.consent-eea { display:none; } .consent-ccpa{ display:none; } .amp-geo-group-eea .consent-eea { display:block; } .amp-geo-group-ccpa .consent-ccpa { display:block; }

ఫస్టాఫ్ రివ్యూ: ఫ్లాపులు ఎక్కువ, హిట్లు తక్కువ!

చూస్తుండగానే 2024 సంవత్సరంలో అప్పుడే ఆరు నెలలు గడిచిపోయాయి. ఈ ఏడాది ప్రథమార్థంలో తెలుగులో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి

Update: 2024-07-01 08:15 GMT

చూస్తుండగానే 2024 సంవత్సరంలో అప్పుడే ఆరు నెలలు గడిచిపోయాయి. ఈ ఏడాది ప్రథమార్థంలో తెలుగులో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. కానీ హిట్లు కంటే, ఫ్లాపులే ఎక్కువ పడ్డాయి. సంక్రాంతి సీజన్ తో గ్రాండ్ గా ప్రారంభించిన టాలీవుడ్.. సమ్మర్ సీజన్ పూర్తయ్యే నాటికి చాలా తక్కువ సక్సెస్ రేట్ తో ఫస్టాఫ్ ను ముగించింది. భారీ అంచనాలు పెట్టుకున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడితే, కొన్ని చిత్రాలు మాత్రం ఎవరూ ఊహించని విధంగా మంచి వసూళ్లను రాబట్టాయి.

జనవరి నెలలో సంక్రాంతి పండక్కి వచ్చిన చిత్రాల్లో ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన 'హను-మాన్' సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. పెద్ద హీరోల సినిమాల పోటీని తట్టుకొని నిలబడటమే కాదు, పొంగల్ విన్నర్ గా నిలిచింది. ₹40 కోట్ల బడ్జెట్ తో తీస్తే, దాదాపు ₹350 కోట్ల వరకూ వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. 'గుంటూరు కారం' సినిమా టాక్ తో సంబంధం లేకుండా, మహేశ్ బాబు స్టార్ పవర్ తో భారీ కలెక్షన్లు రాబట్టింది. అక్కినేని నాగార్జున నటించిన 'నా సామి రంగ' మూవీ అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ సాధించి, సూపర్ హిట్ స్టేటస్ అందుకుంది. వీటితో పాటుగా విడుదలైన వెంకటేశ్ 'సైంధవ్' సినిమా డిజాస్టర్ అయింది. పండక్కి ముందూ, ఆ తర్వాత అనేక చిన్నా చితక చిత్రాలు వచ్చాయి కానీ, ఏదీ జనాలను ఆకట్టుకోలేదు.

Read more!

ఫిబ్రవరి ప్రారంభంలో రిలీజైన సినిమాల్లో 'అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్' విమర్శకుల ప్రశంసలు అందుకుని, నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన రవితేజ 'ఈగల్' సినిమా డిజాస్టర్ ఫలితాన్ని చవిచూసింది. 'యాత్ర 2' మూవీ తీవ్ర నిరాశ పరచగా.. 'లాల్ సలాం' లాంటి డబ్బింగ్ సినిమా అడ్రెస్ లేకుండా పోయింది. 'ఊరు పేరు భైరవకోన' చిత్రంతో సందీప్ కిషన్ చాలా ఏళ్ళ తర్వాత సక్సెస్ రుచి చూశారు. ఇదే క్రమంలో వచ్చిన 'సుందరం మాస్టర్', 'మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా', 'సిద్ధార్థ్ రాయ్' లాంటి చిన్న సినిమాలు పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి.

