విరాట్ కోహ్లీ బ‌యోపిక్..ర‌ణ‌బీర్ సూట్ కాడు చ‌ర‌ణ్ ఓకే

ఇక‌పోతే ఎన్నో విజ‌యాల వెన‌క కీల‌క ఆట‌గాడిగా విరాట్ కోహ్లీకి ఉన్న పాపులారిటీ, గుర్తింపు అంతా ఇంతా కాదు.

Update: 2023-11-17 01:30 GMT

2023 ప్ర‌పంచ‌కప్ మ్యాచ్‌ల‌లో విరాట్ కోహ్లీ దుమ్ముదులిపేస్తున్న సంగ‌తి తెలిసిందే. టీమిండియా విజ‌యంలో అత‌డు కీల‌క భూమిక పోషిస్తున్నాడు. వ‌ర‌ల్డ్ క‌ప్ లో సెంచ‌రీల మోత మోగిస్తున్నాడు. వ‌న్డే క్రికెట్ చ‌రిత్ర‌లో 50 సెంచ‌రీలు సాధించిన వీరుడిగా అత‌డి పేరు మార్మోగుతోంది. స‌చిన్ టెండూల్క‌ర్ 49సెంచ‌రీల రికార్డును కోహ్లీ తిర‌గ‌రాసాడు. ప్ర‌పంచ‌క‌ప్ లో అత్యధిక ప‌రుగులు సాధించిన దేశీ క్రికెట‌ర్ గాను రికార్డుల‌కెక్కాడు. ఇక‌పోతే ఎన్నో విజ‌యాల వెన‌క కీల‌క ఆట‌గాడిగా విరాట్ కోహ్లీకి ఉన్న పాపులారిటీ, గుర్తింపు అంతా ఇంతా కాదు.

అలాంటి లెజండ‌రీ క్రికెట‌ర్ జీవితాన్ని వెండితెర‌కెక్కిస్తే ఆ క్రేజ్ మామూలుగా ఉండ‌దు. అన్ని క్రీడా బ‌యోపిక్ ల త‌ర‌హాలోనే కోహ్లీ బ‌యోపిక్ కి అసాధార‌ణ‌మైన క్రేజ్ నెల‌కొంటుంద‌న‌డంలో సందేహం లేదు. ఒక‌వేళ విరాట్ కోహ్లీ బ‌యోపిక్ ని తెర‌కెక్కిస్తే ఏ స్టార్ సూట‌వుతాడు? అంటూ చ‌ర్చ సాగుతోంది. ఇదే ప్ర‌శ్న స్టార్ హీరో ర‌ణ‌బీర్ క‌పూర్ ని అడిగితే అత‌డు ఇచ్చిన స‌మాధానం షాకిచ్చింది. ``విరాట్ కోహ్లీపై బయోపిక్ తీస్తే అందులో మిస్టర్ కోహ్లి తన పాత్రను తానే పోషించాలని రణబీర్ కపూర్ వెంటనే బదులిచ్చారు. ఎందుకంటే విరాట్ చాలా మంది నటుల కంటే మెరుగ్గా కనిపిస్తాడు. అతని ఫిట్‌నెస్ కూడా చాలా బాగుంది.. అని అన్నారు.

ఆస‌క్తిక‌రంగా ర‌ణ‌బీర్ అభిప్రాయాన్ని ట్యాగ్ చేస్తూ మెగా ఫ్యాన్స్ దానికి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌ల్ని జోడిస్తున్నారు. నిజానికి ర‌ణ‌బీర్ క‌పూర్ కంటే విరాట్ కోహ్లీ బ‌యోపిక్ కి రామ్ చ‌ర‌ణ్ సూట‌బుల్ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. త‌మ అభిమాన హీరో ఫిజిక్, ప‌ర్స‌నాలిటీ లుక్స్ ప‌రంగా ర‌ణ‌బీర్ కంటే మెరుగ్గా సూట‌వుతాడ‌ని, బాడీ లాంగ్వేజ్ ని కోహ్లీలా మ‌లుచుకోగ‌ల‌డ‌ని కూడా కొంద‌రు మెగా ఫ్యాన్స్ వ్యాఖ్యానిస్తున్నారు. చ‌ర‌ణ్ ఈ బ‌యోపిక్ లో న‌టిస్తే హిందీ బెల్ట్ లో అత‌డికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంద‌ని కూడా కామెంట్ చేస్తున్నారు. అంతేకాదు.. చ‌ర‌ణ్ ఇప్ప‌టికే పాన్ ఇండియా హీరోగా నిరూపించాడు గ‌నుక కోహ్లీ బ‌యోపిక్ కి దేశ‌మంత‌టా క్రేజ్ ఉంటుంది. ప్ర‌పంచ దేశాల్లోను మార్కెట్ చేయొచ్చని కొంద‌రు విశ్లేషిస్తున్నారు. త‌దుప‌రి శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో గేమ్ ఛేంజర్ లో న‌టిస్తున్న రామ్ చ‌ర‌ణ్ కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ తోను సినిమా చేసే ఆలోచ‌న‌లో ఉన్నాడు. ఈలోగానే కోహ్లీ బ‌యోపిక్ లో న‌టిస్తే బావుంటుంద‌ని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇక ర‌ణ‌బీర్ కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెర‌కెక్కిన `యానిమల్` త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో ర‌ణ‌బీర్ క‌పూర్ తొలిసారి యాక్ష‌న్ స్టార్ గా న‌టించాడు. తారాగణంలో రష్మిక మందన్న, అనిల్ కపూర్, బాబీ డియోల్, ట్రిప్తి డిమ్రీ ఉన్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 1, 2023న థియేటర్లలో ప్రదర్శించడానికి ప్లాన్ చేస్తున్నారు.

Tags:    

Similar News