ఎన్టీఆర్ (X) చరణ్: RRR తర్వాత ఎంపికల్లో ఎవరు బెస్ట్?
తారక్, చరణ్.. ఎవరి ప్రణాళికలు వారికి ఉన్నాయి. ఇప్పుడు చరణ్ 'గేమ్ ఛేంజర్'తో 'దేవర' అంత హిట్టు కొడతాడా లేదా? అన్నదే సస్పెన్స్.
ట్రెండ్‌ని అనుసరిస్తూనే, అదే సమయంలో కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేస్తూ, ఎవరికీ అంతు చిక్కని విధంగా ముందుకు దూసుకెళితేనే క్రియేటివ్ రంగంలో మనుగడ. ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. ఈ ట్రెండ్ ని అనుసరిస్తూనే, ఇంతకంటే కొత్త ట్రెండ్ ఏదైనా క్రియేట్ చేయగలిగే హీరోలకు ర్యాంక్ మరింతగా మెరుగవుతుంది. ఇండస్ట్రీ నంబర్ గేమ్ లో స్టార్లు దూసుకెళ్లాలంటే దర్శకుల ఎంపిక చాలా కీలకమైనది. ఆ రకంగా చూస్తే ప్రభాస్, బన్ని తర్వాత చరణ్, ఎన్టీఆర్ పాన్ ఇండియా రేసులోకి దూసుకొచ్చారు. పుష్ప చిత్రంతో బన్ని పాన్ ఇండియా స్టార్ అయినట్టే, ఆర్.ఆర్.ఆర్ సినిమాతో చరణ్, ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్లుగా దూసుకొచ్చారు.
ఇక ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా హిట్ కొట్టాక ఎన్టీఆర్, చరణ్ ఎంపికలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. రాజమౌళితో పాన్ ఇండియా హిట్ కొట్టాక రామ్ చరణ్ ఏకంగా ఎస్.శంకర్ దర్శకత్వంలో నటించేందుకు అంగీకరించాడు. అలా 'గేమ్ ఛేంజర్' మొదలై ఇప్పుడు రిలీజ్ దశకు చేరుకుంది. ఇదిలా ఉండగానే చరణ్ కంటే వేగంగా పావులు కదిపాడు తారక్. అతడు తన కంఫర్ట్ జోన్ లో ఉండే స్నేహితుడు కొరటాల శివకు అవకాశం కల్పించాడు. తారక్ - కొరటాల కాంబినేషన్ లో వచ్చిన 'దేవర' అనూహ్యంగా పాన్ ఇండియా హిట్ కొట్టింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 400 కోట్లు వసూలు చేసి, ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎన్టీఆర్ కి సంతృప్తికరమైన ఫలితాన్ని ఇచ్చింది. ఇక ఇదే ఉత్సాహంలో అతడు కేజీఎఫ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో భారీ పాన్ ఇండియా సినిమాలో నటించేందుకు వేగంగా పావులు కదిపాడు. మైత్రి మూవీ మేకర్స్ దీనికోసం సహకరించింది.
అయితే మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఆలోచనలు, ఎంపికలు మాత్రం తారక్ కంటే భిన్నంగా ఉన్నాయి. అతడు భారీ చిత్రాల దర్శకుడు ఎస్.శంకర్ ని పూర్తిగా నమ్ముకున్నాడు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత శంకర్- దిల్ రాజుపై నమ్మకం ఉంచి 'గేమ్ ఛేంజర్' తన రేంజును పెంచుతుందని విశ్వసిస్తున్నాడు. అలాగే సుకుమార్ శిష్యుడు, 'ఉప్పెన' ఫేం బుచ్చిబాబు పైనా నమ్మకం తో ఓ క్రీడా నేపథ్య సినిమాని చేస్తున్నాడు. కేజీఎఫ్ ప్రశాంత్ నీల్ తోను చరణ్ సినిమా చేసే ఆలోచనలో ఉన్నా దానికి ఇంకా చాలా సమయం పడుతుంది.
తారక్, చరణ్.. ఎవరి ప్రణాళికలు వారికి ఉన్నాయి. ఇప్పుడు చరణ్ 'గేమ్ ఛేంజర్'తో 'దేవర' అంత హిట్టు కొడతాడా లేదా? అన్నదే సస్పెన్స్. అతడు పాన్ ఇండియా విజయాన్ని అందుకుంటే కచ్ఛితంగా రేసులో ఒకడుగు ముందుకు వేసినట్టు. ఆ తర్వాత బుచ్చిబాబుతో ఆర్.సి 16 పని మరింత సులువు అవుతుంది. RRR తర్వాత ఎంపికల్లో ఎవరు బెస్ట్? అని ప్రశ్నిస్తే ఇప్పటికి పాయింట్ల పట్టికలో తారక్ 'దేవర' విజయం రూపంలో ఒక పాయింట్ అదనంగా సాధించాడు గనుక, దానిని బ్యాలెన్స్ చేయాలంటే చరణ్ 'గేమ్ ఛేంజర్'తో కచ్ఛితంగా బ్లాక్ బస్టర్ కొట్టాల్సి ఉంటుంది.