ఇద్దరూ చెప్పి మరీ కొట్టారు.. ఇది కదా డేర్ అంటే!

చెప్పి మరీ హిట్టు కొట్టారని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

Update: 2024-11-01 18:44 GMT

దీపావళి కానుకగా నాలుగు సినిమాలు బాక్సాఫీస్ బరిలో దిగాయి. 'లక్కీ భాస్కర్' 'క' వంటి రెండు స్ట్రెయిట్ తెలుగు చిత్రాలతో పాటుగా.. 'అమరన్', 'బఘీర' వంటి రెండు డబ్బింగ్ సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యాయి. వీటిల్లో మూడు చిత్రాలు అంచనాలను అందుకున్నాయి. పాజిటివ్ టాక్ తెచ్చుకోవడమే కాదు, దానికి తగ్గట్టుగానే సానుకూలమైన రివ్యూలు సంపాదించాయి. 'లక్కీ భాస్కర్' & 'క' సినిమాలు హిట్ టాక్ తెచ్చుకోవడంతో, అభిమానులు చాలా హ్యాపీగా ఉన్నాయి. చెప్పి మరీ హిట్టు కొట్టారని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తూ, నిర్మించిన సినిమా ''క''. చాలా కాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న కిరణ్.. ఈ మూవీతో ఎలాగైనా హిట్టు కొట్టాలని, గతంలో కంటే ఇంకాస్త ఎక్కువే కష్టపడ్డారు. కొత్త దర్శకులైనా వెనకడుగు వేయకుండా, కథ మీద నమ్మకంతో దాదాపు 15 కోట్ల వరకూ ఖర్చు చేసారు. ''పాయింట్ తో ఈ సినిమా చేసాం. మేము డిస్కస్ చేసిన పాయింట్ వేరే సినిమాల్లో ఎక్కడైనా టచ్ అయినట్లు అనిపించినా.. ఎక్కడైనా కనిపించినా నేను ఇంక సినిమాలే చేయను'' అని రిలీజ్ కు ముందు ప్రెస్ మీట్ కిరణ్ నవ్వుతూనే ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేసారు. ఆ తర్వాత ప్రీరిలీజ్ ఈవెంట్ లో కాస్త ఎమోషనల్ గా ఇదే డేరింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు.

'క' సినిమా చూసిన తర్వాత, ఎవరికైనా కిరణ్ అబ్బవరం చెప్పిన మాటల్లో ఏమాత్రం అతిశయోక్తి లేదని అనిపిస్తుంది. ఎందుకంటే అతను చెప్పినట్టుగానే ఈ సినిమాలో పాయింట్ ను ఇంతకముందు ఎక్కడా మనం చూడలేదు. అసలు క్లైమాక్స్ ను ఎవరూ ఊహించలేరు. పతాక సన్నివేశాలు ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తాయి. బుర్ర తిరిగిపోయేలా చేస్తాయి. ఈ అంశాలే ఇప్పుడు ఈ చిత్రాన్ని నిలబెట్టాయి.. బ్లాక్ బస్టర్ విజయం వైపు నడిపిస్తున్నాయి. ఇది కచ్చితంగా కిరణ్ కెరీర్ ను మరో మెట్టు ఎక్కించే సినిమా అవుతుందని అనడంలో సందేహం లేదు.

హీరో కిరణ్ మాదిరిగానే సితార నిర్మాత సూర్యదేవర నాగవంశీ కూడా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ‘లక్కీ భాస్కర్’ సినిమాను ఒక కొత్త బ్యాక్ డ్రాప్ తో తీశామని, ఈ చిత్రంలో తప్పులు ఎవరికైనా దొరికితే వాళ్లను పిలిచి పార్టీ ఇస్తానని ఛాలెంజ్ విసిరాడు. వంశీ చెప్పినట్టే ఈ మూవీ కాన్సెప్ట్ ఆడియన్స్ కు చాలా కొత్తగా అనిపిస్తుంది. తెలుగులో ఇలాంటి సినిమా ఇంతవరకు రాలేదనే చెప్పాలి. అలానే సినిమాలో ఎలాంటి తప్పులు కనిపించలేదు.

ఇలా హీరో కిరణ్ అబ్బవరం, నిర్మాత నాగవంశీ ఈ దీపావళికి చెప్పి మరీ మాంచి హిట్లు కొట్టారు. నిజానికి ఇలాంటి డేరింగ్ స్టేట్మెంట్స్ ఇవ్వడానికి ఎవరికైనా గట్స్ కావాలి. గతంలో ఈ విధంగా బాక్సాఫీస్ షేక్ అవుతుందని స్టేట్మెంట్స్ ఇచ్చినవారిని ఎంతగా ట్రోల్ చేశారో మనం చూశాం. అందులోనూ కిరణ్, నాగవంశీలపై సోషల్ మీడియాలో ఓ వర్గం నెటిజన్లు ట్రోల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు సినిమాలకు ఏమాత్రం నెగెటివ్ టాక్ వచ్చినా, ఈసారి మరీ దారుణంగా ట్రోల్ చేసేవారు. కానీ వాళ్లిద్దరూ తమ సినిమాల కంటెంట్ మీద నమ్మకంతో ఎంతో ధైర్యంగా ఇలాంటి బహిరంగ ప్రకటనలు చేసారు. చెప్పినట్లుగానే హిట్టు కొట్టి చూపించారు.

ఇకపోతే యువ హీరోలు విశ్వక్ సేన్, వరుణ్ తేజ్ లు కూడా తమ అప్ కమింగ్ సినిమాల విషయంలో ఇలాంటి ప్రకటనలే ఇచ్చారు. నవంబర్ 21న 'మెకానిక్ రాకీ' ప్రివ్యూ చూసినోడు సినిమా బాగాలేదు అంటే, 22న థియేటర్ కు రాకండి. అంత కాన్ఫిడెంట్ గా చెబుతున్నా అని విశ్వక్ డేరింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు విశ్వక్. అలానే 'మట్కా' సినిమాతో కచ్చితంగా హిట్ కొడతానని, ఇది నా ప్రామిస్ అని వరుణ్ తేజ్ వాగ్దానం చేసాడు. ఇద్దరూ తమ సినిమాల మీద నమ్మకంతోనే ఇలా చెప్పారు. మరి వాళ్లు నమ్మకం పెట్టుకున్న ఆ సినిమాల ఫలితాలు ఎలా ఉంటాయో మరికొన్ని రోజుల్లో తెలుస్తుంది.

Tags:    

Similar News