ఒంటరిదాన్నయ్యా..పెళ్లి సంబంధాలు చూసే వారు లేరు!
చివరిగా `సరిలేరు నీకెవ్వరులో` నటించారు. ఆ సినిమా సక్సెస్ తో రాములమ్మ మళ్లీ నటిగా బిజీ అవుతుందని అంతా భావించారు.
విజయశాంతి అలియాస్ రాములమ్మ మంచి పాత్రలు వస్తే నటిస్తోన్న సంగతి తెలిసిందే. నటనకు ఆస్కారం.. ధీటైన పాత్రలు తప్ప! చిన్న సినిమాలు చేయడం లేదు. స్టార్ హీరోల చిత్రాలైనా? ఆ పాత్ర ఎంతో ప్రత్యేకంగా ఉంటేనే నటిస్తున్నారు. చివరిగా `సరిలేరు నీకెవ్వరులో` నటించారు. ఆ సినిమా సక్సెస్ తో రాములమ్మ మళ్లీ నటిగా బిజీ అవుతుందని అంతా భావించారు.
కానీ అలా జరగలేదు. మరి తను అనుకున్న పాత్రలు రాక నటించలేదా? లేక ఇంకేవైనా కారణాలున్నాయా? అన్నది తెలియాలి. తాజాగా రాములమ్మ తన కెరీర్ లో ఎదుర్కొన్న కష్టాల కడలి గురించి చెప్పుకొచ్చారు. అవేంటో ఆమె మాటల్లోనే..`దేవాలయం` సినిమా షూటింగు `అమరావతి'లో జరుగుతోంది. తండ్రి చితికి నేను నిప్పు పెట్టే సీన్ ను చిత్రీకరిస్తున్నారు. అదే సమయంలో చెన్నైలో మా ఫాదర్ చనిపోయారు. కానీ ఆయనకి సీరియస్ గా ఉందని చెప్పి డైరెక్టర్ గారు నన్ను పంపించారు.
మా ఫాదర్ అంటే నాకు చాలా ఇష్టం. అలాంటి ఆయనను అలా చూడటం నాకు చాలా కష్టమైపోయింది. ఆ సంఘటనను నేను ఎప్పటికీ మరిచిపోలేను. మా ఫాదర్ మరణంచిన ఏడాదికి మా మదర్ చనిపోవడం నాకు తగిలిన మరో ఎదురుదెబ్బ. అప్పటి నుంచి నేను ఒంటరినైపోయాను. అప్పటివరకూ వాళ్లు ఉన్నారనే ధైర్యం ఉండేది. కానీ ఒక్కసారిగా ఒంటరి అయ్యయే సరికి కాస్త భయమేసినట్లు అనిపించింది. ఒక ఆడపిల్లకి తల్లిదండ్రుల సంరక్షణ చాలా అవసరం.
కానీ నాకు ఆ ఇద్దరూ లేకుండా పోయారు. నాకు పెళ్లి సంబంధాలు చూసేవారుగానీ , పెళ్లి చేసేవారుగాని లేరు. దీంతో పెళ్లి అనే ఆలోచనలు కూడా విరమించుకున్నాను. బ్రతకాలి? అంటే పెళ్లి చేసుకోవాలా? అనిపించింది. అలాంటి సమయంలో నా జీవితంలోకి నా భర్తగా ఆయన ఎంట్రీ ఇచ్చారు. నన్ను మరింత ప్రోత్సహించి నా స్థాయి పెరిగేలా చేశారు` అని అన్నారు.