పుష్ప 2, గేమ్ ఛేంజర్.. అప్పుడు కూడా డౌటే
ఈ ఏడాది మరో మూడు నెలల్లో ముగిసిపోనుంది. పాన్ ఇండియా బాక్సాఫీస్ ముందు తెలుగు హీరోల్లో ప్రభాస్ ఒక్కడే సలార్‌తో సందడి చేసే అవకాశం ఉంటుంది.
ఈ ఏడాది మరో మూడు నెలల్లో ముగిసిపోనుంది. పాన్ ఇండియా బాక్సాఫీస్ ముందు తెలుగు హీరోల్లో ప్రభాస్ ఒక్కడే సలార్‌తో సందడి చేసే అవకాశం ఉంటుంది. లేదంటే ఆ చిత్రం కూడా వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అవ్వొచ్చు. అయితే వచ్చే ఏడాది 2024 మాత్రం అలా కాదు. సూపర్ స్టార్ మహేశ్ బాబు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ఇలా అందరీ హీరోల వరుస సినిమాలు ఆడియెన్స్‌ను అలరించేందుకు రెడీగా అవుతున్నాయి.
అయితే ఈ హీరోల్లో అల్లు అర్జున్ పుష్ప 2, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్స్‌పై సందిగ్ధత నెలకొంది. ఈ చిత్రాలన్ని వచ్చే ఏడాది వేసవికి రిలీజ్ చేసే అవకాశముందని మొన్నటి వరకు ప్రచారం సాగింది. కానీ ఇప్పుడా పరిస్థితి కనపడట్లేదు. అల్లు అర్జున్ పుష్ప 2ను సమ్మర్ కన్నా ముందే మార్చి చివర్లో రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారట.
అలానే గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్‌పై మరింత సస్పెన్స్ నెలకొంది. ఈ చిత్రాన్ని దిగ్గజ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్నారు. ఈయన ఈ చిత్రంతో పాటు కమల్ హాసన్‌తో ఇండియన్ 2 కూడా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని పంద్రాగస్ట్న రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఈ సినిమా రిలీజయ్యాకే గేమ్ ఛేంజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మూవీటీమ్ అనుకుంటోందట. అంటే ఈ లెక్కన ఈ చిత్రం వచ్చే ఏడాది చివర్లో వచ్చే అవకాశముంటుంది. లేదంటే చెప్పలేం ఎప్పుడు వస్తుందో.. చూడాలి మరి ఏం జరుగుతుందో..
పుష్ప 2 షూటింగ్ విషయానికొస్తే.. షెడ్యూల్స్ కాస్త ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. తొలి భాగానికి వచ్చిన రెస్పాన్స్ నేపథ్యంలో రెండో భాగాన్ని దర్శకుడు సుకుమార్ మరింత జాగ్రత్తగా గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు. కాస్త లేటైనా ఎక్కడా రాజీపడకుండా చిత్రీకరిస్తున్నారట. ఇప్పటివరకు 1/3 షూటింగ్ జరిగిందని తెలిసింది. మిగతా భాగం చిత్రీకరణ పూర్తి చేసుకోవడానికి మరింత సమయం పడుతుంది. ఒకవేళ ఈ చిత్రం వచ్చే ఏడాదికి పూర్తి కాకపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఇక గేమ్ ఛేంజర్ విషయానికొస్తే.. ఈ చిత్ర షూటింగ్ ఎంత వరకు కంప్లీట్ అయిందో ఇంకా ఎటువంటి వివరాలు తెలియలేదు. ఆ మధ్యలో ఈ చిత్ర నిర్మాత దిల్రాజును అడిగితే తనకేం సంబంధం లేదని అంతా శంకరే చూసుకుంటున్నారని చెప్పారు. పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది.