400 ఎకరాల ఆసామి..చివరి క్షణాల్లో అలా!
పాత తరం నటుల్లో ఎన్టీఆర్..ఏఎన్నార్ తర్వాత బలంగా వినిపించిన మరో లెజెండరీ నటుడు కాంతారావు అలియాస్ కత్తి కాంతారావు
పాత తరం నటుల్లో ఎన్టీఆర్..ఏఎన్నార్ తర్వాత బలంగా వినిపించిన మరో లెజెండరీ నటుడు కాంతారావు అలియాస్ కత్తి కాంతారావు. కత్తి పట్టి యుద్ధాలు చేయడంలో కాంతారావు అప్పట్లో స్పెషలిస్ట్. కత్తి దూయడంలో ఆయనకు ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. కాంతారావు కత్తి సన్నివేశాలు ఉన్నాయంటే? ఆ సినిమా హిట్టే అన్నంత పేరు సంపాదించుకున్నారు. ఆ రకంగా కత్తి కాంతారావు ఇంటి పేరుగా మారిపోయింది.
తెలుగు సినిమా కళామతల్లికి ఎన్టీఆర్ - ఏఎన్నార్ రెండుకళ్లు అయితే- నుదుటున తిలకం గా కాంతారావుని పరిశ్రమ భావిస్తుంది. అంతటి పేరు ప్రఖ్యాతలున్న కాంతారావు చివరి రోజుల్లో ఆర్దికంగా చాలా ఇబ్బందులు పడ్డారు. అయితే ఆయనతదానంతరం వారసులెవరు ఇండస్ట్రీలో లేరు. తాజాగా ఆయన కుమార్తె సుశీల మీడియా ముందుకొచ్చి తమ కుటుంబ నేపథ్యం గురించి చెప్పే ప్రయత్నం చేసారు.
'మా నాన్నగారు 'గుడిబండ దొరస కి అప్పట్లోనే 400 ఎకరాలు ఉండేది. విజయవాడకి ఏదైనా కొత్త సినిమా వస్తే స్నేహితులతో కలిసి చూడటానికి వెళ్లేవారు. ఆ డబ్బు కోసం ఒక ఎకరం అమ్మేసేవారు . అప్పట్లో ఎకరం 1200. అలా నాన్న సినిమాల్లోకి వచ్చి .. నిర్మాతగా మారే సమయానికి ఒక 50 ఎకరాలు ఉండేవనుకుంటా. సినిమాలు తీయడం కోసం ఆయన వాటిని కూడా అమ్మేశారు.
ఆయన అమ్మేసిన తరువాత అటు వైపు సాగర్ కాలువ పడింది. దీంతో రేట్లు ఒక్కసారిగా పెరిగాయి. కానీ అప్పటికే చాలా భూమి అమ్మేసారు. నాన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు సినిమా వాళ్లు కొంతమంది సాయం చేశారు. అంతకంటే ఎక్కువగా అభిమానులు ఆదుకున్నారు. ఆయన ప్రాణం పోతున్నప్పుడు అందరం దగ్గరే ఉన్నాం. అమ్మని తాను జాగ్రత్తగా చూసుకుంటానని అన్నయ్య చెప్పినప్పుడు, ఆయన కళ్లవెంట నీళ్లు చెంపల మీదుగా జారాయి. అది నేను ఇప్పటికీ మరచిపోలేక పోతున్నాను. మా అమ్మ అమాయ కురాలు . తనకి ఏమీ తెలియదు. ఆమెను గురించే ఆయన చివరి రోజుల్లో ఎక్కువగా బాధపడ్డారు` అని ఉద్వేగానికి లోనయ్యారు.