విలన్ పాత్రల్నే హీరోలుగా చూపించడం హీరోయిజం అనిపించుకోదు: వెంకయ్య నాయుడు
సినీ రంగంలో ప్రస్తుతం వస్తున్న సినిమాలపై, ఆ కథలపై భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.;
ఈ మధ్య సినిమాల ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. తెలుగు సినిమా స్థాయి పరంగా అయితే పెరుగుతుంది కానీ ఒకప్పటిలా టాలీవుడ్ లో గొప్ప సినిమాలు రావడం తగ్గిపోయాయనేది మాత్రం ఒప్పుకోవాల్సిన వాస్తవం. సినీ రంగంలో ప్రస్తుతం వస్తున్న సినిమాలపై, ఆ కథలపై భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ రోజుల్లో విలన్ పాత్రల్నే హీరోలుగా చూపించడం ఓ ట్రెండ్ అయిపోయిందని, అది చాలా తప్పని పిల్లలు అలాంటి సినిమాలు ఏం నేర్చుకుంటారని ఆయన ప్రశ్నించారు. సంతోషాన్ని, మంచి వినోదాన్ని అందించడమే సినిమాకు టార్గెట్ కావాలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. హైదరాబాద్ లో ఆదివారం జరిగిన నటి, నిర్మాత, సింగర్ కృష్ణవేణి సంస్మరణ సభలో పాల్గొన్న ఆయన చిత్ర పరిశ్రమ గురించి పలు విషయాలు మాట్లాడారు.
సినీ రచనల్లో కొన్ని నియమాలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అనవసరమైన అశ్లీలత, డబుల్ మీనింగ్ వచ్చేలా డైలాగులు, కామెడీ రాయాల్సిన అవసరం లేదని, ఎలాంటి సంభాషణలైనా అర్థ రహితంగా ఉండేలా రాస్తే చాలని ఆయన తెలిపారు. ఆ రోజుల్లో వచ్చిన సినిమాలన్నీ ఎంతో వినోదాన్ని అందించేవని, ఇప్పటికీ ఆ సినిమాల గురించి గొప్పగా చెప్పుకుంటున్నారంటే దానికి కారణం అందులో ఎలాంటి అశ్లీలత లేకపోవడమేనని ఆయన అన్నారు.
విలన్ క్యారెక్టర్లనే హీరోలుగా చూపించడం హీరోయిజం అనిపించుకోదని, కథల విషయంలో మంచి ప్రమాణాలు పాటించాల్సిన అవసరముందని తెలిపారు. ఎంటర్టైన్మెంట్ కోసం బూతులు వాడాల్సిన పన్లేదని, పాత సినిమాలే దానికి నిదర్శనమని ఆయన తెలిపారు. పాతాళభైరవి, మిస్సమ్మ, సీతారామయ్య గారి మనవరాలు సినిమాల గురించి ఇప్పటికీ మనం మాట్లాడుకుంటున్నామంటే దానికి కారణం అందులో ఉన్న స్వచ్ఛతేనని వెంకయ్య నాయుడు అన్నారు.
ఇక తెలుగు సినీ రంగానికి కృష్ణవేణి చేసిన సేవలు మరువలేనివని, పలు విభాగాల్లో ఆమె అశేష సేవలందించారని ఆయన అన్నారు. మనదేశం సినిమాతో ఎన్టీఆర్ ను పరిచయం చేసిన ఆమె, కీలు గుర్రం సినిమాతో ఏఎన్నార్‌కు స్టార్ స్టేటస్ అందించారని, ఈ తరం ఆమెను ఆదర్శంగా తీసుకుని ఆమె జీవన విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆయన కోరారు.