'చంద్రయాన్ -3' కి టాలీవుడ్ సెల్యూట్!
మరోసారి గర్వించేలా చేసింది. ఈ విజయంపై ప్రపంచ దేశాలు భారత్ ని ప్రశంసల్లో ముంచెత్తుతున్నాయి. ఇక టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ విజయంపై స్పందించారు.
'చంద్రయాన్ -3' విజయంతో భారత్ మరో చరిత్రని సృష్టించిన సంగతి తెలిసిందే. భారత రోదసి చరిత్రలో మహాజ్వల ఘట్టం ఆవిష్కృతమైంది. జాబిల్లి యాత్రలో ఇప్పటివరకూ ఏ దేశము అందుకోలేకపోయిన సంక్లిష్ట లక్ష్యాల్ని ఇస్రో విజయవంతంగా చేధించింది. చంద్రుడి దక్షణ దృవం వద్ద వ్యోమనౌకను సురక్షితంగా దించి వినువీధుల్లో భారత్ పతాకాన్ని సగర్వంగా రెపరెపలాడించింది.
140 కోట్ల భారతీయుల్ని మరోసారి గర్వించేలా చేసింది. ఈ విజయంపై ప్రపంచ దేశాలు భారత్ ని ప్రశంసల్లో ముంచెత్తుతున్నాయి. ఇక టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ విజయంపై స్పందించారు. చిరంజీవి మాట్లాడుతూ... 'అపూర్వమైన విజయమిది. మన భారతీయ శాస్త్ర వేత్తల్ని అభినందిస్తున్నా. మరిన్ని ఆవిష్కరణలకు..పరిశోధలనకు ఇది మార్గాన్ని సుగమం చేసింది. జాబిలిపై విహారం ఇంకెంతో దూరంలో లేదు' అని అన్నారు.
కమల్ హాసన్ ఏమన్నారంటే? 'ఇది ఎప్పటికీ నిలిచిపోయే చారిత్రక రోజు. సైకిళ్ల పై ఉపగ్రహ భాగాల్ని మోసుకెళ్లడం నుంచి చంద్రుడిపై దింగేతవరకూ ఎంతో గొప్ప ప్రయాణం. భారతీయులు చంద్రుడిపై నడిచే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి' అన్నారు. అలాగే బాలకృష్ణ మాట్లాడుతూ.. ఎన్నో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా మారిన భారత శాస్త్ర వేత్తలకు , ప్రోత్సహించిన ప్రభుత్వాలకు శుభాకాంక్షలు. చంద్రుడిపై ఉన్న ఆసక్తికర అంశాల్ని మానవాళికి అందించడంలో మరో ముందడుగు పడింది. చంద్రుడిపై నివాస యోగ్యత, నీటి లభ్యత, జీవరాసుల మనుగడకు సంబంధించిన సమాచారం ప్రపంచానికి చేరవేయడంలో భారత్ ముందు ఉంటుంది' అని అన్నారు.
'ఈసురోమని మనుజులంటే దేశమేగతి బాగుపడునోయ్'. ఇస్రోవలే తెగువ చూపితే ఎల్లలన్నవి చెరుగునోయ్' అని కీరవాణి రాసుకొచ్చారు. ఇంకా రాజమౌళి..ప్రభాస్..మహేష్..ఎన్టీఆర్..రవితేజ..ప్రకాష్ రాజ్..హృతిక్ రోషన్..మోహన్ లాల్..అక్షయ్ కుమారు..కరీనా కపూర్ తదితరులు సోషల్ మీడియా వేదికగా దేశ కీర్తిని ఆనందించారు. ఇంకా చాలా మందీ నటీనుటుల..సాంకేతిక నిపుణులు అంతా 'చంద్రయాన్ -3' విజయంపై గర్వించారు. ప్రపంచ దేశాలకు భారత్ రోల్ మోడల్ గా నిలిచిందన్నారు.