కిడ్నీలో రాళ్ల సమస్య... వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!
వాస్తవానికి కిడ్నీలో రాళ్లు ఫలానావారికే వస్తాయని చెప్పడం కష్టం అని అంటారు. ఇందుకు జన్యుపరమైన అంశాలు కూడా కారణం అని చెబుతుంటారు.
జీవితంలో నాలుగు రాళ్లు వెనకేసుకోమని పెద్దలు చెబుతుంటారు.. ఫలితంగా ముందు ముందు భవిష్యత్తులో ఆర్ధికపరమైన ఇబ్బందులు ఉండవనేది వారి ఉద్దేశ్యం! అయితే... జీవితంలో నాలుగు రాళ్లు సంగతి అలా ఉంటే... శరీరంలో నాలుగు రాళ్లు వెనక్కి చేరితే మాత్రం.. అది కలిగించే బాధ వర్ణనాతీతం అనే విషయం అది అనుభవించినవారికి తప్ప మరొకరికి తెలిసే అవకాశం లేదు! అది అనుభవించినవారిని ఈ బాధ గురించి చెప్పమంటే... మత్తు మందు ఇవ్వకుండా పెద్ద ఆపరేషన్ చేసినట్లు ఉంటుందని చెబుతుంటారు.
మరి అలాంటి కిడ్నీలో రాళ్ల సమస్య అసలు ఎందుకు వస్తుంది.. రాకుండా తీసుకునే జాగ్రత్తలు ఏమిటి.. వస్తే తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి.. అసలు ఇవి ఎన్ని రకాలు.. ఏ రకం తత్వం ఎలా ఉంటుంది.. పైగా ఈ సమస్య వచ్చే అవకాశం ఉన్నవారు వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి.. మొదలైన విషయాలను ఇప్పుడు చూద్దాం...!
కిడ్నీలో రాళ్లు ఎవరిలో, ఎందుకు ఏర్పడతాయి?:
వాస్తవానికి కిడ్నీలో రాళ్లు ఫలానావారికే వస్తాయని చెప్పడం కష్టం అని అంటారు. ఇందుకు జన్యుపరమైన అంశాలు కూడా కారణం అని చెబుతుంటారు. ఇదే సమయలో ఎక్కువ కాలంపాటు శరీరంలో నీటిశాతం తగ్గటం దీనికి ఒక కారణం కావొచ్చు అని నిపుణులు చెబుతున్నారు.
ఇక ఇవి ఎందుకు ఏర్పడతాయి అనే విషయానికొస్తే... సాధారణంగా మూత్రకోశంలో రెండు రకాల రాళ్లు ఏర్పడతాయి! ఇందులో ఒకటి మూత్రాశయంలో తయారయ్యేవి కాగా.. రెండోది కిడ్నీలో తయారయ్యేవి. వీటిలో మూత్రాశయంలో ఏర్పడేవి సాధారణంగా చిన్న పిల్లలు, వృద్ధుల్లో కనిపిస్తాయి. ఈ క్రమంలో పిల్లలో డీహైడ్రేషన్ వల్ల.. పెద్ద వయసులో ప్రోస్టేట్ గ్రంథి ఉబ్బటం, విసర్జన సాఫీగా సాగకపోవటం వల్ల రాళ్లు ఏర్పడుతుంటాయి!
ఇదే సమయంలో 25 నుంచి 40 ఏళ్ల వారిలో కిడ్నీలో రళ్లు ఎక్కువగా ఏర్పడటం జరుగుతుంది! ఇవి కిడ్నీలో తయారయ్యి మూత్రనాళాల్లోకి వస్తాయి.
లక్షణాలేమిటి..?:
కిడ్నీలో రాళ్లు సమస్య ఉంటే.. అది బయట పడే క్రమంలో ప్రధానంగా వచ్చే లక్షణం నొప్పి.. భరించలేని నొప్పి! వాస్తవానికి మూత్రనాళం సుమారు 5 మిల్లీ మీటర్ల వ్యాసం కలిగి ఉంటుంది. అందువల్ల... దీనికన్న చిన్న సైజు రాళ్లయితే నొప్పు పుడుతున్నప్పటికీ.. మెల్లిగా మూత్రంతో పాటు బయటకు వచ్చేస్తాయి. అయితే 7 - 8 మి.మీ. కన్న పెద్ద రాళ్లయితే మాత్రం మూత్రనాళం వంపుల్లో చిక్కుకుపోతాయి.
దీంతో ఆ ప్రాంతంలో ఇన్ ఫెక్షన్ మొదలవుతుంది. ఆ సమయంలో తలెత్తే నొప్పి తీవ్రంగా ఉంటుంది. ఇందులో భాగంగా ఈ నొప్పి పక్కటెముకల కింద మొదలై.. వీపు వెనక మీదుగా విస్తరిస్తుంది. దీంతోపాటు 102, 103 డిగ్రీల ఫారన్ హీట్ తో చలిజ్వరం రావొచ్చు. ఇదే సమయంలో మూత్రమార్గంలో రాయి గీసుకుపోయి రక్తం కూడా పడొచ్చు.
నివారణ?:
కిడ్నీలో రాళ్లు ఏర్పడే తత్వం కలిగిన వారు రెగ్యులర్ గా పాటించాల్సిన విషయం... శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి. ఒకసారి 300 - 400 మిల్లీ లీటర్ల చొప్పున రోజుకు కనీసం 2 - 2.5 లీటర్ల మూత్రం విసర్జిస్తుంటాం! దీనికి తగ్గట్లుగానే రోజూ కనీసం రెండు మూడు లీటర్ల నీళ్లు, ద్రవాలు తీసుకోవాలి. వేసవిలో అయితే మరింత ఎక్కువగా తీసుకోవాలి. ఎండలో తిరిగేవారికీ, వ్యాయామం చేసేవారికీ ఇది మరింత ముఖ్యం.
మామూలుగా నీళ్లు తీసుకోలేకపోతే అందులో కొన్ని సార్లు నిమ్మరసం వంటివి కలిపి తీసుకోవచ్చు. ఇదే సమయంలో బార్లీ నీళ్లు, పల్చటి మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటివి తాగొచ్చు. ప్రధానంగా... మూత్రం రంగు నీళ్ల మాదిరి వచ్చేలా చూసుకోవాలి. మూత్రం పసుపు పచ్చగా వస్తే మాత్రం ఒంట్లో నీరు తగ్గిందని అర్ధం చేసుకోవాలి. ఫలితంగా రాళ్లు ఏర్పడే అవకాశం ఉందని గ్రహించాలి!
ఆహర నియమాలు!:
ఇప్పటికే కిడ్నీలో రాళ్లు ఉన్నవారు పాలు, పెరుగు, మజ్జిగ వంటివి తక్కువగా తీసుకోవాలి. అలాగని పూర్తిగా మానేసి కాల్షియం లోపం తెచ్చుకోకుండా చూసుకోవాలి! ఇదే సమయంలో... పాలకూర, టమోటా, క్యాబేజీ, వింజ పప్పులు వంటివి వీటిని మానేయడం మంచింది. ఒక వేళ తీసుకుంటే... నీళ్లు ఎక్కువగా తాగాలి! ఇదే సమయంలో యూరిక్ ఆమ్లం రాళ్లు గలవారు మాంసాహారం విషయంలో మితం పాటించాలి!