'ఆపరేషన్ వాలెంటైన్‌' వంటి భారీ పరాజయంతో మార్చి నెలను ప్రారంభించాడు వరుణ్ తేజ్. అదే సమయంలో వచ్చిన 'భూతద్దం భాస్కర్ నారాయణ', 'చారీ 111' చిత్రాలతో పాటుగా ఆర్జీవీ 'వ్యూహం' సినిమా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాయి. మహా శివరాత్రికి విడుదలైన విశ్వక్ సేన్ 'గామి'.. విమర్శకుల ప్రశంసలతో పాటుగా మంచి వసూళ్లను అందుకుంది. గోపీచంద్ 'భీమా' సినిమా నిరాశ పరిచింది. రాజమౌళి కొడుకు రిలీజ్ చేసిన 'ప్రేమలు' వంటి మలయాళ డబ్బింగ్ మూవీ తెలుగులో ఊహించని కలెక్షన్లు రాబట్టింది. 'ది గోట్ లైఫ్ - ఆడు జీవితం' చిత్రాన్ని మాత్రం మన జనాలు పట్టించుకోలేదు. 'ఓం భీమ్ బుష్' సినిమాతో శ్రీవిష్ణు మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. నెలాఖరున రిలీజైన సిద్ధు జొన్నలగడ్డ 'టిల్లు స్క్వేర్‌' సినిమా.. ₹135 కోట్ల వసూళ్లతో, బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఏప్రిల్ నెలలో ఎన్నికల నోటిఫికేషన్లు రావడం, ఐపీఎల్ క్రికెట్ కొత్త సీజన్ స్టార్ట్, మే నెలలో ఎండలు మండిపోవడంతో.. స్టార్ హీరోలెవరూ సమ్మర్ లో తమ సినిమాలను రిలీజ్ చేసే సాహసం చెయ్యలేదు. ఏప్రిల్ మొదటి వారంలో ఎన్నో అంచనాలతో విడుదలైన విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' సినిమా ప్లాప్ అయింది. అంజలి నటించిన 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' కోసం ప్రేక్షకులు థియేటర్లకు రాలేదు. ఆ తర్వాతి రెండు వారాల్లో చాలా చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి కానీ, ఆ విషయం జనాలకు తెలియలేదు.

మే నెలలో 'ఆ ఒక్కటీ అడక్కు' అంటూ వచ్చిన అల్లరి నరేష్ కు నిరాశే ఎదురైంది. 'ప్రసన్న వదనం' చిత్రానికి హిట్ టాక్ వచ్చినా, కలెక్షన్లు రాలేదు. 'బాక్', 'శబరి' లాంటి సినిమాలు ఆకట్టుకోలేలేదు. కొరటాల శివ నిర్మించిన 'కృష్ణమ్మ' చిత్రం ఓ మోస్తరు వసూళ్లు రాబట్టింది. నారా రోహిత్ నటించిన 'ప్రతినిధి 2'.. గెటప్ శ్రీను 'రాజు యాదవ్' చిత్రాలని జనాలు పట్టించుకోలేదు. చివరి వారంలో విడుదలైన 'లవ్ మీ' మూవీ పరాజయం పాలైంది. మంచి రివ్యూలు రాబట్టిన కార్తికేయ 'భజే వాయు వేగం' సినిమా యావరేజ్ గా నిలిచింది. ఆనంద్ దేవరకొండ చేసిన 'గం గం గణేశా' పట్ల ఆడియన్స్ పెద్దగా ఆసక్తి కనబరచలేదు. విశ్వక్ సేన్ నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీ అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ మార్క్ క్రాస్ చేసి, క్లీన్ హిట్ అనిపించుకుంది.

జూన్ ఫస్ట్ వీక్ లో రిలీజైన 'మనమే' సినిమా శర్వానంద్ కు హిట్ ఇవ్వలేకపోయింది. కాజల్ అగర్వాల్ నటించిన 'సత్యభామ' చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. నవదీప్ 'లవ్ మౌళి' కోసం ప్రేక్షకులు థియేటర్లకి వెళ్ళలేదు. సుధీర్ బాబు హీరోగా రూపొందిన 'హరోం హర' మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. 'మ్యూజిక్ షాప్ మూర్తి' మంచి ప్రయత్నం అనిపించుకుంది. విజయ్ సేతుపతి 'మహారాజా' మూవీ తెలుగులోనూ సక్సెస్ సాధించింది. ఇటీవల విడుదలైన ప్రభాస్ 'కల్కి 2898 AD' చిత్రం ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. గత కొన్ని నెలలుగా బోసిపోయిన బాక్సాఫీస్ కు ఊపిరి పోసింది. నాగ్ అశ్విన్ తీసిన ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ లోనే 500 కోట్ల క్లబ్ లో చేరి, 1000 కోట్ల దిశగా దూసుకుపోతోంది.

ఓవరాల్ గా 2024లో గడిచిన ఆరు నెలల కాలాన్ని పరిశీలిస్తే, టాలీవుడ్ లో సక్సెస్ రేట్ ఆశించన విధంగా లేదనే చెప్పాలి. ద్వితీయార్థంలో పలు క్రేజీ చిత్రాలు విడుదల కాబోతున్నాయి. మరో రాబోయే ఆరు నెలలు తెలుగు చిత్ర పరిశ్రమకు ఎలా గడుస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News