హీరో ఇంట్లో చోరి... దొంగలు వీళ్లే
యంగ్ హీరో విశ్వక్ సేన్ ఇంట్లో జరిగిన దొంగతనం విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.;
యంగ్ హీరో విశ్వక్ సేన్ ఇంట్లో జరిగిన దొంగతనం విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 14న తెల్లవారుజామున ముగ్గురు దుండగులు తాళాలు పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. ఇంట్లో ఉన్న వజ్రపు ఉంగరాలతో పాటు, ఖరీదైన హెడ్‌ఫోన్‌ను ఎత్తుకు వెళ్లారు. దొంగతనం విషయమై విశ్వక్‌సేన్ తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దొంగతనం కేసు నమోదు చేసిన పోలీసులు మూడు రోజుల్లోనే దొంగలను పట్టుకున్నారు. దొంగతనంకు ముందు ముగ్గురు రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. దొంగతనం కేసు విచారణలో భాగంగా పోలీసులు ఏకంగా 200లకు పైగా సీసీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలించి అనుమానితులను ప్రశ్నిస్తూ వచ్చారు.
చివరకు బేగంపేట మయూరి మార్గ్‌కి చెందిన భీమవరపు స్వరాజ్, బొల్లి కార్తీక్, నేరేడుమల్లి సందీప్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం బయటకు వచ్చింది. ఫుడ్ డెలవరీ బాయ్స్‌గా చేస్తున్న ఈ ముగ్గురు మయూరి మార్గ్‌లోని ఒక ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఫుడ్ డెలివరీ ద్వారా వచ్చే జీతం సరిపోక పోవడంతో ఇలా చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ వస్తున్నారు. ఈనెల 10వ తారీకు నుంచి విశ్వక్ సేన్ ఇంట్లో దొంగతనం కోసం ప్లాన్ చేశారు. పలుసార్లు ఆ ఇంటి వైపు వెళ్లి రెక్కీ నిర్వహించారు. ఇంట్లో ఉండేది ఎవరు, ఎప్పుడు ఎవరు బయటకు వెళ్లి పోతుంటారు అనే విషయాలను గుర్తించి, అందుకు తగ్గట్లుగా దొంగతనంకు ప్లాన్ చేశారు.
దొంగతనం కేసును ఛేదించిన ఎస్‌ఐ సతీష్ కుమార్ మాట్లాడుతూ.. మూడు రోజులు రెక్కీ నిర్వహించి ముగ్గురు ముందుగా అనుకున్న ప్రకారం ఈ నెల 14న తెల్లవారుజామున దొంగతనంకు పాల్పడ్డారు. ఇంటి సభ్యుల కదలికల గురించి పక్కా సమాచారంతో వారు ఈ దొంగతనాలకు పాల్పడ్డారు. ఇంటికి కొంత దూరం వరకు ముగ్గురు ఒకే బైక్‌పై వచ్చారు. బైక్‌ని ఇంటికి దూరంగా ఆపి ముగ్గురు అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చారు. స్వరాజ్ ఇంటి లోనికి వెళ్లి తాళాలు పగులగొట్టాడు. ఇంట్లో ఉన్న వజ్రాల ఉంగరంతో పాటు ఖరీదైన హెడ్ ఫోన్స్‌ను తీసుకు వచ్చాడు. అక్కడ నుంచి తిరిగి ముగ్గురు ఒకే బైక్‌పై బేగంపేట చేరుకుని మయూరి మార్గ్‌లోని తమ రూంకి వెళ్లారని చెప్పుకొచ్చాడు.
స్వరాజ్, కార్తీక్, సందీప్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి డైమండ్ రింగ్‌తో పాటు మూడు మొబైల్స్, ఒక బైక్‌ను స్వాదీనం చేసుకున్నారు. వీరు ముగ్గురు ఇంతకు ముందు చేసిన దొంగతనాల గురించి ఎంక్వైరీ చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. దొంగతనం కేసులో అరెస్ట్ అయిన ఈ ముగ్గురిని రిమాండ్‌కి తరలించారు. దొంగతనం కేసును వెంటనే ఛేదించిన ఎస్‌ఐ సతీష్‌ను అభినందించారు. టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ ఇంట్లో దొంగతనం అంటూ వార్తలు రావడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీకి చెందిన వారు పలువురు జాగ్రత్త పడుతున్నారు. చాలా మంది సెలబ్రెటీలు అజాగ్రత్తగా ఉంటారు. ఇంట్లో ఉన్నా లేకున్నా జాగ్రత్తగా ఉండాలని ఈ ఘటనతో అంతా జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
ఇక విశ్వక్‌సేన్ సినిమాల విషయానికి వస్తే ఇటీవలే లైలా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా డిజాస్టర్ అయింది. దాంతో తదుపరి సినిమా విషయంలో విశ్వక్ సేన్ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం విశ్వక్ సేన్ చేతిలో మూడు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ఆ మూడింటిలో ఏ సినిమా ముందు వస్తుంది అనేది చూడాలి.