ఆ సినిమాపై మరోసారి పొలిటికల్ పంచ్!
మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా జీవితం ఆధారంగా తెరకెక్కిన 'పంజాబ్ 95' తొలి నుంచి వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే
మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా జీవితం ఆధారంగా తెరకెక్కిన 'పంజాబ్ 95' తొలి నుంచి వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. చరిత్రలో సిక్కుల ఊచకోతతో పాటు, 1984లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ హత్య అనంతరం జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల సమయంలో 'Ghallughara' అనే పేరును ఉపయోగించారు. ఇది వివాదాస్పదంగా మారింది. ఇంకా చిత్రంలోని కొన్ని సన్నివేశాలు హింసను ప్రేరేపించేలా వున్నాయని.. భారతదేశ సమగ్రతను.. విదేశాలతో సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని సీబీఎఫ్‌సీ భావించింది.
దీంతో రాజకీయంగానూ సినిమా దుమారం రేపే అవకాశం ఉందని భావించిన సెన్సార్ బృందం కూడా సెన్సార్ కి ఆరు నెలలు సమయం తీసుకుంది. ఎన్నో కట్లు.. కండీషన్ల విధించింది. 'Ghallughara' అనే పదాన్ని వాడకూడదని ఆదేశించింది. ఇలా ఎన్నో వివాదాల్లో పంజాబ్ 95 అట్టుడుకింది. తాజాగా ప్రతిష్టాత్మక టోరోంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ పెస్టివల్స్ నుంచి సినిమా ప్రదర్శనను తొలగిస్తున్నట్లు ప్రకటించారు.
చిత్ర రూపకార్తలు గానీ.. చిత్రోత్సవ నిర్వాహకులు గానీ.. దీనికి స్పష్టమైన కారణాలు ఏంటి? అని చెప్పకపోయినా రాజకీయ పరమైన ఒత్తిడులు కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నెట్టింట ప్రచారం సాగుతోంది. కొంత మంది కావాలనే సినిమాపై రాజకీయం చేసి టోరోంటో నుంచి తొలగించేలా చేసారని సిక్కులు ఆరోపిస్తున్నారు. వాస్తవాలు ప్రపంచానికి చూపించడంలో తప్పేముందని మండిపడుతున్నారు.
జశ్వంత్ సింగ్ అమృత్ సర్ లోని ఓ సాధారణ ఉద్యోగి. అతని స్నేహితుడు..తల్లి కనిపించకుండా పోవడంతో వాళ్ల కోసం అన్వేషణ ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో నిర్ఘాంతపోయే వాస్తవాలు బయటకు వస్తాయి. దీంతో అతడి కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో పడుతుంది. 90 కాలం నాటి పంజాబ్ రాష్ట్ర పరిస్థితుల్ని సినిమాలో చక్కగా చూపించారు. ఈ చిత్రాన్ని రోనీ స్క్రూవాలా నిర్మించగా .. హనీ ట్రేహాన్ దర్శకత్వం వహించారు.