మళ్లీ అదే సీన్ రిపీట్.. చిన్న సినిమాలు పెద్ద విజయాలు
ఒకప్పుడు పెద్ద హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సొంతం చేసుకున్న దాఖలాలు ఎక్కువ.
ఒకప్పుడు పెద్ద హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సొంతం చేసుకున్న దాఖలాలు ఎక్కువ. చిన్న హీరోల సినిమాలు ఒక మోస్తరుగా ఆడేవి. కానీ ఇప్పుడు పెద్ద హీరోల సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా చిన్న హీరోల సినిమాలు, కొత్త నటీనటులు నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను నమోదు చేస్తున్నాయి. ముక్కు మొహం తెలియని కొత్త నటీనటులు చేసిన సినిమాలు ఈ మధ్య కాలంలో భారీ విజయాలను సొంతం చేసుకున్న దాఖలాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు అదే సీన్ రిపీట్ అయ్యింది.
కమిటీ కుర్రాళ్లు మరియు ఆయ్ సినిమాలు కొత్త వారితో రూపొందాయి. విడుదలకు ముందు పబ్లిసిటీ తో అందరి దృష్టిని ఆకర్షించారు. ఎంతటి పబ్లిసిటీ చేసినా కూడా కంటెంట్ లేకుంటే సినిమాలు తిరస్కరణకు గురి అయిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఆయ్ మరియు కమిటీ కుర్రాళ్లు మాత్రం మంచి కంటెంట్ తో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ తో పాటు, రామ్, పూరి కాంబోలో రూపొందిన డబుల్ ఇస్మార్ట్ సినిమాలు బరిలో ఉండగా ఈ చిన్న సినిమాలు నిలుస్తాయా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
ఆ సినిమాల కంటే కూడా అధికంగా రోజు రోజు వసూళ్లు పెంచుకుంటూ ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. విడుదల అయిన మూడు రోజుల్లోనే ఈ సినిమాలు బ్రేక్ ఈవెన్ ను సాధించాయి. కమిటీ కుర్రాళ్లు సినిమాను నిహారిక నిర్మించగా, ఆయ్ సినిమాను బన్నీ వాసు నిర్మించిన విషయం తెల్సిందే. ఈ రెండు సినిమాలు కూడా మెగా కాంపౌండ్ నుంచే రావడం విశేషం. భారీ ఎత్తున వస్తున్న ఈ సినిమాల కలెక్షన్స్ చూసి బాక్సాఫీస్ వర్గాల వారు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఆయ్ సినిమా చాలా తక్కువ స్క్రీన్ ల్లో రిలీజ్ అయ్యింది. కానీ రోజులు గడుస్తున్నా కొద్ది స్క్రీన్స్ సంఖ్య పెంచుతూ వచ్చారు. ఇప్పటికే ఆయ్ తో విడుదల అయిన సినిమాలు ప్రేక్షకుల తిరస్కరణకు గురి అవ్వడంతో ఆ సినిమాల స్థానంలో ఆయ్ మరియు కమిటీ కుర్రాళ్లు ఇంకా కూడా పలు థియేటర్ లలో రన్ అవుతూనే ఉంది. ముందు ముందు ఈ సినిమాలు మరిన్ని వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ వారం రాబోతున్న సినిమాల ప్రభావం ఆయ్ మరియు కమిటీ కుర్రాళ్లు వసూళ్ల పై ఉండే అవకాశం ఉంది.