ఈసారి అలాంటి తప్పు చేయను: విక్టరీ వెంకటేష్
అయితే సీజన్ 1 జయాపజయాలతో సంబంధం లేకుండా ఇప్పుడు వెంకీ చెప్పిన మాట అభిమానులకు షాకిచ్చింది.
విక్టరీ వెంకటేష్ ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. తన సోదరుని కుమారుడు రానా దగ్గుబాటితో కలిసి 'రానా నాయుడు' లాంటి ప్రయోగం చేసాడు. కానీ రానా నాయుడు ప్రారంభ సీజన్ లో పచ్చి భాష తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఇలాంటి చెత్త సిరీస్ లో వెంకీని చూడలేకపోయామని అభిమానులు ఆవేదన చెందారు. అయితే సీజన్ 1 జయాపజయాలతో సంబంధం లేకుండా ఇప్పుడు వెంకీ చెప్పిన మాట అభిమానులకు షాకిచ్చింది. రానా నాయుడు రెండో సీజన్ ఉంటుందని, ఈసారి మరింత జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశాన్ని వెంకటేష్ దగ్గుబాటి వ్యక్తం చేశారు.
ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో వెంకటేష్ మొదటి సీజన్‌కు ప్రేక్షకుల స్పందనల గురించి ప్రసంగించారు. వెబ్ షో సీజన్ 1 మిశ్రమ సమీక్షలను పొందినప్పటికీ, రెండవ సీజన్ చాలా విషయాలను పరిగణనలోకి తీసుకుని ముందుకు వెళతామని తెలిపారు. అసభ్యకరమైన భాష రిపీట్ కాకుండా జాగ్రత్తపడతానని వెంకీ అభిమానులకు హామీ ఇచ్చాడు.
రానా నాయుడు ప్రారంభ సీజన్లో అందులో ఉపయోగించిన పచ్చి భాష తీవ్ర విమర్శలకు కారణమైంది. ఇప్పుడు ఇంటర్వ్యూలో వెంకటేష్ ఆ తప్పును అంగీకరించాడు. రెండవ సీజన్లో జాగ్రత్తగా ఉండాలనే తన ఉద్దేశాన్ని తెలిపాడు. ``ఈసారి నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ఈసారి ఎవరినీ కించపరచకూడదనే ఉద్దేశ్యంతో ఉన్నాను. అయితే ఇది అల్లర్ల నేపథ్యంలో సాగే సినిమా. మొదటి సీజన్ విమర్శల నుండి నేర్చుకున్నాను. కంటెంట్ వీక్షకుల ఆదరణ చాలా కీలకమని వెంకీ చెప్పాడు. 2024 జనవరిలో రానా నాయుడు 2 చిత్రీకరణ ప్రారంభించబోతున్నట్లు వెంకటేష్ తెలిపారు.