పారితోషికంలో ఆ ఇద్దరు స్టార్లు టాప్
పారితోషికంతో పాటు లాభాల్లో వాటాలు, ఏరియా హక్కులు, పంపిణీ హక్కులు అంటూ చాలారకాలుగా సంపాదిస్తున్నారు అగ్రహీరోలు.
బాలీవుడ్ లో కింగ్ ఖాన్, ఆ తర్వాత రజనీకాంత్ అత్యంత భారీ పారితోషికం డిమాండ్ చేసే హీరోలుగా రికార్డులకెక్కినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇటీవల వీరి పారితోషికం 100 కోట్ల నుంచి 200 కోట్ల రేంజుకు చేరుకుంది. పారితోషికంతో పాటు లాభాల్లో వాటాలు, ఏరియా హక్కులు, పంపిణీ హక్కులు అంటూ చాలారకాలుగా సంపాదిస్తున్నారు అగ్రహీరోలు.
పారితోషికం పరంగా నంబర్ -1 స్లాట్ లో రజనీకాంత్- షారూఖ్ పేర్లు నిలుస్తున్నాయి. సూపర్‌స్టార్ రజనీకాంత్ జైలర్ సక్సెస్ తర్వాత తన పారితోషికాన్ని అమాంతం పెంచారు. తదుపరి లోకేష్ తో కూలీ (తలైవర్ 171) కోసం రజనీ పారితోషికం రేంజ్ 250-260 కోట్లకు చేరుకుందన్న గుసగుస వినిపిస్తోంది. విక్రమ్, బీస్ట్ లాంటి భారీ హిట్ చిత్రాలను తెరకెక్కించిన లోకేష్ కనగరాజ్ తో సూపర్ స్టార్ రజనీ కలయికను క్రేజీగా భావిస్తున్నారు. బజ్‌కి తగ్గట్టే రజనీకాంత్ కి భారీగా పారితోషికం లాభాల్లో వాటాలు అందుకుంటున్నారని తెలిసింది. ఈ సినిమా కోసం రజనీ 250 కోట్లు అందుకుంటున్నారని సమాచారం. ఆసియాలోనే అత్యధిక పారితోషికం అందుకునే హీరోగా రజనీకాంత్ పేరు రికార్డులకెక్కనుందని కోలీవుడ్ మీడియాలో కథనాలొచ్చాయి. మరోవైపు కింగ్ ఖాన్ షారూఖ్ హ్యాట్రిక్ విజయాలతో దూకుడు పెంచారు. ఆయన పారితోషికం రేంజు సుమారు 250 కోట్లతో రజనీకి సమానంగా ఉందని తెలుస్తోంది.
ఆ తర్వాతి స్థానంలో దళపతి విజయ్ `ది గోట్` కోసం 200 కోట్లు అందుకుంటున్నాడని కోలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. తమిళ చిత్ర పరిశ్రమలో మాస్‌లో అసాధారణ ఫాలోయింగ్ ఉన్న తళా అజిత్ కుమార్ ఇటీవల తన 63వ చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ టైటిల్ ని ప్రకటించారు. అయితే దీనికి ముందు అజిత్ తన 62వ చిత్రం అయిన `విదా ముయార్చి`లో కనిపించనున్నాడు. తాజా పుకార్ల ప్రకారం.. అజిత్ ఈ చిత్రానికి 110-120 కోట్ల రెమ్యునరేషన్ లాక్ చేసారని టాక్ వినిపిస్తోంది.
అయితే `బిజినెస్ ఇన్‌సైడర్ ఇండియా` కథనం ప్రకారం షారుఖ్ ఖాన్ 150-250 కోట్ల మేర అందుకుంటున్నారని కథనం వచ్చింది. అంటే ఇంచుమించుగా రజనీకాంత్ తో సమానం. టాప్ 5లో జోసెఫ్ విజయ్, ప్రభాస్, అమీర్ ఖాన్ తర్వాతి స్థానాల్లో ఉన్నారని సదరు కథనం పేర్కొంది. ఈ జాబితాలో సల్మాన్ ఖాన్, కమల్ హాసన్, అల్లు అర్జున్, అక్షయ్ కుమార్, అజిత్ కుమార్ పేర్లు ఉన్నాయి. 2024లో అత్యధిక పారితోషికం పొందిన నటుల జాబితాను పరిశీలిస్తే.. షారుక్ ఖాన్: రూ. 150-250 కోట్లు, రజనీకాంత్: రూ. 150-210 కోట్లు, జోసెఫ్ విజయ్: రూ. 130-200 కోట్లు, ప్రభాస్: రూ. 100-200 కోట్లు, అమీర్ ఖాన్: రూ. 100-175 కోట్లు, సల్మాన్ ఖాన్: రూ. 100-150 కోట్లు, కమల్ హాసన్: రూ. 100-150 కోట్లు, అల్లు అర్జున్: రూ. 100-125 కోట్లు, అక్షయ్ కుమార్: రూ. 60-145 కోట్లు, అజిత్ కుమార్: రూ. 105 కోట్లు అందుకుంటున్నట్టు ఇన్ సైడర్ కథనం ప్రచురించింది. అయితే రజనీకాంత్ ప్రస్తుతం నటిస్తున్న వేట్టయాన్ కోసం 200కోట్లు సుమారుగా అందుకుంటుండగా, లోకేష్ కనగరాజ్ తో మూవీ కోసం 250 కోట్లు వసూలు చేస్తూ టాప్ రేంజుకు చేరుకున్నారు.
కేజీఎఫ్ యష్ పేరు జాబితాలో ఉంది:
అయితే తాజా గణాంకాల ప్రకారం.. భారతదేశంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న టాప్ 10 స్టార్లలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ పేరు చేరింది. అతడు రూ.200 కోట్ల పారితోషికంతో అగ్రపథంలో ఉన్నారంటూ ఇటీవల ప్రముఖ హిందీ మీడియా కథనం వెలువరించింది. రణబీర్ కపూర్, సాయి పల్లవి ప్రధానపాత్రల్లో నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న రామాయణం లో యష్ రావణుడిగా నటిస్తున్నాడు. ఈ పాత్ర కోసం యష్ 200 కోట్ల మొత్తాన్ని వసూలు చేస్తున్నారని కథనాలొచ్చాయి. గతం కంటే పారితోషికం పెంచేశాడంటూ న్యూస్ 18 తన కథనంలో ప్రచురించింది. ఇదే నిజమైతే బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా యష్ బాలీవుడ్ కింగ్ ఖాన్ ను కూడా అధిగమించినట్లేనని ఈ కథనంలో పేర్కొన్నారు.