ఎన్నికల పోరులో తండ్రీ కూతురు.. పరస్పరం 'ఓటమి' పిలుపు!
ఇక, ఇప్పుడు ఈ సంస్కృతి మహారాష్ట్ర వరకు పాకింది.
రాజకీయాలకు.. కుటుంబ సంబంధాలకు మధ్య సునిశితమైన 'బంధం' తెగిపోతోంది. ఏపీలో జరుగుతున్న పరిణామాలు అందరినీ విస్మయానికి గురి చేస్తున్న విషయం తెలిసిందే. ఇక, ఇప్పుడు ఈ సంస్కృతి మహారాష్ట్ర వరకు పాకింది. కన్న తండ్రిని చిత్తుగా ఓడించాలని కుమార్తె పిలుపునిస్తుంటే.. కడుపున కుమార్తెను చిత్తుచిత్తుగా ఓడించాలని తండ్రి పిలుపునిస్తున్నారు. ఇలా.. మహారాష్ట్ర చరిత్రలో తొలిసారి తండ్రి కుమార్తెలు ఒకరినొకరు ఓడించాలంటూ.. రోడ్డెక్కడంతో ఇక్కడి రాజకీయాలపై ఆసక్తి మరింత పెరిగింది. ఇద్దరూకూడా ఉన్నత విద్యావంతులు కావడం మరో విశేషం.
ఎవరు? ఏ పార్టీ..
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చేనెల 20న 288 స్థానాలున్న అసెంబ్లీకి ఒకే విడతలో ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పలు పార్టీలు ఇప్పటికే తమ తమ అభ్యర్థులకు టికెట్లు ఖరారు చేశాయి. ఈ క్రమంలో నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ రెండు ముక్కలు అయిన విషయం తెలిసిందే. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(అజిత్ పవార్), నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(శరద్ పవార్)ల నుంచి తండ్రీ కుమార్తెలు బరిలో నిలిచారు. ఇద్దరూ ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇద్దరూ కూడా ధనవంతులే కావడం గమనార్హం. దీంతో రాజకీయాల్లో తమదైన శైలిలో దూసుకుపోతున్నారు.
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అహేరీ అసెంబ్లీ నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అహేరి నియోజకవర్గం నుంచి ఎన్సీపీ(అజిత్ పవార్) తరఫున ప్రస్తుతం ఏక్‌నాథ్ షిండే కేబినెట్‌లో మంత్రిగా ఉన్న ధర్మారావుబాబా ఆత్రమ్ పోటీ చేస్తున్నారు. ఇక, ఈయనపై ఎన్సీపీ (శరద్ పవార్) పార్టీ నుంచి స్వయంగా ఆయన కుమార్తె భాగ్యశ్రీ బరిలో నిలిచారు. రెండుగా చీలిపోయిన ఒకే పార్టీ నుంచి ఒకే కుటుంబంలోని తండ్రీకుమార్తెలు పోటీ చేస్తుండడం చిత్రంగా ఉంది. ఇక, వీరు తమ ప్రచారంలో ఒకరిని ఓడించాలని.. మరొకరు పిలుపునిస్తున్నారు.
అంతేకాదు.. భాగ్యశ్రీ మరో అడుగు ముందుకు వేసి.. తన తండ్రి వయసును కూడా ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం ధర్మారావు బాబా వయసు 72 ఏళ్లు. దీనిని ఎక్కువగా ప్రస్తావిస్తూ.. `ఆయన ఆయనకే ఏమీ చేసుకోలేని విధంగా ఉన్నారు. ఇక, మీకు ఏం చేస్తారు`` అని సూటి పోటి విమర్శలు చేస్తున్నారు. అయితే.. తన కుమార్తెపై ధర్మారావు కూడా ఏమీ తక్కువ తినలేదు. ఇంటి పని, వంట పనిచేయడం రాదని, నిత్యం జొమాటో నుంచి తన అల్లుడు అన్నం తెప్పించుకుని తింటాడని.. అలాంటిది ప్రజలకు ఏం చేస్తుందని ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు. వీరి రాజకీయంపై సోషల్ మీడియాలో పంచ్‌లు పేలుతున్నాయి. మరి ప్రజలు ఎవరిని కరుణిస్తారో చూడాలి.