సంక్రాతి టిక్కెట్ రేట్లు, స్పెషల్ షోలు.. తెలంగాణలో ఎలా ఉండబోతోంది?
ఈ మూడు కూడా స్టార్ హీరోల సినిమాలే కావడంతో అన్నింటి పైన హైప్ నెలకొని ఉంది.
సంక్రాంతికి రిలీజ్ కాబోయే సినిమాల సందడి ఇప్పటికే షురూ అయిపొయింది. 'గేమ్ చేంజర్’ తో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జనవరి 10న ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. ఇక ‘డాకు మహారాజ్’ తో బాలయ్య జనవరి 12న థియేటర్స్ లో సందడి చేయడానికి సిద్ధమయ్యాడు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో జనవరి 14న విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించాలని అనుకుంటున్నాడు.
ఈ మూడు కూడా స్టార్ హీరోల సినిమాలే కావడంతో అన్నింటి పైన హైప్ నెలకొని ఉంది. ఈ మూడు సినిమాల ట్రైలర్ కూడా ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయ్యాయి. దీంతో ఫ్యాన్స్ అయితే ఈ సినిమాలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏపీలో ‘గేమ్ చేంజర్’, ‘డాకు మహారాజ్’ సినిమాల టికెట్ ధరలు పెంచుకోవడానికి పర్మిషన్ వచ్చేసింది. ప్రీమియర్ షోలకి కూడా అనుమతులు ఇచ్చారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇంకా టికెట్ ధరలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటన కారణంగా ప్రీమియర్ షోలకి పర్మిషన్ ఇచ్చేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీగా చెప్పారు. టికెట్ ధరలు పెంపు కూడా మూవీస్ బట్టి ఇవ్వడం జరుగుతుందని అన్నారు. అయితే ప్రస్తుతం సంక్రాంతికి వస్తోన్న మూడు సినిమాలలో రెండు దిల్ రాజు నిర్మించగా ఒకటి నైజాంలో డిస్టిబ్యూట్ చేస్తున్నారు. ప్రస్తుతం దిల్ రాజు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు.
ఈ నేపథ్యంలో ఎలా అయిన టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతులు తెచ్చుకోవాలని దిల్ రాజు గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా కలవబోతున్నారు. ఈ మీటింగ్ తో టికెట్ రేట్లపై స్పష్టత వస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రీమియర్ షోలకి అనుమతి ఉండకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది.
అయితే టికెట్ ధరలు పెంచుకోవడానికి పర్మిషన్ ఇస్తేనే ‘గేమ్ చేంజర్’ లాంటి పెద్ద సినిమాలు కమర్షియల్ గా నిలబడతాయి. ఇక మిడ్ నైట్ ప్రీమియర్స్ కు అనుమతులు లభించే అవకాశం లేనట్లు తెలుస్తోంది. 1 గంట షోకి పర్మిషన్ కావాలని మేకర్స్ ప్రయత్నం చేసినప్పటికీ వర్కౌట్ కాలేదని టాక్. ఇక తెల్లవారుజామున షోలకు అనుమతి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ ప్రీమియర్ షోలకి 600 రూపాయిల వరకు టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారని అనుకుంటున్నారు.
ప్రస్తుతం తెలుగులో ఎక్కువ పాన్ ఇండియా సినిమాలు వస్తోన్న సంగతి తెలిసిందే. సినిమా బడ్జెట్ లు కూడా గణనీయంగా పెరిగాయి. కంటెంట్ క్వాలిటీ కోసం ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. ఇలాంటి సమయాలలో టికెట్ ధరలు పెంచితేనే పెట్టిన పెట్టుబడి రికవరీ అయ్యే అవకాశాలు ఉంటాయి. లేదంటే నిర్మాతలు నష్టపోతారు. దీనిని దృష్టిలో ఉంచుకొని అయిన తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలని ఇండస్ట్రీ పెద్దలు కోరుకుంటున్నారు. అయితే రేవంత్ రెడ్డి నిర్ణయం ఎలా ఉంటుందనేది ఈ రోజు స్పష్టత వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.