2024 సెకండాఫ్ ఢీ అంటే ఢీ
'కల్కి 2989 ఏడి' బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్ధలు కొడుతోంది. కేవలం నాలుగు రోజుల్లో 500కోట్లు వసూలు చేసిందని కథనాలొచ్చాయి
'కల్కి 2989 ఏడి' బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్ధలు కొడుతోంది. కేవలం నాలుగు రోజుల్లో 500కోట్లు వసూలు చేసిందని కథనాలొచ్చాయి. ఇది పాన్ ఇండియన్ సంచలనంగా మారింది. బాక్సాఫీస్ వద్ద 4రోజుల తర్వాతా దూకుడు ఇలానే కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ఫలితం మునుముందు విడుదలకు రానున్న పెద్ద సినిమాలకు ఉత్సాహం నింపింది. 2024లో విడుదలకు రెడీ అవుతున్న భారీ చిత్రాల జాబితాను పరిశీలిస్తే సౌత్ నుంచి వస్తున్న చాలా చిత్రాలు హిందీ పరిశ్రమ నుంచి వస్తున్న భారీ చిత్రాలతో ఢీకొడుతున్నాయి. పోటీబరిలో నువ్వా నేనా? అంటూ ఢీ కొట్టేందుకు రెడీ అవుతున్నాయి.
సూర్య కంగువ vs అలియా భట్ జిగ్రా... కమల్ హాసన్ ఇండియన్ 2 vs సర్ఫిరా .. పవన్ కల్యాణ్ OG vs ఎన్టీఆర్ దేవర ఇలా మునుముందు రిలీజ్ కి రెడీ అవుతున్న క్రేజీ చిత్రాల జాబితా ఉత్కంఠను కలిగిస్తోంది. నిన్ననే సూర్య కథానాయకుడిగా శివ దర్శకత్వం వహించిన కంగువ దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని అధికారికంగా మరోసారి ప్రకటించారు. యాధృచ్ఛికంగా ఈ చిత్రం అలియా భట్ నటించిన జిగ్రా విడుదల తేదీకి కేవలం ఒక రోజు ముందు విడుదలవుతోంది. అంటే ఆలియా సినిమాకి ఇది గండి కొట్టే అవకాశం ఉందని అంచనా. వాస్తవానికి ఈ సంవత్సరం ద్వితీయార్థం పెద్ద బ్యానర్ల నుంచి సినిమాలు రిలీజ్ తేదీల విషయంలో సరైన ప్లానింగ్ మిస్సయిందా? అన్న సందేహాలు కలుగుతున్నాయి.
కమల్ హాసన్-నటించిన భారతీయుడు 2 (ఇండియన్ 2) చాలా ఆలస్యం తర్వాత జూలై 12న విడుదల కానుంది. రకరకాల వివాదాలు అడ్డంకులతో ఈ సినిమా రిలీజ్ చాలా ఆలస్యమైంది. మరోవైపు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కోసం దర్శకుడు శంకర్ కమిట్‌మెంట్ల కారణంగా మరికొంత ఆలస్యం అయింది. ఎట్టకేలకు ఇప్పుడు సినిమా రిలీజ్ కివస్తోంది. ఇండియన్ 2 అక్షయ్ కుమార్ సర్ఫిరాతో తలపడనుంది. ఈ చిత్రం కూడా జూలై 12న విడుదల కానుంది. ఈ చిత్రం జాతీయ అవార్డు గెలుచుకున్న తమిళ చిత్రం సూరరై పొట్రు (2020)కి అధికారిక బాలీవుడ్ రీమేక్. సూర్య మాతృక కథానాయకుడు కాగా, సర్ఫిరాతో సూర్య నిర్మాతగా బాలీవుడ్ లో అడుగుపెట్టాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌తో పాటు ట్రైలర్‌కు రెస్పాన్స్ ఓకే అనిపించినా రాంగ్ టైమ్ లో వస్తోందన్న టాక్ వినిపించింది.
స్ట్రీ 2 వర్సెస్ ఖేల్ ఖేల్ మే .. రిలీజ్ వార్ ఆసక్తికరంగా మారింది. శ్రద్దా కపూర్ ఈ ఆగస్టు 15న స్ట్రీ 2తో సినిమాల్లోకి తిరిగి వస్తుంది. ఇది 2016 సూపర్-హిట్ మూవీ స్ట్రీ కి కొనసాగింపు చిత్రం. ముఖ్యంగా దినేష్ విజన్ హారర్-కామెడీ విశ్వం స్పిన్నింగ్‌ను ప్రారంభించింది. చాలా మంది 'స్త్రీ' తారాగణం సీక్వెల్ లోను కనిపిస్తారు. తమన్నా భాటియా కూడా ఎగ్జయిట్ చేసే అతిధి పాత్రలో తిరిగి కనిపిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ నిజంగా ఇంటర్నెట్ దృష్టిని ఆకర్షించింది. చాలామంది స్త్రీ ప్రపంచాన్ని తిరిగి సందర్శించడానికి స్వాతంత్య్ర దినోత్సవం వరకూ వేచి చూడాల్సిందే. మరోవైపు అక్షయ్ కుమార్ తన చిత్రం 'ఖేల్ ఖేల్ మే' ని ఆగస్టు 15న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. తాప్సీ పన్ను, అమీ విర్క్, ఫర్దీన్ ఖాన్ తదితరులు ఇందులో నటించారు. స్వాతంత్య్ర దినోత్సవ సెలవులను బాగా ఉపయోగించుకోవడానికి సెప్టెంబర్ ప్రారంభంలో రావాల్సిన ఈ చిత్రాన్ని ముందుగానే థియేటర్లలోకి తీసుకువస్తున్నారు. జాన్ అబ్రహం -శార్వరి వాఘ్ జంటగా నటించిన 'వేదా' గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఈ చిత్రం స్ట్రీ 2 , ఖేల్ ఖేల్ మేలకు మంచి పోటీని ఇవ్వవచ్చని భావిస్తన్నారు. స్లీపర్ హిట్ ముంజ్యాలో అద్భుత నటనతో ఆకట్టుకున్న శార్వరి క్రేజ్ ఈ సినిమాకి కలిసొస్తుందని అంచనా.
దేవర వర్సెస్ OG వార్ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇటు ఇండస్ట్రీ వర్గాలు సహా అభిమానుల్లో దీనిపై భారీ అంచనాలున్నాయి. ఎన్టీఆర్ నటించిన 'దేవర: పార్ట్ 1'ని మొదట ఏప్రిల్ ప్రారంభంలో విడుదల చేయాలని ప్లాన్ చేసారు. ఆ తర్వాత దసరాకు వాయిదా వేశారు. చివరికి సెప్టెంబర్ 27కి వాయిదా పడింది. ఈ చిత్రం నుండి మొదటి సింగిల్ ఫియర్ సాంగ్ మేలో విడుదలైంది. ప్రేక్షకుల నుండి సానుకూల స్పందనను పొందింది. SS రాజమౌళి RRR స్టార్ ఎన్టీఆర్ నటించిన సినిమా గనుక పాన్ ఇండియాలో ఆసక్తి ఏర్పడింది. అదే క్రమంలో దేవర రెండు భాగాలుగా విడుదలవుతుందని కూడా వెల్లడించగా ఆసక్తి నెలకొంది. ఇందులో తారక్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని కూడా కథనాలొస్తున్నాయి.
దేవరతో పవన్ కళ్యాణ్ OG పోటీకి దిగనుంది. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రిలీజ్ ఆలస్యం కావడానికి ఎన్నికలు కూడా ఒక కారణం. జనసేనాని పవన్ కల్యాణ్ రాజకీయ కట్టుబాట్ల కారణంగా చిత్రీకరణ కొంత కాలం పాటు ఆగిపోయింది. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు ముగిసాయి గనుక తదుపరి తన సినిమాల రిలీజ్ లపైనా పవన్ దృష్టి సారించారని కథనాలొస్తున్నాయి. ఇప్పుడు OG ప్రచారానికి పవన్ సిద్ధమవుతున్నారని తెలిసింది. ఈ సెప్టెంబర్ 27న ఓజీని విడుదల చేయనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రం ఇప్పుడు మరోసారి ఆలస్యం అవుతుందని రూమర్స్ వస్తున్నా కానీ దానిపై అధికారిక ధృవీకరణ రాలేదు. దేవర వర్సెస్ ఓజీ వార్ షురూ అయినట్టేనని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఇదే డేట్ కి దుల్కర్ సల్మాన్ 'లక్కీ భాస్కర్' విడుదలవుతుందని సమాచారం. సెప్టెంబర్ 27న విడుదల కానున్న ఈ చిత్రం పవన్, ఎన్టీఆర్ సినిమాల బాక్సాఫీస్ కలెక్షన్లను షేర్ చేసుకునే వీలుంది. దుల్కర్ ఇటీవల ప్రభాస్ 'కల్కి 2898 AD'లో అతిధి పాత్రతో అభిమానులను ఆశ్చర్యపరిచాడు.
పుష్ప 2: ది రూల్ X ఛవా
పుష్ప 2: ది రూల్‌ని ఆకస్మికంగా వాయిదా వేయడం ఇతరుల్లో కలతకు కారణమైంది. ఈ చిత్రం స్వాతంత్య్ర దినోత్సవం రోజున విడుదల చేయనున్నారని కథనాలొచ్చాయి. కానీ పుష్ప 2 ఇప్పుడు డిసెంబర్ 6న విడుదల కానుంది. అల్లు అర్జున్ టైటిల్ పాత్రను పోషింంచగా, భన్వర్ లాల్ షెకావత్ అనే అటవీశాఖ అధికారిగా ఫహద్ ఈ చిత్రంలో కనిపిస్తాడు. రష్మిక మందన్న కూడా శ్రీవల్లి పాత్రలో తిరిగి కనిపిస్తుంది. ఈ ఏడాది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీక్వెల్ గా పుష్ప 2 పై బజ్ ఉంది.
అలాగే విక్కీ కౌశల్ నటించిన ఛవా కూడా డిసెంబర్ 6న విడుదల కానుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ నటిస్తున్నారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన్న, అక్షయ్ ఖన్నా తదితరులు నటించారు. సినిమా తాజా ప్రోగ్రెస్‌పై వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
వరుసగా ఇన్ని భారీ సినిమాలు విడుదలవుతున్నాయి గనుక కల్కి రికార్డులను బద్ధలు కొట్టేది ఏది? అన్నది ఆసక్తిగా మారింది. 2024 ద్వితీయార్థంలో అభిమానుల కోసం అగ్రహీరోల ట్రీట్ పరంగా కొదవేమీ లేదు.