ఆప్ మీద మరో బండ.. రూ.7 కోట్ల విదేశీ నిధుల్ని సేకరించిందట

తరచూ సంచలన పరిణామాలతో వార్తల్లోకి ఎక్కుతున్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఇప్పుడు మరో సమస్య వచ్చి పడింది.

Update: 2024-05-21 04:08 GMT

సామాన్యుడి పార్టీగా మొదలైన ఆమ్ ఆద్మీ అనూహ్యంగా ఢిల్లీ రాష్ట్రంలో వరుస పెట్టి అధికారాన్ని సొంతం చేసుకోవటం తెలిసిందే. అయితే.. ఇటీవల కాలంలో ఆ పార్టీ మీద వస్తున్న ఆరోపణలు షాకింగ్ గా మారుతున్నాయి. నిజాయితీగా ప్రజలకు సేవ చేయటమే లక్ష్యంగా తెర మీదకు వచ్చిన ఆ పార్టీ మీద ఇప్పుడు సంచలన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొన్నటికి మొన్న ఢిల్లీ లిక్కర్ స్కాం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారగా.. ఇటీవల ఆ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మీద రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసంలోనే దాడి జరగటం తెలిసిందే.

తరచూ సంచలన పరిణామాలతో వార్తల్లోకి ఎక్కుతున్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఇప్పుడు మరో సమస్య వచ్చి పడింది. ఆ పార్టీ అక్రమ మార్గంలో రూ.7కోట్లకు పైనే విదేశీ నిధుల్ని సేకరించినట్లుగా ఈడీ పేర్కొంది. 2014 నుంచి 2022 వరకు రూ.7.08 కోట్ల విదేశీ నిధులను ఆ పార్టీ పొందిందని.. విదేశీ విరాళాల నియంత్ర చట్టం.. ఐపీసీ (ఇండియన్ పీనల్ కోడ్)లోని నిబంధనల్ని ఉల్లంఘించినట్లుగా ఈడీ చెబుతోంది.

ఇదే విషయాన్ని కేంద్ర హోం శాఖకు ఈడీ నివేదించింది. ఆమ్ ఆద్మీ నాయకులు విదేశీ నిధుల సేకరణలో పలు అవకతవకలకు పాల్పడ్డారని.. కెనడాలో సేకరించిన నిధులను ఆ పార్టీ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్ తో సహా పలువురు తమ సొంత ప్రయోజనాల కోసం వాడుకున్నట్లుగా ఆరోపించారు. విదేశీ దాతల వివరాలతోపాటు వారి జాతీయతతకు సంబంధించిన అనేక వాస్తవాల్ని ఆమ్ ఆద్మీ దాచి పెట్టినట్లుగా ఆరోపణల్ని ఎదుర్కొంటున్నారు.

అమెరికా.. కెనడా.. ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓవర్సీస్ ఇండియా అనే సంస్థను ఏర్పాటు చేసిందని.. దీని పని పార్టీకి నిధులను సమీకరించటమేనని పేర్కొంది. తమ విచారణలో ఈ అంశాలు బయటపడినట్లుగా ఈడీ ఆరోపించింది. పార్టీకి నిధులు అందించిన దాతలు ఒకే పాస్ పోర్టు నంబరు.. మొయిల్ ఐడీలు.. మొబైల్ నెంబర్ల.. క్రెడిట్ కార్డులకు పార్టీ ఫండ్ అందించారన్న ఈడీ లెక్కల ప్రకారం విదేశాలకు చెందిన 155 మంది 55 పాస్ పోర్టుల ద్వారా రూ.1.02 కోట్లు.. 71 మంది దాతలు 21 మొబైల్ నెంబర్ల ద్వారా రూ.99.90లక్షలు.. మరో 75 మంది 15 క్రెడిట్ కార్డుల ద్వారా రూ.19.92 లక్షల మొత్తాల్ని విరాళాల రూపంలో అందజేసినట్లుగా లెక్కల్ని విప్పి చెప్పింది.

ఈ ఆరోపణలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. తాజా పరిణామాల నేపథ్యంలో తమ మీద వచ్చిన ఆరోపణల్ని ఆమ్ ఆద్మీ పార్టీ కొట్టిపారేసింది. ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ ముఖ్యమంత్రి కం తమ పార్టీ అధినేత కేజ్రీవాల్ ను చూసి భయపడుతున్నట్లుగా పేర్కొంది. తాజాగా వెలుగు చూసిన వ్యవహారం మొత్తం ఈడీది కాదని మొత్తంబీజేపీ పనిగా పేర్కొన్నారు.

చాలా ఏళ్ల క్రితం జరిగిన ఈ కేసుకు సంబంధించి తమ వివరాల్ని.. తమ వైఖరిని ఇప్పటికే కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు.. ఎన్నికల కమిషన్ కు తెలియజేసినట్లుగా పేర్కొన్నారు. ఈడీ వర్సస్ ఆమ్ ఆద్మీపార్టీగా మారిన ఈ ఆరోపణల పరంపర ఎక్కడి వరకు వెళుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

Tags:    

Similar News