ఆ ఐదు సంక్రాంతి సినిమాల లేటెస్ట్‌ అప్డేట్‌

ఆ అయిదు సినిమాల మేకింగ్‌ విషయంలో ఏ దశలో ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Update: 2023-12-14 12:30 GMT

తెలుగు వారికి, తెలుగు సినీ ప్రేక్షకులకు ఎంతో కీలకమైన సంక్రాంతి పండుగకి ఇంకా నెల సమయం కూడా లేదు. జనాలు పండుగ కోసం సిద్దం అవుతూ ఉంటే, సినీ ప్రేక్షకులు సంక్రాంతి వినోదం కోసం ఎదురు చూస్తున్నారు. ఈసారి ఏకంగా అయిదు సినిమాలు సంక్రాంతి రేసులో ఉన్నాయి. ఆ అయిదు సినిమాలు కూడా వేటికి అవే అన్నట్లుగా రెడీ అవుతున్నాయి. ఆ అయిదు సినిమాల మేకింగ్‌ విషయంలో ఏ దశలో ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాల్లో అత్యంత క్రేజీ ప్రాజెక్ట్‌ గుంటూరు కారం. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. డిసెంబర్ నాల్గవ వారం కు మొత్తం షూటింగ్‌ పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరో వైపు పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్‌ కూడా సమాంతరంగా జరుగుతోంది. సంక్రాంతికి గుంటూరు కారం దుమ్ము లేపడం ఖాయం అంటున్నారు.

నాగార్జున నా సామి రంగ సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా కు సంబంధించిన షూటింగ్‌ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో జరుగుతోంది. మరో పది రోజుల్లో షూటింగ్‌ ముగియనున్నట్లుగా మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాకు కూడా పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నాయి.

వెంకటేష్ సైంధవ్‌ సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్‌ కూడా ముగింపు దశకు చేరుకుంది. ఏ క్షణంలో అయినా సినిమాను సెన్సార్‌ కి పంపించే అవకాశాలు ఉన్నాయి అంటూ సమాచారం అందుతోంది. ఇప్పటికే వెంకీ ప్రమోషన్‌ కార్యక్రమాలను షురూ చేశాడు.

రవితేజ నటిస్తున్న ఈగల్‌ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ దశలో ఉంది. ఈ నెలాకరు వరకు సినిమా యొక్క ఫస్ట్‌ కాఫీ సిద్ధం అవుతుందని, వెంటనే సెన్సార్‌ ఫార్మాల్టీస్‌ ని కూడా ముగించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

తేజ, ప్రశాంత్‌ వర్మ కాంబోలో రూపొందుతున్న హనుమాన్‌ సినిమా షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్‌ దశలో ఉంది. వీఎఫ్‌ఎక్స్ వర్క్ ముగింపు దశకు చేరడంతో సంక్రాంతికి దూకేందుకు హనుమాన్‌ రెడీ అవుతున్నాడు.

మొత్తానికి సంక్రాంతి సినిమాలు అన్నింటిలోకి వెంకటేష్‌ సైంధవ్‌ సినిమా మాత్రమే రెడీగా ఉంది. మిగిలిన సినిమాలు ఇంకా షూటింగ్ లేదా పోస్ట్‌ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. ఈ అయిదులో చివరి నిమిషంలో ఏ సినిమా అయినా పోటీ నుంచి తప్పుకునేనా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి.

Tags:    

Similar News