రజనీకాంత్ చిరంజీవి ఆ ఇద్దరిలో ఎవరితో ముందుగా?
సూపర్ స్టార్ తో బింబిసార దర్శకుడి ట్రయల్ ఎంతవరకూ?
వయసు మీద పడే కొద్దీ రజనీ కాంత్ లో ఉత్సాహం పెరుగుతోందే కానీ తరగడం లేదు. ఆయన బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ నేటి తరానికి ఠఫ్ కాంపిటీటర్ గా మారుతున్నారు. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన `జైలర్` విడుదలకు సిద్ధమవుతున్న క్రమంలో రజనీకాంత్ మరో రెండు చిత్రాలకు సన్నాహాలు చేస్తుండడం ఉత్కంఠను పెంచుతోంది.
ఇప్పటికే `బింబిసార` ఫేం వశిష్ట్ తో సినిమాకి రజనీకాంత్ ఓకే చెప్పారని ప్రచారమవుతోంది. ఇంతకుముందు `బింబిసార` సినిమాని వీక్షించిన రజనీకాంత్ దర్శకుడు వశిష్ఠ్ ని తన ఇంటికి పిలిపించుకుని మరీ అభినందించారు. ఆ తర్వాత వశిష్ఠ్ వినిపించిన లైన్ కి రజనీ ఓకే చెప్పారని త్వరలోనే ఈ జోడీ కలిసి పని చేస్తారని ప్రచారమైంది.
కానీ ఇప్పుడు రజనీకాంత్ తో సినిమా చేయాలంటే వశిష్ఠ్ కి ఇంకో ఏడాది పైగానే సమయం పడుతుందని గుసగుస వినిపిస్తోంది. రజనీ తన కెరీర్ 171వ సినిమాని విక్రమ్ ఫేం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో చేస్తున్నారు. అంటే ఈ సినిమా పూర్తయ్యేసరికి కనీసం సంవత్సరం అయినా పడుతుంది. అంటే 2024 చివరి వరకూ రజనీ బిజీగా ఉంటారు. ఆ తర్వాత వశిష్ఠ్ తో స్క్రిప్టు ఫైనల్ చేసుకుని సెట్స్ పైకి వెళ్లేందుకు అవకాశం ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆగస్టు రెండవ వారంలో జైలర్ విడుదలైన వెంటనే తన తదుపరి చిత్రాన్ని రజనీ ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఇక ఇప్పటికే దళపతి విజయ్ తో లియో చిత్రీకరణను పూర్తి చేసి రిలీజ్ కి రెడీ చేయిస్తున్న లోకేష్ కనగరాజ్ త్వరలో రజనీతో సినిమా కోసం అన్నిరకాలా పనులు ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి.. రామ్ చరణ్ లతో సినిమాలు చేసేందుకు బింబిసార దర్శకుడు తనవంతు ప్రయత్నాల్లో ఉన్నారు. ఆ ఇద్దరిలో ఎవరో ఒకరితో సినిమాని పట్టాలెక్కించేందుకు వీలుందని తెలుస్తోంది.