బరువు పెరుగుతున్న ఆంధ్రులు... ఆందోళనకరంగా సర్వేలు!
ఈ రోజుల్లో చిన్న పెద్దా అనే తేడా లేకుండా... ఒబెసిటీ అనేది అతిపెద్ద సమస్యగా ఉన్న సంగతి తెలిసిందే.
ఈ రోజుల్లో చిన్న పెద్దా అనే తేడా లేకుండా... ఒబెసిటీ అనేది అతిపెద్ద సమస్యగా ఉన్న సంగతి తెలిసిందే. పిల్లల్లో అయితే ప్రధానంగా జంక్ ఫుడ్ తో పాటు.. సెల్ ఫోన్ లో ఆటలే తప్ప మైదానంలో ఆటలు దాదాపు పూర్తిగా తగ్గించేయడం ఒక ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఇక పెద్దలకు ఈ స్థూలకాయం raaవడానికి చాలానే కారణాలు ఉన్నాయని అంటున్నారు.
ఇందులో ప్రధానంగా మారుతున్న జీవిన శైలి, ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం, ఒత్తిడి మొదలైనవి కారణాలని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో... పిల్లలైనా, పెద్దలైనా.. అత్యధిక చక్కెర, కొవ్వులతో కూడిన ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల వినియోగంపై అప్రమత్తత అవసరమని అభిప్రాయాలు తెరపైకి వస్తున్నాయి. ఈ సమయంలో ఆర్థిక సర్వేలో ఆందోళన వ్యక్తమయ్యింది.
అవును... దేశంలో పెరుగుతున్న స్థూలకాయంపై ఆర్థిక సర్వేలో ఆందోళన వ్యక్తమైంది. దేశంలో 54 శాతం అనారోగ్య సమస్యలకు, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లే కారణమని పేర్కొంది. పౌరులు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవడమే దీనికి పరిష్కరం అని వెల్లడించింది.
ఇదే సమయంలో... ఇటీవల ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐ.సీ.ఎం.ఆర్) నివేదికను ఉటంకిస్తూ... అధిక చక్కెర, కొవ్వులతో కూడిన ప్రాసెస్డ్ ఫుడ్స్ వినియోగం విపరీతంగా పెరిగిందని సర్వే తెలిపింది. ప్రధానంగా ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడం అధిక బరువు లేదా స్థూలకాయానికి కారణం అవుతోందని విశ్లేషించింది.
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్.ఎఫ్.హెచ్.ఎస్.) నివేదిక ప్రకారం... గ్రామీణ ప్రాంతాల్లో స్థూలకాయ సమస్య 19.3 శాతం ఉండగా.. అర్బన్ లో ఇది 29.8 శాతంగా ఉంది. ఇక రాష్ట్రాల విషయానికొస్తే... ఢిల్లీలో మహిళలు 41.3 శాతం, పురుషులు 38శాతం ఈ సమస్యతో బాధపడుతుండగా.. తమిళనాడులో పురుషులు 37, మహిళలు 40.4 శాతం మందికి స్థూలకాయం ఉందని చెబుతున్నారు.
ఈ క్రమంలో... దేశంలో ఇలా ఢిల్లీ, తమిళనాడులు వరుసగా ఒకటి, రెండు స్థానాల్లో ఉండగా... ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే పురుషుల్లో 31.1, మహిళల్లో 36.3 శాతంమంది స్థూలకాయంతో ఇబ్బందిపడుతున్నారని ఆర్థిక సర్వే పేర్కొంది. ఇక ప్రపంచం విషయానికొస్తే... వియత్నాం, నమీబియా తర్వాత స్థానంలో భారత్ ఉందంటూ వరల్డ్ ఒబెసిటీ ఫెడరేషన్ నివేదికను ఆర్థిక సర్వే ఉంటకించింది.