టైగర్ వల్లే కాలేదు.. ఆ సినిమాలు తట్టుకుంటాయా?
టికెట్ల రేటు పెరగడం కూడా ఒక కారణం అయినప్పటికీ ఓటీటీ యూట్యూబ్ అంటూ ఇతర ఎంటర్టైన్మెంట్ విండోలు బాగా పెరగడం కూడా బాక్సాఫీస్ కు దెబ్బేస్తున్నాయి.
ఇటీవల కాలంలో జనాలు థియేటర్లకు వెళ్లడం బాగా తగ్గించారు అనే మాట కొంత వరకు నిజమే. టాక్ ఎంతో బాగుంటే గాని నచ్చిన సినిమాలు చూడడానికి థియేటర్ వరకు వెళ్లడం లేదు. టికెట్ల రేటు పెరగడం కూడా ఒక కారణం అయినప్పటికీ ఓటీటీ యూట్యూబ్ అంటూ ఇతర ఎంటర్టైన్మెంట్ విండోలు బాగా పెరగడం కూడా బాక్సాఫీస్ కు దెబ్బేస్తున్నాయి.
ఇక అత్యంత ఆసక్తికరమైన క్రికెట్ మ్యాచ్ లు సైతం సినిమాల కలెక్షన్స్ తగ్గిస్తున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. రీసెంట్ గా ఇండియా vs న్యూజిలాండ్ వరల్డ్ కప్ సెమి ఫైనల్ మ్యాచ్ వలన ఒక పెద్ద సినిమాపై గట్టి దెబ్బె పడింది. ఆ సినిమా మరేదో కాదు. సల్మాన్ ఖాన్ టైగర్ 3. అసలే నెగిటివ్ టాక్ తో తక్కువ ఓపెనింగ్స్ అందుకున్న టైగర్ 3 సెమీఫైనల్ రోజు మరింత దారుణమైన కలెక్షన్స్ చూసింది.
ఇక వందల కోట్ల మార్కెట్ ఉన్న హీరోకే క్రికెట్ ఫోబియా దెబ్బను తట్టుకోలేదు. అలాంటిది ఈ వారం వచ్చే చిన్న సినిమాలు ఫైనల్ మ్యాచ్ ను తట్టుకుంటాయా లేదా అనేది ఆసక్తిగా మారింది. బలమైన టీమిండియా గేమ్ చూసేందుకు క్రికెట్ లవర్స్ సండే రోజు ఇంటి నుంచి బయటకు రావడం కష్టమే. ఇక అలాంటిది థియేటర్స్ కు వెళ్లి సినిమా చూడడం అనేది జరగని పని.
ఇంతకు ఈ శుక్రవారం రిలీజ్ అయ్యే సినిమాలేవి అంటే.. మంగళవారం, సప్తసాగరాలు దాటి సైడ్ బి, మై నేమ్ ఈజ్ శృతి, స్పార్క్ లైఫ్, ఏ చోట నువ్వున్నా, జనం, అన్వేషి విడుదలవుతున్నాయి. ఇందులో మంగళవారం, సప్తసాగరాలు దాటి సైడ్ బి తప్పితే మిగతా వాటి గురించి అసలు సాధారణ ఆడియెన్స్ కు మినిమమ్ ఐడియా కూడా లేదు. దీంతో కాస్తో కూస్తో క్రేజ్ ఉన్న మంగళవారం కాస్త పాజిటివ్ టాక్ అందుకున్నా ఆదివారం రోజు జనాలను ఆకర్షించడం కష్టమే అవుతుంది.
ఇక టాక్ తేడాగా ఉంటే మొదటికే మోసం వస్తుంది. ఈ క్రికెట్ మ్యానియా తట్టుకోలేకనే సితార నాగవంశీ ఆదికేశవ సినిమాను వాయిదా వేసుకున్నారు. ఇక ఈ వారం రాబోయే సినిమాలు శుక్రవారం శనివారం ఎంతో కొంత మంచి కలెక్షన్స్ రాబట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఆదివారం మ్యాచ్ ఉండడం వలన ఆ రోజున హోప్స్ పెట్టుకోవడం వృధా. ఇక సోమవారం నుంచి వర్కింగ్ డే కాబట్టి ఆ రోజు నుంచి కలెక్షన్స్ రావడం కష్టం. ఏది ఏమైనప్పటికీ ఈ వారం సినిమాలకు సండే ఫైనల్ మ్యాచ్ గట్టిగానే కంగారు పెడుతోంది.