స్నేహపూర్వక సంబంధాల కోసం వెళ్లినట్లు నాకు అనిపించింది'' అని తమ్మారెడ్డి అభిప్రాయ పడ్డారు. ''అల్లు అర్జున్, ఎన్టీఆర్, చిరంజీవి.. ఇలా చాలామంది హీరోలు గతంలోనే సోషల్ కాజ్ మీద షార్ట్ ఫిలిమ్స్ చేసారు. 'పుష్ప 2' సినిమాకి ముందు డ్రగ్స్ మీద అల్లు అర్జున్ అవగాహన కలిగించడానికి వీడియో చేసారు. ప్రభుత్వం మంచి పని చేస్తుంటే, దానికి సపోర్ట్ చేయడంలో తప్పులేదు. చేసి తీరాలి.. అది మన డ్యూటీ. మనం సినిమా తీసి డబ్బులు సంపాదిస్తున్నప్పుడు, సమాజ వికాసానికి ఎంతో కొంత ఉపయోగపడే ఒక నిమిషం వీడియో చేయడంలో తప్పులేదు. సినిమాల విడుదల సమయంలోనే కాకుండా, ప్రతీ ఒక్కరూ సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తూనే ఉండాలనేది నా అభిప్రాయం. ఒకవేళ నేను నాలుగేళ్లు సినిమా చేయకపోతే.. నేను అలాంటి వీడియోలు చెయ్యక్కర్లేదా? మార్కెట్ ఉన్న ప్రతీ ఆర్టిస్టు సినిమాలతో సంబంధం లేకుండా సామాజిక వీడియోలు చెయ్యాలనేది నా ఉద్దేశ్యం''

''బెస్ట్‌ మీటింగ్‌ జరిగిందని అక్కడికి వెళ్లినవాళ్లు అన్నారు. అందరూ హ్యాపీగా ఉన్నారు. అజెండా లేని మీటింగ్ ఎప్పుడూ బెస్ట్ మీటింగ్ అవుతుంది. వాళ్ళు కొన్ని మంచి విషయాలు చెప్పారు. వీళ్ళు కొన్ని మంచి విషయాలు చెప్పారు కాబట్టి.. అది అద్భుతమైన మీటింగ్. ఎవరికీ ఏ బాధా లేకుండా జరిగింది. లంచం తీసుకొని టికెట్‌ రేట్లు పెంచారని మీడియాలో వచ్చిన వార్తల గురించి ఇండస్ట్రీ ప్రముఖులతో సీఎం మాట్లాడినట్లు నాకు తెలిసింది. ఇండస్ట్రీ వాళ్లకు గవర్నమెంట్ దగ్గరకు తరచూ వెళ్లాల్సిన అవసరం లేదు. ఏదైనా సమస్యలు ఉన్నప్పుడే కలుస్తాం. నిన్న వెళ్లిన వాళ్ళు ఫలానా సమస్య కోసం వెళ్లాం అని ఎవరినైనా చెప్పమనండి''

''చెన్నై నుంచి ఇండస్ట్రీని హైదరాబాద్‌ కి తీసుకురావడానికి మాకు 40 ఏళ్లు పట్టింది. ఇప్పుడు ఇండస్ట్రీ అంతా ఇక్కడే ఉంది. ఇక్కడి నుంచి మరోచోటకు వెళ్లాలన్నా అంతే సమయమే పడుతుంది. ఎక్కడ కావాలంటే అక్కడ సినిమాలు చెయ్యొచ్చు. సముద్రం కావాలంటే ఆంధ్రాకే వెళ్లి తీయాలి. ఒకప్పుడు పొలాలు కావాలంటే గోదావరికి వెళ్లి తీసేవాళ్ళం. ఇప్పుడు తెలంగాణలోనే సస్యశ్యామలంగా ఉంది. చిరంజీవి ఫ్యామిలీ నుంచి మీటింగ్‌కు ఎవరూ ఎందుకు వెళ్లలేదో నాకు తెలియదు. ఇన్విటేషన్ లేదేమో?. బహుశా వారికి ఏమైనా ముఖ్యమైన పనులు ఉన్నాయేమో. ఏదైనా ఇతర సమస్యల వల్ల వెళ్ళలేదేమో.. అది నాకు తెలియదు''

''ఇండస్ట్రీలో ఉన్న వారందరూ నాకు పిల్లలతో సమానం. అప్పటి తరం హీరోలతో సినిమాలు చేసాం. చిరంజీవి మాకు సమకాలీనుడు. ఆ తర్వాత జెనరేషన్ లో నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వచ్చారు. వాళ్ళ పిల్లలే ఇప్పుడు హీరోలుగా ఉన్నారు. అందరూ నా కళ్ళ ముందు పెరిగినవాళ్లు. నాకు పిల్లలు. మొన్న తిట్టాను. అల్లు అర్జున్‌ కి నేషనల్‌ అవార్డు వచ్చినప్పుడు సంతోషించాను. ఇప్పుడు ఆయన సినిమా 1600 కోట్లు చేస్తే సంతోషించా. అలానే సంధ్య థియేటర్‌ ఘటనపై కూడా నా అభిప్రాయం చెప్పాను. నా ఉద్దేశం ఎవరినీ బాధపెట్టడం కాదు. అది తిట్టినట్లు, నెగెటివ్ గా మాట్లాడినట్లు కాదు. నా పిల్లలతో సమానం కాబట్టి వాళ్ల గురించి మాట్లాడతాను. ఫోన్ చేసి చెబుతామంటే నా పిల్లలు ఫోన్లు ఎత్తరు. నాకు అందుబాటులో లేనంతగా పిల్లలు చాలా ఎదిగిపోయారు. అందుకే వీడియోలలో నా ఒపీనియన్ చెబుతున్నా. ఎదిగే క్రమంలో కొందరికి దూరంగా ఉండండి అని చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటాను. కొన్ని విషయాల్లో పెద్దల మాట వింటే మంచిది'' అని తమ్మారెడ్డి భరద్వాజ చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News