ముచ్చటగా 3 కప్పుల కాఫీతో గుండెకు అంత మేలు!

కాఫీ తాగండి.. ఆరోగ్యంగా ఉంటారు. కాఫీ తాగుతున్నారా? మీకు కష్టమే.

Update: 2024-09-19 05:30 GMT

కాఫీ తాగండి.. ఆరోగ్యంగా ఉంటారు. కాఫీ తాగుతున్నారా? మీకు కష్టమే. ఇలా కాఫీ.. టీలకు సంబంధించి విరుద్ధమైన అధ్యయనాలు రావటం ఎప్పటి నుంచో ఉన్నదే. తాజాగా రోజుకు మూడు కప్పుల కాఫీతో గుండె ఆరోగ్యం ఎంతో బాగుంటుందన్న అంశాన్ని చెబుతూ ఒక రిపోర్టు విడుదలైంది. అయితే.. నోటి మాటగా చెప్పటం కాకుండా.. రోజుకు మూడు కప్పుల కాఫీతో జరిగే మేలు లెక్కను వివరంగా చెప్పటం ఆసక్తికర అంశంగా చెప్పాలి. రోజుకు 3 కప్పుల కాఫీ తీసుకుంటే..శరీరంలో జరిగే పరిణామాలు.. చోటు చేసుకునే మార్పుల గురించి వివరంగా చెప్పుకొచ్చారు.

ఇంతకూ ఈ అధ్యయనాన్ని ఎవరు చేశారు? ఎలా చేశారన్న విషయంలోకి వెళితే.. చైనాలోని సూఖౌ వర్సిటీకి చెందిన సుఝౌ మెడికల్ కాలేజీ రీసెర్చర్లు విశ్లేషించారు. దాదాపు 1.72 లక్షలమంది నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ అధ్యయనం చేపట్టారు. దీనికిసంబంధించిన వివరాల్ని క్లినికల్ ఎండోక్రోనాలజీ - మెటబాలిజం జర్నల్ లో పబ్లిష్ చేశారు. ఇంతకు సదరు అధ్యయనం ఏం చెప్పింది? రోజుకు మూడు కాఫీలు తాగితే ఆరోగ్య పరంగా ఎలాంటి ప్రయోజనాలు పొందొచ్చు? దానికి కారణాలేంటి? అన్న వివరాల్ని చూస్తే..

- మధుమేహం.. స్థూలకాయం.. ఫ్యాటీ లివర్ తో సహా అనేక జీవక్రియలకు సంబంధించిన అనారోగ్యాల ముప్పు అవకాశాల తీవ్రతను 40-48 శాతం తగ్గిస్తుంది.

- గుండెకు సంబంధిత జీవక్రియలు ఇబ్బందులుఎదుర్కోవటం లేదు. హార్ట్ ఎటాక్.. స్ట్రోక్ లు లేవు

- ఇలాంటి ఇబ్బందులు ఎదురుకాని వారంతా రోజుకు మూడు కప్పుల కాఫీ తీసుకున్నట్లు గుర్తించారు.

- 200-300 మిల్లీ గ్రాముల కెఫిన్ వారు రోజూ తీసుకుంటున్నట్లు తేల్చారు.

- రోజుకు ఈ మోతాదులో కెఫిన్ తీసుకోవటం ద్వారా స్థూలకాయం.. అధిక కొలెస్ట్రాల్.. మధుమేహం తదితర వ్యాధులు పెరగకుండా ఉండే ముప్పును 40-48 శాతం తగ్గించుకోగలిగారు.

Tags:    

Similar News