మహేష్ - రాజమౌళి మూవీ... రేపు జరిగేది ఏంటి?
ఈ ఏడాది ఆరంభంలోనే మహేష్ బాబు, రాజమౌళి కాంబో మూవీ పట్టాలెక్కబోతున్నట్లు వార్తలు వచ్చాయి.
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ఆర్ఆర్‌ఆర్ సినిమాతో వచ్చి చాలా కాలం అయ్యింది. ఇప్పటి వరకు తదుపరి సినిమా మొదలు పెట్టక పోవడంపై చాలా మంది ఆయన అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు మహేష్ బాబును ఏడాది కాలంగా ఊరికే ఉంచారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. రాజమౌళి ఎంత వెయిట్ చేయిస్తే అంతకు పది రెట్ల వెయిట్‌తో మూవీ వస్తుంది. ఆ విషయంలో ఎలాంటి అనుమానం లేదు, బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలతో ఆ విషయం నిరూపితం అయ్యింది. కనుక మహేష్ బాబుతో రాజమౌళి తీయబోతున్న సినిమా గురించి ప్రస్తుతం ఇంకా ఎప్పుడు అనే ఆందోళన ఉందే తప్ప ఫలితం విషయంలో డౌట్ అస్సలు లేదు.
హాలీవుడ్‌కు తెలుగు సినిమాను తీసుకు వెళ్లి నిలుపగల సత్తా ఉన్న దర్శక ధీరుడు రాజమౌళి. కనుక ఆయన దర్శకత్వంలో మహేష్ బాబు సినిమాను చేస్తున్న నేపథ్యంలో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2024 డిసెంబర్‌లోనే సినిమా గురించి ఏదో ఒక అధికారిక ప్రకటన రావడం లేదంటే పూజా కార్యక్రమాలు జరగడం మనం చూస్తాం అనుకున్నాం. కానీ డిసెంబర్ పూర్తి అయ్యింది. 2025 జనవరి వచ్చేసింది. ఈ ఏడాది ఆరంభంలోనే మహేష్ బాబు, రాజమౌళి కాంబో మూవీ పట్టాలెక్కబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అది నిజమే అంటూ రాజమౌళికి సన్నిహితంగా ఉండే వారు, మహేష్ బాబుకి క్లోజ్‌గా ఉండే కొందరు మీడియా వారు చెబుతున్నారు.
నేడు జనవరి 1, 2025 కాగా రేపు ఒక ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది అంటూ రాజమౌళి - మహేష్ బాబు కాంబో మూవీకి చెందిన వారి నుంచి సమాచారం అందుతోంది. ఆ కార్యక్రమం ఏంటి అనే విషయంలో స్పష్టత లేదు. కానీ ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుకుంటున్నారు. పెద్ద ఎత్తున రాజమౌళి, మహేష్ బాబు మూవీని కేఎల్ నారాయణ నిర్మించబోతున్న విషయం తెల్సిందే. ఆఫ్రికా తో పాటు పలు దేశాల్లో ఈ సినిమా షూటింగ్ జరగబోతుంది. అంతే కాకుండా సినిమాను రెండు పార్ట్‌లుగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు అంటూ ఆ మధ్య సోషల్ మీడియాలో ప్రముఖంగా చర్చ జరిగింది.
సినిమా మొదటి పార్ట్ ను 2027లో రెండో పార్ట్‌ని 2028లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. సినిమా షూటింగ్ మొదలు పెడితే ఎప్పుడు వచ్చినా పర్వాలేదు అంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ అంటున్నారు. రేపు సినిమా షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభించి, రాజమౌళి మీడియాతో మాట్లాడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే, కొందరు మాత్రం సినిమా నిర్మాణం గురించి అధికారిక ప్రకటన కేఎల్ నారాయణ నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ ప్రచారం జరుగుతుంది. ఇంతకు రేపు జరిగేది ఏంటి అనేది ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.