43శాతం మంది టెక్కీలకు ఆరోగ్య సమస్యలు... కారణాలు ఇవే!
ఉరుకు పరుగుల జీవితానికి తోడు విపరీతమైన ఒత్తిడి, సమయం సందర్భం లేని టార్గెట్స్ వారికి బోనస్ అని చెప్పుకోవచ్చు!
ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు.. అది కూడా అర్ధరాత్రి, అపరాత్రి అనే తారతమ్యాలు లేకుండా... సగటు ఉద్యోగి ఉరుకుల పరుగుల జీవితం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రధానంగా టెక్ ఉద్యోగుల సంగతైతే సరేసరి. ఉరుకు పరుగుల జీవితానికి తోడు విపరీతమైన ఒత్తిడి, సమయం సందర్భం లేని టార్గెట్స్ వారికి బోనస్ అని చెప్పుకోవచ్చు! ఈ సమయంలో తాజాగా నిర్వహించిన ఒక అధ్యయనం... టెక్కీల హెల్త్ ఇష్యూస్ పై ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించింది.
అవును... భారత్ లోని ప్రముఖ ఎంప్లాయీ హెల్త్ కేర్ బెనిఫిట్స్ ఫ్లాట్ ఫాం ఆన్ ష్యూరిటీ ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో టెక్ ఉద్యోగులూ తీవ్ర సమస్యలను ఎదుర్కోంటున్నారని తెలిపింది! ఇందులో భాగంగా... దేశంలోని టెక్ నిపుణులు ఎదుర్కోంటున్న హెల్త్ ప్రాబ్లంస్ ను "బరీయింగ్ ది బర్నౌట్: డీకోడింగ్ ది హెల్త్ ఛాలెంజెస్ ఆఫ్ ఇండియాస్ టెక్ జీనియస్" పేరిట ఫలితాలు వెల్లడించింది. ఈ అధ్యయనం ప్రధానంగా... శారీరయ, మానసిక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవడానికి గల కారణాలపై దృష్టి సారించింది.
ఈ క్రమంలో టెక్కీలు ఎక్కువగా అనారోగ్య సమస్యల భారిన పడటానికి లాంగ్ వర్కింగ్ అవర్స్ ప్రధాన కారణం అని అంటున్నారు. ఈ క్రమంలో దేశంలోని టెక్ ప్రొఫెషనల్స్ లో దాదాపు 43శాతం మంది ఎక్కువ పనిగంటల కారణంగా ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారని అధ్యయనం వెల్లడించింది. ఈ ప్రొఫెషనల్స్ లో సుమారు 50 శాతం మంది వారానికి సగటున 52.5 గంటలు పనిచేస్తున్నారంట. అంటే... నేషనల్ యావరేజ్ వర్కింగ్ అవర్స్ 47.5 ని అధిగమించి పనిచేస్తున్నారన్నమాట!
ఫలితంగా... వెన్ను నొప్పి, మెడ నొప్పి, అసిడిటీ, నిద్రలేమి, మజిల్ స్టిఫ్ నెస్, బరువు పెరగడం, కంటి చూపు సంబంధిత సమస్యలు తలెత్తడం, తీవ్రమైన తలనొప్పి రావడం మొదలైన అనేకనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తోందని చెబుతున్నారు. ఇదే సమయంలో సుమారు 26శాతం మంది టెక్ ప్రొఫెషనల్స్ క్రమ రహిత నిద్రతో ఇబ్బందులు పడుతుండగా.. సుమారు 51శాతం మంది రోజుకు సగటున 5.5 - 6 గంటల సేపు మాత్రమే నిద్రపోతున్నారని అధ్యయనం పేర్కొంది.
ఇలా ఎక్కువ పనిగంటల కారణంగా నిద్రలేమి సమస్యలు వస్తే.. అలా తగినంత నిద్రలేకపోవడం వల్ల మధుమేహం, ఊబకాయం, గుండె జబ్బులు, రక్తపోటు, టెన్షన్, డిప్రెషన్ వంటి సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇదే క్రమంలో... సుమారు 74శాతం మంది టెక్ ప్రొఫెషన్స్... తమ పని ఒత్తిడి, వర్క్ డిమాండ్స్ వల్ల ఫ్యామిలీ ఈవెంట్స్ కి, వేడుకలకూ హాజరుకాలేకపోతున్నట్లు అధ్యయనంలో తేలిందని.. ఇలా పర్సనల్ లైఫ్ లో ఇతర సంతోషాలు లేకుండా పోతున్నాయని చెప్పారని అంటున్నారు!