అప్పుల్లో రకుల్ ప్రీత్ ఫ్యామిలీ.. స్టార్ హీరో సాయం!
సౌత్ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవలే బాలీవుడ్ నిర్మాత కం నటుడు జాకీ భగ్నానీని పెళ్లాడిన సంగతి తెలిసిందే
సౌత్ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవలే బాలీవుడ్ నిర్మాత కం నటుడు జాకీ భగ్నానీని పెళ్లాడిన సంగతి తెలిసిందే. జాకీ నిర్మించిన పలు చిత్రాల్లోను రకుల్ కథానాయికగా నటిస్తోంది. అయితే రకుల్ భర్త జాకీ భగ్నానీ, అతడి సోదరుడు వాసు భగ్నానీల నిర్మాణ సంస్థ పూజా ఎంటర్ టైన్ మెంట్స్ తీవ్ర నష్టాలను చవి చూసిందని, 250కోట్ల అప్పులున్నాయని ప్రచారమవుతోంది. అప్పుల్లో ఉన్న కంపెనీ తమ ఉద్యోగులను తొలగించిందని, జీతాలు సరిగా చెల్లించలేదని పుకార్లు షికార్ చేసాయి.
వాసు భగ్నాని - జాకీ భగ్నాని యాజమాన్యంలోని పూజా ఎంటర్‌టైన్‌మెంట్ వరుస ఫ్లాప్‌ల కారణంగా పెద్ద నష్టాలను ఎదుర్కొందని మీడియాలో కథనాలొచ్చాయి. 250 కోట్ల అప్పును తీర్చడానికి పూజా ఎంటర్‌టైన్‌మెంట్‌కు చెందిన ఏడు అంతస్తుల కార్యాలయాన్ని వాషు విక్రయించినట్లు బాలీవుడ్ హంగామా తన కథనంలో పేర్కొంది. భగ్నానీలు ఈ అమ్మకం ద్వారా వచ్చిన డబ్బును అప్పులు తీర్చడానికి ఉపయోగిస్తున్నట్లు సదరు కథనం వెల్లడించింది. ప్రొడక్షన్ హౌస్ తన సిబ్బందిలో 80 శాతం మందిని తొలగించిందని కూడా ఈ కథనం పేర్కొంది.
అయితే ఇప్పుడు కష్టాల్లో ఉన్న కంపెనీని ఆదుకునేందుకు అక్షయ్ కుమార్ నేరుగా నిర్మాత వాసు భగ్నానీకి ఫోన్ చేసారని సమాచారం. `చింతించవద్దు.. నేనున్నాను!` అని అక్కీ భరోసా ఇచ్చారట. అయితే ఇవన్నీ నిజాలేనా? పుకార్లు కాదు కదా! అని వివరాలు తెలుసుకునేందుకు నేరుగా వాసు భగ్నానీని ప్రశ్నించగా.. అక్షయ్ కుమార్ ఇటీవల తనకు డయల్ చేసినట్లు అతడు వెల్లడించారు. అక్షయ్ ఆందోళన చెందవద్దని అన్నాడు. అతడు ఎల్లప్పుడూ ప్రొడక్షన్ హౌస్‌తో ఉంటానని హామీ ఇచ్చారని వాసు తెలిపారు. ``నాకు ఫోన్ చేసి చింతించకండి అని చెప్పిన మొదటి వ్యక్తి అక్షయ్.. ఏదైనా చేయవలసి ఉంటే అతడికి తెలియజేయండి. అతడు బేషరతుగా తన మద్దతు ఇచ్చాడు. నాకు సన్నీ డియోల్, సునీల్ శెట్టి, నా పాత స్నేహితుడు డేవిడ్ ధావన్ నుండి కూడా కాల్స్ వచ్చాయి. ప్రతి ఒక్కరూ నన్ను నిజంగా కదిలించారు. వారు నాకు కట్టుబడి ఉండే నా మనుషులు``అని వాసు చెప్పారని ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ``నాకు సినిమా పరిశ్రమ అంటే చాలా ఇష్టం.. అది నా జాన్. ఈ పరిశ్రమలో చాలామంది ఎమోషనల్ వ్యక్తులు ఇప్పటికీ ఉన్నారు.. వారు హృదయం ఉన్నవారు`` అన్నారాయన.
అప్పులు తీర్చేందుకు భవంతిని అమ్మేశారా? అని ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని, భవనం పునరాభివృద్ధిలో ఉందని వాసు భగ్నానీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బకాయిలు చెల్లించలేదని ఆరోపిస్తున్న సిబ్బంది గురించి కూడా ఆయన మాట్లాడుతూ.. ``నేను గత 30 సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్నాను. మేం బాకీ పడ్డామని చెప్పుకునే వారు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి మాతో మాట్లాడాలి. పూజా ఎంటర్‌టైన్‌మెంట్‌తో వారికి సరైన ఒప్పందాలు ఉన్నాయా? దీనిపై వారు కేసు పెట్టారా? సోషల్ మీడియాలో రాద్ధాంతం చేయడం కంటే దీన్ని పరిష్కరించుకునేందుకు చాలా మార్గాలు ఉన్నాయి. సమస్య ఉంటే పరిష్కరిస్తాం. ఎవరూ పారిపోవడం లేదు. దయచేసి నా కార్యాలయానికి రండి.. మాతో మాట్లాడండి.. మీ పత్రాలను మాకు ఇవ్వండి... ప్రతిదీ గుర్తించడానికి మాకు 60 రోజుల సమయం ఇవ్వండి. నేను ఎలాంటి ఒత్తిడి లేదా బ్లాక్‌మెయిల్‌కు గురికావడం లేదు. మేము UKలోని ప్రొడక్షన్ కంపెనీలతో కూడా పని చేస్తాము. వారు ఎవరికైనా డబ్బు బాకీ ఉంటే బాధితులు నేరుగా వారిని సంప్రదించాలి`` అని తెలిపారు.
పూజా ఎంటర్‌టైన్‌మెంట్ పురాతన నిర్మాణ సంస్థలలో ఒకటి. ఈ సంస్థ నుంచి కూలీ నెం.1 మీ, హీరో నెం. 1, బెల్ బాటమ్, బివి నెం. 1, ఫాల్తు, జవానీ జానేమాన్, రెహాన్ హై దిల్ మే వంటి చిత్రాలు విడుదలయ్యాయి. అయితే ఇటీవల నిర్మించిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లు అయ్యాయి. దీంతో పూజా ఎంటర్ టైన్ మెంట్ పై రకరకాల పుకార్లు పుట్టుకొచ్చాయి.