సక్సెస్ క్రెడిట్ అతనికి కూడా దక్కాలి టిల్లూ!

గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. కేవలం మూడు రోజుల్లోనే 68 కోట్ల గ్రాస్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది.

Update: 2024-04-01 10:59 GMT

సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో మల్లిక్ రామ్ తెరకెక్కించిన యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ''టిల్లు స్క్వేర్''. 'డీజే టిల్లు' సీక్వెల్ గా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర సంచలనం సృష్టిస్తోంది. గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. కేవలం మూడు రోజుల్లోనే 68 కోట్ల గ్రాస్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. దీంతో ఇప్పుడు డైరెక్టర్ మల్లిక్ రామ్ పేరు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

'టిల్లు స్క్వేర్' సినిమా సక్సెస్ లో మేజర్ క్రెడిట్ హీరో సిద్ధు జొన్నలగడ్డకే దక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమా మొత్తానన్ని తన భుజాన వేసుకొని ముందుకి నడిపించారు. దీనికి స్వయంగా స్క్రీన్ ప్లే రాసుకోవడమే కాదు, డైలాగ్స్ కూడా అందించారు. డీజే టిల్లు అనే టిపికల్ క్యారెక్టర్ ను రాసుకొని, దాన్ని అద్భుతంగా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేశారు. అయితే ఇక్కడ డైరెక్టర్ మల్లిక్ రామ్ పనితనాన్ని కూడా కచ్ఛితంగా అభినందించాలి.

ఒక బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ చేసి, మెప్పించడం అంత ఆశామాషీ విషయమేమీ కాదు. అది కూడా వేరే డైరక్టర్ తెరకెక్కించిన చిత్రానికి పార్ట్-2 చేయటం అంటే అంత ఈజీ పనికాదు. మొదటి భాగం కల్ట్ హిట్ గా నిలచింది కాబట్టి, తప్పకుండా కంపారిజన్స్ వస్తాయి. ఏమాత్రం తేడా కొట్టినా పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే దర్శకుడిపై ఎంతో ఒత్తిడి ఉంటుంది. కానీ మల్లిక్ రామ్ దీన్ని సవాలుగా తీసుకొని, 'డీజే టిల్లు' సీక్వెల్ కు వంద శాతం న్యాయం చేశారు. టిల్లు లాంటి విలక్షణమైన పాత్రను సరిగ్గా హ్యాండిల్ చేయగలిగారు.

నిజానికి 'టిల్లు స్క్వేర్' అవకాశం మల్లిక్ రామ్ కు అనుకోకుండానే వచ్చింది. 'డీజే టిల్లు' దర్శకుడు విమల్ కృష్ణ ఇతర కమిట్ మెంట్స్ తో బిజీగా ఉండటంతో, సడన్ గా ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చి చేరాడు. మొదట కాస్త సంకోచించినప్పటికీ, సిద్ధూతో ఉన్న సాన్నిహిత్యంతో దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. అంకితభావంతో టీమ్ తో కలిసి ఎన్నో నెలలు కథ మీద వర్క్ చేశారు. స్క్రీన్ ప్లే, డైలాగ్స్ విషయంలో సిద్ధు జొన్నలగడ్డకు తోడుగా నిలిచారు. అవసరమైన సీన్లను రీషూట్ చేసి మరీ మంచి అవుట్ ఫుట్ ఇచ్చారు. మొదటి భాగాన్ని మించిన బ్లాక్ బస్టర్ అందించారు. అందుకే సక్సెస్ లో దర్శకుడి కృషిని అందరూ అభినందించాలి.

మల్లిక్ రామ్ 2016లోనే 'నరుడా డోనరుడా' అనే చిత్రంతో డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. సుమంత్ హీరోగా, 'విక్కీ డోనార్' రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. దీనిపై అప్పట్లో డీమోనిటైజేషన్ ప్రభావం కూడా పడింది. ఆ తర్వాత 'పెళ్లి గోల', 'తరగతి గది దాటి' వంటి ఓటీటీ ప్రాజెక్టులతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రశాంత్ వర్మ అందించిన కథతో 'అద్భుతం' సినిమాను తీశారు రామ్. ఓటీటీలో రిలీజైన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇండస్ట్రీకి వచ్చిన దశాబ్దం తర్వాత ఇప్పుడు 'టిల్లు స్క్వేర్' చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవి 'టిల్లు స్క్వేర్' చూసి ఇంటికి పిలిపించుకొని చిత్ర బృందాన్ని అభినందించడం, సినిమాను బాగా తీశాడని మల్లిక్ రామ్ మెచ్చుకోవడం డైరెక్టర్ కెరీర్ కు బూస్టప్ లాంటిదని చెప్పాలి. ఇప్పటికే ఈ ప్రాంచైజీలో 'టిల్లు క్యూబ్' కూడా రానుందని క్లారిటీ వచ్చేసింది. అలానే పలువురు అగ్ర నిర్మాతలు అతనితో సినిమాలు చేయాలని ఆసక్తికనబరుస్తున్నారు. ఇటీవల ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ లో ఓ పాన్-ఇండియా చిత్రానికి సైన్ చేసినట్లు సమాచారం. సందీప్ కిషన్ హీరోగా నెట్ ఫ్లిక్స్ కోసం ఓ వెబ్ సిరీస్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి మల్లిక్ రామ్ 'డీజే టిల్లు' సీక్వెల్ విజయాన్ని సద్వినియోగం చేసుకుని తన కెరీర్ ను ఎలా ముందుకు తీసుకెళ్తారో చూడాలి.

Tags:    

Similar News